Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు గెలిచాడు. రైతే గెలిచాడు. దేశాన్నీ గెలిపించాడు. తనకు ఏరువాక సాగడమే కాదు, పోరుబాట సాగడమూ తెలుసని నిరూపించాడు. ప్రజాస్వామ్యానికి ఊపిరులూది నియంతృత్వం మెడలు వంచాడు. ఎంత నిరంకుశంగా వ్యవహరించిందీ దుర్మార్గపు రాజ్యం..! అయితేనేం.., అతని అలుపెరగని అసమాన పోరాటపటిమ ముందు అధికారం తలవంచక తప్పలేదు. ఎట్టకేలకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. రాజధాని సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న చారిత్రాత్మక పోరాటానికి ఏడాది నిండుతున్న వేళ... ప్రధాని ప్రకటన ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఆ ప్రకటన వెనుక రైతుల ప్రయోజనాలకు బదులు రాజకీయ అవకాశవాదమే కనిపిస్తుండటం గర్హనీయం.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సందర్భాన్నీ, దాన్ని ప్రకటిస్తూ ప్రధాని చేసిన ప్రసంగాన్నీ పరిశీలిస్తే, ఈ చట్టాల రద్దు వెనుక గుట్టేమిటో బట్టబయలవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ, పంజాబ్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తననూ, తన పార్టీని తిరస్కరిస్తారేమోనన్న భయంతో తప్ప,రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఈ చట్టాలను రద్దు చేయలేదని స్పష్టమవుతుంది. ప్రధాని ఎంతసేపటికీ ఈ చట్టాల పట్లరైతుల్లో అపోహలను తొలగించి ఒప్పించలేకపోయామనే గానీ, తమ చట్టాలు ప్రజా వ్యతిరేకమైనవని ఒప్పుకోకపోవడమే ఇందుకు నిదర్శనం.
నిజానికి చట్టాలను రైతులే కాదు, ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ సమాజమూ ప్రశ్నించింది. ఏలినవారి విధానాలకు రూపకల్పన చేసే ''నిటి అయోగ్'' చీఫ్ కూడా ఈ చట్టాల లక్ష్యమేమిటో ఎప్పుడో సెలవిచ్చారు. కొన్ని లక్షలకోట్ల విలువైన భారత వ్యవసాయ వాణిజ్యాన్ని మొత్తం తమ ఆశ్రితులైన ఓ నాలుగైదు బడా కంపెనీల వారికి కట్టబెట్టడమే మోడీ ప్రభుత్వ ఉద్దేశమనీ, ఆ ఉద్దేశాలను నెరవేర్చడమే ఈ సాగుచట్టాల లక్ష్యమనీ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతే కాదు, ఈ చట్టాలు ప్రజా వ్యతిరేకమైనవి గనుక, రాజకీయ పార్టీలకు ప్రజల ఓట్లు కావాలిగనుక, ఈ అసలు విషయాన్ని వారు బహిరంగంగా ఒప్పుకోరని కూడా ఆయన అప్పట్లోనే చెప్పేశారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, రైతులు ఈ లోగుట్టు కనిపెట్టారు గనుకనే ఇంతటి మహౌద్యమానికి నడుం కట్టారు. ఈ సర్కారుకు దిగరాక తప్పని స్థితి సృష్టించారు.
తెలివిగా ప్రధాని దేశ రైతాంగానికి క్షమాపణలు కూడా చెప్పేసారు. కానీ, ఎన్నికల ప్రయోజనాలు తప్ప ఏ మాత్రం చిత్తశుద్ధీ, పశ్చాత్తాపమూ లేని ఈ క్షమాపణ చేసిన పాపాలన్నిటినీ మాఫీ చేస్తుందా?! అన్నదాతను ఎన్ని ఇక్కట్లకు గురిచేశారు..? ఎంత నెత్తురు కండ్లజూశారు..? రాజధాని చుట్టూ సరిహద్దుల్లో ముళ్లకంచెలతో బంధించారు. రాతిగోడలు నిర్మించారు. కాలు కదపకుండా రహదారుల నిండా ఇనుప శీలలు నాటించారు. లాఠీలతో తలలు బద్దలు కొట్టించారు. తుపాకులను గురిపెట్టి గుండెల్లో తూటాలను దించారు. నిత్యం బాష్పవాయుగోళాలు, జలఫిరంగులు ప్రయోగించారు. నిర్దాక్షిణ్యంగా వాహనాలతో తొక్కించారు. అంతేనా... ఎంత అవమానించారు..?! ఎంత విషం కక్కారు..?! ఆందోళనా జీవులని హేళన చేశారు. అసాంఘిక శక్తులని నిందలు మోపారు. అర్బన్ నక్సలైట్లన్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులన్నారు. పాకిస్థాన్ ఏజెంట్లన్నారు. దేశ ద్రోహులన్నారు. మరి ఇప్పుడు ఎవరికి క్షమాపణలు చెపుతున్నారు..? ఈ పోరాటంలో తమ నిండు ప్రాణాలను నిరసన జెండాలుగా ఎగరేసిన అమరుల బలిదానాలకు ఏమని సమాధానమిస్తారు..?
అందుకే రైతులు ఇప్పుడు ప్రధాని మాటలను నమ్మటం లేదు. రేపు నవంబర్ 26న తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విరమించేది లేదంటున్నారు. పార్లమెంటులో అధికారికంగా ఈ చట్టాలను ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆపేది లేదంటున్నారు. చట్టాల రద్దును ప్రకటించిన ప్రధానిని ''కనీస మద్దతు ధర''కు చట్టబద్దత కల్పించడం గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ మెడపై కత్తిలా వేలాడుతున్న విద్యుత్ సవరణ బిల్లు మాటేమిటని నిలదీస్తున్నారు. ఈ ఎన్నికల తంత్రాలు, రాజకీయ కుతంత్రాలు తమ ముందు చెల్లవు గాక చెల్లవని తేల్చి చెపుతున్నారు. తమ పోరాటం తమ కోసం కాదు దేశం కోసమని నినదిస్తున్నారు. ''నర్తకుని నాట్యాలు - గాయకుని గానాలు, శిల్పకుని శిల్పాలు - చిత్రకుని చిత్రాలు, కందర్సు కయ్యాలు - కవిరాజు కావ్యాలు, కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే'' అన్న కాళోజీ తత్వం ఈ ఏలికలకు ఎప్పటికి బోధపడుతుందో గానీ, ఇప్పటికైతే హాలికులు పాలకులకు పెద్ద గుణపాఠమే చెపుతున్నారు. ప్రజల సంఘటిత శక్తి ముందు ప్రభువులెంతటివారైనా తలవంచక తప్పదని తమ విజయం ద్వారా ఎలుగెత్తుతున్నారు.