Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెళ్ళంటే నూరేళ్ళ పంట. అది పండాలి కోరుకున్న వారి ఇంట' అని సినిమాలో పెళ్ళి ప్రాధాన్యతను పాడుకున్నారు. నిజంగా పెళ్ళి అనేది జీవితాలలో, కుటుంబాలలో జరిగే ఒక పెద్ద కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ప్రాకృతికావసరంగా ఆడా మగా కూడి ఉండటం అనేక వేల సంవత్సరాలుగా కొనసాగుతూ సాగుతూ కుటుంబ వ్యవస్థా, పెళ్ళి అనేది స్థిరపడ్డాక, ఇప్పుడది ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మన భారతీయ వ్యవస్థలోనయితే కులాలవారిగా ఈ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలే, కుల మతాలకు అతీతంగా జతకూడ గలుగుతున్నారు. అదీ చాలా ఇబ్బందులకోర్చి. పెళ్ళి అనే ఒక కార్యక్రమం చుట్టూ నేడు పెద్ద వ్యాపారమే అల్లుకుని ఉంది.
''వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా! ఆదరా, బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపో వద్దురా, కళ్యాణమే ఖైదురా! డోంట్ మ్యారీ హే.. బీ హ్యాపీ'' అంటూ పెళ్ళితో ఎదురయ్యే సమస్యల్ని హాస్యంగా పాటలో ఏకరవు పెడతారు ఓ సినిమాలో. కానీ పెళ్ళి చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ అదో లోపంగా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఆడపిల్లలకు పెళ్ళి త్వరగా చేయకపోయినా తల్లిదండ్రులను అడిగేవాళ్ళు చుట్టుప్రక్కల ఉండనే ఉంటారు. ఆ వొత్తిడిలో వాళ్ళు త్వరగానే కూతుళ్ళకు పెళ్ళి చేసి అత్తవారింటికి పంపుతుంటారు. తల్లిదండ్రులకు ఇదో పెద్ద సవాలు. పెళ్ళిళ్ళు అయ్యాక ఉండే సవాళ్ళు వేరు. అన్నీ ఎదుర్కోవడంలోనే జీవితాలు ముగుస్తుంటాయి. ఆడపిల్లలకే కాదు ఈ రోజుల్లో మగ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేయటం పెద్ద సమస్యగానే తయారయ్యింది. పెళ్ళికాని ప్రసాదులు నేడు పెరిగిపోతున్నారు. అమ్మాయిలకయినా అబ్బాయిలకయినా సంబంధాలను వెతికి పెళ్ళి చేయటం ఒక పెద్ద లక్ష్యంగా మారింది. ఇంతకు పూర్వమయితే కుటుంబాలలో ఎవరో వరుస కలిసిన వారినే పెళ్ళిళ్ళు చేసుకునేవారు. పిల్లలను వెతికి పెట్టటానికి పెళ్ళిళ్ళ పేరయ్యలు కూడా ఉండేవాళ్ళు. సంబంధాలు కుదిర్చినందుకు వాళ్ళకు ఇరుకుటుంబాలూ ఎంతో కొంత ఇచ్చి గౌరవించేవాళ్ళు. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు వెలిసాయి. ఏ కులానికి ఆ కులం బ్యూరోలూ విరివిగానే వచ్చేసాయి. పత్రికల్లోనూ పెళ్ళి పందిరి శీర్షికలతో వరుడు, వధువు ప్రకటనలు కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాము. వీటికి కూడా వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉన్నారు. కుల, మతాలకు అతీతంగా అభ్యుదయ వివాహ వేదికలూ ఈ రకమైన బాంధవ్యాలకు పూనుకుంటున్నాయి.
ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకంటే, మొన్న పత్రికల్లో వార్తాకథనమొకటి వచ్చింది. అదేమంటే.. తమిళనాడులో నలభైవేల బ్రాహ్మణ కుటుంబాల యువకులకు ఆ రాష్ట్రంలో ఆడపిల్లలే దొరకట్లేదని, అందుకోసం ఉత్తరప్రదేశ్, బీహార్లలో అమ్మాయిల వేట కోసం నానా ఇబ్బందులూ పడుతున్నారని వివరించారు. తమిళనాడులో పదిమంది అబ్బాయిలకు కేవలం ఆరుగురు అమ్మాయిలే ఉన్నారని, ఆడపిల్లల కొరత ఉన్నదని సర్వేలు వెల్లడించాయి. అక్కడ మాత్రమే కాదు. దేశం మొత్తంలోనే పురుషులు స్త్రీల నిష్పత్తి పడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణాలలో స్త్రీల పట్ల మన సమాజం చూపుతున్న వివక్ష ప్రధానమయినది. ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్నారు. పుట్టినా పౌష్టికాహారంలోపం ఆడపిల్లలను వెంటాడుతున్నది. చదువులో, పెంపకంలో అసమానతలు చూస్తూనే ఉన్నాము. అంతేకాక లైంగిక వేధింపులు, హత్యలు, హింస విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులను మనం నిత్యం కంటున్నాము. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఆడపిల్లలు లేకపోవడమే మంచిదన్న భావనలోకి తల్లిదండ్రులూ వస్తున్నారు. అందుకే నేడు విపత్కర సమస్యను ఎదుర్కొంటున్నాము. జీవ సమతుల్యతతో పాటు లింగ సమతుల్యత ఉండాలి. స్త్రీ పురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు పెరిగితే సామాజిక ఆవరణం అరాచకంగా తయారవుతుంది. హింసా దుర్మార్గాలు పెచ్చరిల్లుతాయి. కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమవుతుంది. ఇదొక సామాజిక సమస్యగా మారుతుంది.
ఇక ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి వారి తల్లిదండ్రులు చాలా బాధలు పడాల్సి రావటమూ పెద్ద సమస్య. పెళ్ళి తంతును నిర్వహించే బాధ్యత ఆడపిల్లవాళ్ళదే కావటంతో పెళ్ళికయ్యే ఖర్చు వారి తలకు మించినదై కూర్చుంటోంది. ఫంక్షన్ హాళ్ళు లక్షల్లో ఉన్నాయి. ఇక అట్టహాసంగా జరపాలనే వరుడి తరుపు వారి కోరికలు, వేలాది మందికి భోజనాలు, గానా భజానాలు వైభవంగా జరపటంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికోసం అనేక యేండ్లపాటు ఆడపిల్లల తల్లిదండ్రులు డబ్బు కూడ పెట్టాల్సిరావడం, పెళ్ళిళ్ళు ఆలస్యం కావటమూ జరుగుతోంది. అనవసర ఆడంబరాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వరకట్నాల కోసం వొత్తిడులు తగ్గాలి. వరకట్న వేధింపులు, ఆడపిల్లలపై హింస అరికట్టాల్సి ఉంది.
అసలే యువత ఉపాధిలేమి మొదలైన వొత్తిళ్ళు, ఉద్యోగాల్లోనూ టార్గెట్ల వొత్తిళ్ళు పెరిగి తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ తరుణంలో సామాజికంగా ఎదురయ్యే ఈ సమస్యలు, కుటుంబాలలో తీవ్ర మానసిక వొత్తిడిని పెంచుతున్నాయి. ఇది మొత్తంగా సామాజిక సమస్య అయినప్పటికీ కుటుంబాలు, వ్యక్తులు అవగాహనతో మెలగవలసి ఉంది. ప్రభుత్వాలు, ప్రజా సమూహాలు సాంఘికజీవనం సాఫీగా సాగేందుకు కృషి చేయాలి. పెళ్ళిళ్ళు ఆనందాలను నింపాలికాని, అనేక వ్యయ ప్రయాసలను నింపకూడదు.