Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూతాపాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో గ్లాస్కోలో జరిగిన కాప్-26 సదస్సు ఆశించిన ఫలితాలు లేకుండానే ముగిసింది. ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు ప్రమాదం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ప్రకృతిలో 1800వ సంవత్సరంలో కర్బనం 250 పీపీయం (పారటికల్స్ ఫర్ మిలియన్) ఉంటే, ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నది. ఇదే కొనసాగితే ప్రపంచం అతలాకుతలం అవుతుంది. కర్బనం ప్రకృతిలో ఉన్న వేడిని పీల్చుకుని, అట్టిపెట్టుకునే లక్షణం కలిగి ఉంటుంది. ఇదే ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం. ప్రస్తుత ఉష్ణోగ్రత 1.5డిగ్రీల సెల్సియస్ దాటరాదు. దానికి అన్ని చర్యలు తీసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని రుతువులతో సంబంధం లేకుండా కుండపోత వానలు, అడవులలో దావానలం, సముద్ర నీటి మట్టం పెరిగిపోయి నగరాలు మునిగే ప్రమాదం పొంచి ఉన్నది. పట్టణాలలో విపరీతమైన వేడి ఏర్పడి ఉండలేకపోవడం, మంచుకొండలు కరిగిపోవడం జరుగుతున్నది. ఇవి ఈ రోజు ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. ఈ స్థితిలో అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) తాజా నివేదిక ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ''కోడ్ రెడ్'' ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పన్నెండు రోజుల పాటు 100 దేశాల అధినేతలు చర్చించుకుని ఒక ఆచరణ యోగ్యమైన కార్యాచరణను రూపొందించలేకపోయారు. 2015లో ప్యారిస్‌లో జరిగిన పర్యావరణ సదస్సు సందర్భంగా చేసిన వాగ్దానాలను సహితం నిలబెట్టుకోలేదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలను తగ్గించుకోవడం చాలా కీలకం. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్యారిస్ ఒప్పందం నుండి బయటకి పోయారు. పర్యావరణ సంక్షోభం లేదని ఆయన వాదించారు. ఇప్పుడు బైడెన్ మళ్ళీ ఒప్పందంలోకి వచ్చారు. అయినా కాప్-26 తీర్మానంలో ఆశాజనక అంశాలు లేవు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీరని అసంతృప్తి మిగిలింది. ఏ కీలక విషయంలోనూ నిర్దిష్ట అంగీకారం, విస్పష్ట నిర్ణయం జరగలేదు. ముంచుకు వస్తున్న ప్రమాదం నుంచి పుడిమిని, జీవరాశిని కాపాడే భరోసా కలిగించకుండానే సదస్సు ముగిసింది.
ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన అంశం సంపన్న దేశాల నిబద్దత. 1997లో రియో డి జనీరోలో జరిగిన పర్యావరణ సదస్సు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో కీలకమైన మలుపు. ఈ సమావేశంలోనే పర్యావరణానికి ఎవరి వలన ఎంత హాని జరుగుతుందో దాని పరిరక్షణకు వారు అంత మొత్తంలో బాధ్యత తీసుకోవాలన్న అవగాహన ఉమ్మడి అవగాహనగా మారింది. అయినా సంపన్న దేశాలు తమ వంతు బాధ్యతను, భారాన్ని మోయడానికి ఏనాడూ సిద్ధం కాలేదు. ప్రపంచ పర్యావరణానికి కార్బన్‌డైఆక్సైడ్ ప్రధాన హానికరం. ప్రస్తుత పరిస్థితిలో పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా పురోగమించేందుకు శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు, పెట్రోల్, డీజిల్ వాడకమే ప్రధానంగా ఉండటంతో వాతావరణంలో కార్బన్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నది. దాని స్వభావం రీత్యానే ఏ దేశంలో తయారైనా పర్యావరణ నష్ట కారకాలు ఆదేశానికే పరిమితం కావు. గాలి, నీరు, ఆకాశంతో పాటు అన్ని దేశాలకూ విస్తరిస్తాయి. అంటే భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజానీకం తమ ప్రమేయం లేకుండా ఈ నష్టాన్ని, ప్రమాదాన్ని భరించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి రియో పర్యావరణ సదస్సు క్లయిమేట్ ఫైనాన్స్ అంటే తమ ప్రమేయం లేకుండా పర్యావరణం కారణంగా నష్టపోయే దేశాలకు పలు పథకాలు, ప్రాజెక్టుల రూపంలో సంపన్న దేశాలు ఆర్థిక సహకారం అందించాలి. ఉదాహరణకు 2009 సదస్సులో ఎటా పదివేల కోట్ల డాలర్లు క్లయిమేట్ ఫైనాన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాని ఆచరణలో పదోవంతు నిధులు కూడా సమకూర్చలేదు. కాని కోవిడ్ కాలంలో సంపన్న దేశాలలో పతనం అయిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి సుమారు 16లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు పర్యావరణ పరిరక్షణ నిధి, కోవిడ్ ఉద్దీపణల మధ్య ఉన్న తేడా గమనిస్తే సమస్య నిధుల కొరత కాదనీ సంపన్న దేశాల నిబద్ధత కొరతేననీ స్పష్టమవుతుంది.
ఈ చర్చలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కీలకమైన చర్చనీయాంశంగా మారింది. భారత్, చైనా దేశాలు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని నియంత్రించకపోతే పర్యావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలను కట్టడి చేయడం సాధ్యం కాదన్న వాదనను సంపన్న దేశాలు ముందుకు తెస్తున్నాయి. బొగ్గు వాడకాన్ని ఒక్కసారిగా అరికట్టలేమని హరిత గృహ వాయువును క్రమంగా తగ్గిస్తామని చైనా 2060, భారత్ 2070లో అరికడతామని గడువు పెట్టాయి. దానితో సమస్య ఇప్పుడు ముగిసింది. కాబట్టి విద్యుత్‌శక్తికి బొగ్గు బదులు సోలార్, గ్యాస్, జలవిద్యుత్ పెద్ద ఎత్తున వినియోగించి బొగ్డు వాడకం తగ్గించాలి. వాహనాలకు పెట్రోల్, డీజిల్ బదులు విద్యుత్ వాడాలి. తద్వారా వాతావరణ సమతుల్యం సాధించవచ్చు.
అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచంలో తన లాభాల కోసం జరిపిన యుద్ధాల వలన పర్యావరణానికి విపరీతమైన నష్టం జరిగింది. అమెరికాలో లక్షల వ్యక్తిగత వాహనాలు ఉంటాయి. అవికూడా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. అందుకే బ్రిటన్ లేబర్ పార్టీ నేత జెర్నీ కోబిన్ అన్నట్టు ఇది వర్గపోరుగా పరణమించింది. వాతావరణ అత్యయిక స్థితి కొందరు సృష్టించే వ్యవస్థల వల్ల పుట్టి అత్యధికుల్ని వేధించే సమస్య అయ్యిందన్న వ్యాఖ్య అక్షరతస్యం. కార్పొరేట్ల లాభాలకు ప్రజల ప్రాణాలకు మధ్య వైరుధ్యం ఇది.