Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలివిగానంత బరువు వేసినా, కష్టపడి, చెమటలు కక్కుకుంటూ బండిని చడాపుపైకి లాగిన ఎద్దులతో ఆ బండి చక్రంపై వాలిన ఈగ తానే ఆ బండిని లాగినట్టు పోజుపెడ్తే!? ఆ ఆర్భాటాన్ని సదరు చతుష్పాదులు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా విన్నవారు మాత్రం నోటితో నవ్వరు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ(వి)పరిణామం జరుగుతోంది. చూపరులకు ఇది ఇట్టే అర్థమయ్యేదైనా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాత్రం దీనిచుట్టూనే నాటకాలాడుతున్నారు. ఆంక్షలు పెట్టి, అన్ని ప్రజాసంఘాల్ని కట్టడి చేసిన చోటే కేసీఆర్ తన శిష్యగణంతో మూడుగంటలు ధర్నా చేసేటప్పటికే మోడీకి ''దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైం''దని, అందుకే మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించారని టీఆర్ఎస్ శ్రేణులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ యాత్రల దెబ్బకి ''ఫామ్‌హౌస్‌లో పండిన కేసీఆర్ ధర్నా చౌక్‌కి వచ్చార''ని బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారు. దీనికి ముందు హుజురాబాద్ దెబ్బట! జీహెచ్ఎంసీ దెబ్బట! దుబ్బాక దెబ్బట! ఇవన్నీ 'ఈగ'లగోలలే!
ఢిల్లీలో రైతాంగ పోరాటం మొదలు పెట్టి రేపటికి సరిగ్గా సంవత్సరం. సరళీకృత ఆర్థిక విధానాలపై దేశ రైతాంగం చేస్తున్న దండయాత్ర అది. ప్రపంచంలోనే ఇది అపురూప పోరాటమని ప్రశంశలందుకుంటోంది. గడ్డకట్టే చలికి వారు చలించలేదు. 42డిగ్రీల వేడిగాడ్పులకి డస్సిపోలేదు. పక్షికన్ను మాత్రమే కన్పడుతోందని చెప్పడానికి వారి దగ్గర ద్రోణాచార్యులు లేరు. లక్షల మందీ అర్జునులే! అందుకే దుష్టచతుష్టయం పన్నిన మాయోపాయాలకు వారు చిక్కట్లేదు. వారి లక్ష్యం వారికి స్పష్టం.
''దుర్మార్గాన్ని వ్యతిరేకించనివాడు కూడా దాన్లో భాగస్వామే'' అని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన విషయం టీఆర్ఎస్ నేతలకు ఎరికేనని భావించాలి. ''వేలాది పుస్తకాలు అధ్యయనం చేసే'' వారికి 1991 తర్వాత వేసిన హితేన్ భాయా కమిటీ కావచ్చు, నర్సింహన్, మల్హోత్రా కమిటీలు కావచ్చు, రాకేష్మోహన్ కమిటీ కావచ్చు వారి రికమండేషన్స్ నాటి ఎపిఎస్ఇబీని గాని, బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగాల్ని గాని, రైల్వేలను గాని బాగుచేయడానికి కానేకాదనే విషయం తెలిసి ఉండాలె! ''బ్రిటిష్ సామ్రాజ్యవాదం మనదేశంలో వెళ్ళూను కోవాలంటే రక్తం ఏరులై పారిందిగాని, ప్రస్తుతం ఒక వందమంది సివిల్ సర్వెంట్లను లోబర్చుకుంటే చుక్క నెత్తుటి బొట్టురాలకుండా మనదేశం అన్యాక్రాంత మవుతుంద''ని 90వ దశకం చివర్లో ప్రొఫెసర్ ప్రభాత్‌పట్నాయక్ అన్న మాటలను చదివుంటే.. ''2014లో వేసిన శాంతకుమర్ కమిటీ'' ఎఫ్‌సీఐని పటిష్టం చేయాలన్న''దనే భ్రమలు కలుగవు. తమ అధికార 'బాకా'లో సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఈ వాక్యం ఎలా రాశారో, అసలా భ్రమలెందుకు వచ్చాయో రాష్ట్ర నేతలు ఆలోచించుకుంటారా? ''రాష్ట్రాలు వారికి అవసరమైన ఆహారధాన్యాలను వారే సేకరించుకోవా''లని 2015లోనే శాంతకుమార్ కమిటీ చెప్పింది కదా?! బహుశా మన రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన పారా బాయిల్డ్ రైస్ మిల్స్‌ను, దానిలో ఉపాధి పొందుతున్న వేలాదిమందిని, యాసంగి ధాన్యాన్ని, అవి పండించిన రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. దాని కోసం టీఆర్ఎస్ కేంద్రంతో ఇప్పటికైనా పోరాడటం ఆహ్వానించతగ్గదే.
అయితే దాన్లో నిజాయితీని తెలంగాణ సమాజం ఆశిస్తోంది. విద్యుత్ సవరణ (2014) బిల్లు నేడు విద్యుత్ సవరణ (2021) బిల్లుగా అవతరించింది. మోడీ అస్మదీయులకు ఆ బిల్లు అవసరం. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ సోలార్ కంపెనీతో యూనిట్ రూ.7లకు ఒప్పందం చేసుకుంటే ఆ తర్వాత వచ్చినామె కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్‌ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో రూ.4లకే చేసుకున్న ఉదంతం అప్పుడే పత్రికలకెక్కింది. ఇవన్నీ గమనంలో ఉంచుకుని మన రాష్ట్రం దాన్ని వ్యతిరేకిస్తే మంచిది. తలలాడించే రెగ్యులేటరీ కమిషన్ సభ్యుల కోసం, తమ అస్మదీయులకు వాటాల కోసం వెంపర్లాడితే మొదటికే మోసం వస్తుంది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమింపజేయగల 'నాలుగవ స్తంభం' మోడీ బృందపు భల్లూకప్పట్టులో ఉంది. కార్పొరేట్ల కబంధహస్తాలు దాన్ని నిత్యం కాపలా కాస్తున్నాయి. 'ఉపా'లాంటి కత్తెర్లతో ఎందరో తోకలు పీకలు కూడా కోస్తున్నారు. మచ్చికైన మీడియాలో ఎక్కడికక్కడ మోడీ సంకీర్తనా పరులను నింపారు. రైతు ఉద్యమమైనా, నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ అయినా, మరోటైనా మీడియా వాస్తవాలు ప్రజలకు చేరవేయడం లేదు. పైగా ఏలినవారికి అవసరమైనట్లు వక్రీకరిస్తున్నారు.
1991 నుండి సన్నగా చినికి, చినికిన సరళీకృత ఆర్థిక విధానాలు నేడు జడివానైనాయి. పెను వరదైనాయి. కట్టెలు, శవాలు మాత్రమే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. వాలిన ఈగలైతే ఎగిరేపోతాయి. ప్రాణమున్న మనుషులు, పోరాడగలిగే వర్గాలు ఒకరి చేతులతో మరొకరి చేతుల్ని మెలేసుకుని, పేనిన మోకులై, మహాకుడ్యమై నిలవాలి.