Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాటిన్ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకత పెరుగుతున్నదనడానికి తాజా ఉదాహారణ ఇటీవల జరిగిన నికరాగ్వా, వెనెజులా ఎన్నికలలో వామపక్ష అభ్యర్థులు తిరిగి ఎన్నిక కావడం...
వెనెజులాలో జరిగిన స్థానిక (మున్సిపల్) సంస్థల ఎన్నికలలో మదురోపార్టీ నాయకత్వంలోని కూటమి పూర్తి మెజారిటీ సాధించింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రకియకే ఘన విజయమని అంతర్జాతీయ సమాజం అంగీకరించింది. నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలను ప్రతిపక్షం బహిష్కరించింది. అదే ప్రతిపక్షం ఈసారి ఎన్నికలలో పాల్గొన్నది. ఓటింగ్‌శాతం 42.26గా నమోదు అయింది.
ఈ ఎన్నికలలో 23మంది గవర్నర్లు, 335మంది మేయర్లు, 253మంది శాసనసభ్యులు, 2471మంది కౌన్సిలర్లను ప్రత్యక్షంగా ఎన్నుకున్నారు. 2007 తరువాత ప్రతిపక్షాలు ఎన్నికలలో పాలుపంచుకోవడం ఇదే మొదటిసారి. దీనితో వారు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం అయ్యారు. ఇప్పటి వరకూ అమెరికా సామ్రాజ్యవాదం అనేక కుట్రలు చేసి, ప్రతిపక్షాలకు డబ్బులు ఇచ్చి, అధికార పార్టీమీద అనేక అక్రమ ఆరోపణలు చేసి ఎన్నికలను జరగకుండా చేయడానికి సర్వశక్తులూ ప్రయోగించింది. ప్రతిపక్షాలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచగలిగింది. ఈసారి వారి ఎత్తుగడలను మధురో పార్టీ చిత్తుచేసింది. అది ఎలా జరిగింది అంటే నార్వేని మధ్య వర్తిగా పెట్టి మెక్సికోలో వెనెజులా అధికారపార్టీ ప్రతిపక్షాలతో అనేక దఫాలుగా చర్చలు జరిపింది. ప్రతిపక్షాలను ఎన్నికలలో పాల్గొనేలా ఒప్పించేందుకు సర్వశక్తులు వెచ్చించింది. చివరకు వారి అపోహలను తొలగించి, అమెరికా విషకౌగిలి నుంచి వారు బయటపడేలా చేయడంలో విజయవంతం అయ్యింది.
మదురో నాయకత్వం వహి స్తున్న యునైటెడ్ సోషలిస్టు పార్టీ ఆఫ్ వెనెజులా (పీయస్యువి) 23కు గాను18 రాష్ట్రాలలో మెజారిటీ సాధించింది. పీయస్యువి నాయకత్వంలోని కూటమి పేరు గ్రేట్ ఫ్యాట్రీయాటిక్ పోల్ (జీపీపీ). ఇందులో మదురోను బలపర్చే రాజకీయ పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి.
ప్రస్తుతం వెనెజులాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించి ఉన్నది. మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నదని తప్పుడు ప్రచారం చేస్తున్నది. వెనెజులా ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నది. ఈ కఠిన పరిస్థితులలో కూడా వెనెజులా ప్రజలు విప్లవశక్తులకు ఓటు వేయడం అనేది చిన్న విషయం కాదు. మరోవైపు అమెరికా ప్రభావంలోని ప్రతిపక్షాలను ఒప్పించి ప్రజాస్వామ్య ప్రక్రియలోకి తేవడం కూడా ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. అందుకే ఇక్కడ మదురో అన్న మాటలను గుర్తుచేసుకోవాలి. ''దేశంలోని తీవ్రవాద శక్తులను ప్రజాస్వామ్య ప్రక్రియలోకి తీసుకురావడానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడు ప్రజాస్వామ్య సంస్థలు బలంగా తయారవుతాయి. ఇక దేశ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయడానికి వెసులుబాటు కలుగుతుంది.'' ఈ మాటలకు చాలా లోతైన అర్థం ఉన్నదనేది మనం గమనించాలి.
వెనెజులాలో క్రూడ్ ఆయిల్ పుష్కలంగా లభిస్తుంది. కానీ ఆ దేశంలో దానిని శుద్ధిచేసే వ్యవస్థ ఆంక్షల కారణంగా అనేక ఇబ్బందులలో ఉండడం అడ్డంకిగా మారింది. ఇప్పుడు ప్రతిపక్షాలు అమెరికా పట్టునుండి బయటికి వచ్చినందున దేశ అంతర్గత అడ్డంకులను తొలగించుకున్నట్టు అయింది. ఇక అభివృద్ధిపై కేంద్రీకరించి వెనెజులాను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి. 2024లో దేశ అధ్యక్ష ఎన్నికలలో తిరిగి మదురోను గెలిపించుకోవాలి.
ఇక నికరాగ్వాలో కూడా అధ్యక్ష ఎన్నికలలో వామపక్షవాది 'డ్యానియల్ వర్టేగా' తిరిగి భారీ మెజారిటీతో గెలిచారు. 65.23 శాతం కంటే ఎక్కువ ఓట్లు వర్టేగాకు రావటం విశేషం. నికరాగ్వాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడిని తొలగించి ఆయన స్థానంలో అమెరికా అనుకూల వ్యక్తిని నియమించాలనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతున్నా అక్కడ అమెరికా పప్పులు ఉడకడం లేదు. వర్టేగా ప్రజాపునాది గల నాయకుడు. నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నవాడు. అందుకే ఆ దేశ ప్రజలు వర్టేగా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికి వర్టేగా నాలుగుసార్లు అధ్యక్షుడిగా గెలిచి ఉన్నారు. ఆయన ప్రజారంజక పాలన పట్ల ప్రజలలో ఆదరణ కొనసాగుతున్నది.
ఆస్ట్రియా దేశంలోని రెండవ పెద్ద నగరం గ్రజ్‌లో సైతం కమ్యూనిస్టు ˜పార్టీ ఆఫ్ ఆస్ట్రియా (కేపీఓ) అభ్యర్థిని ఎల్కే కV్‌ా భారీ మెజారిటీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి కంటే 29 శాతం ఓట్లు ఆమె ఎక్కువ పొందారు. 60 సంవత్సరాల వయస్సుగల ఆమె, గతంలో ఆ నగర డిప్యూటీ మేయర్‌గా ప్రజాదరణ పొందిన నాయకురాలు. ఆమె తాళాలు మరమత్తు చేసే కార్మికుడి బిడ్డ. లాటిన్ అమెరికాలోని ఈ మూడు విజయాలు ఒకే సంకేతానినస్తుండటం గమనర్హాం. ప్రజలతో మమేకమై ప్రజాపంథాను అనుసరిస్తూ, సామ్రాజ్యవాద అమెరికాపై నికరంగా పోరాడే వామపక్షాలను ప్రజలు ఆదరిస్తున్నారన్న ఆ సంకేతం ప్రజాపక్షం వహించే శక్తులకు గొప్ప ఉత్తేజం.