Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అప్పు చేసి పప్పు కూడు...' కూడదని మన పెద్దలు ఏనాడో హెచ్చరించారు. కానీ అప్పులు చేయటం ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ఘనత వహించిన మన పభుత్వ పెద్దలు ఇంతకాలం చెబుతూ వచ్చారు. వస్తున్నారు కూడా. నిజంగానే అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయటంలో తప్పు లేదు కూడా. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలు పాలన సాఫీగా సాగిపోవటానికీ, యంత్రాంగం నడవటానికి వీలుగా వివిధ ఆర్థిక, ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. కానీ ఆయా ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి గురించీ, తీసుకున్న అప్పులు, వాటి వడ్డీల గురించి ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో కూడిన పారదర్శకతను ప్రదర్శించటం అవసరం. ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందనేది తాజాగా తేలిన సత్యం. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన లెక్కల ప్రకారం... టీఆర్ఎస్ సర్కారు నొక్కి వక్కాణించిన ధనిక, మిగులు రాష్ట్రం కాస్తా రెవెన్యూ లోటులోకి పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6,743 కోట్ల మిగులు ఉంటుందంటూ విత్త మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఊహించి లెక్కలేశారు. కానీ ఆ పద్దు ప్రవేశపెట్టిన ఆర్నెల్లకే తెలంగాణ రూ.8,058 కోట్ల రెవెన్యూ లోటుతో ఉందంటూ కాగ్ స్పష్టీకరించింది. దీంతో మనం విస్తుబోవాల్సిన పరిస్థితి.
వాస్తవానికి ఇదే కాగ్... 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరా ల్లోనూ ఇవే విషయాలను ఎత్తి చూపింది. తెలంగాణ ప్రభు త్వం తన బడ్జెట్లలో మిగుళ్లు చూపుతూ వస్తున్నది.. కానీ నిజానికి మిగుళ్ల స్థానంలో రెవెన్యూ లోటే ఉంటున్నదంటూ అది ఆక్షేపించింది. నిజానికి రాష్ట్రంలోని ఆర్థిక విశ్లేషకులు, మేధావులు, నిపుణులు సైతం మొదటి నుంచి... 'మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమనే...' వాదనలను తోసిపుచ్చుతూ వచ్చారు. గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవద్దంటూ ముందు చూపుతో కూడిన హెచ్చరికలను జారీ చేశారు. సర్కారుకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు సైతం ఇదే విషయాన్ని అంతర్గత సమావేశాల్లోనూ పలుమార్లు ప్రస్తావించారు కూడా. కానీ ప్రభుత్వాధినేత మాత్రం వారి హితోక్తులను బేఖాతరు చేశారు. ఈ క్రమంలో బాస్ ఆదేశాలను తూ.చా.తప్పకండా పాటిస్తూ, ఆయన సూచనలకు అనుగుణంగా అంకెల్లో మాయలు, సంఖ్యల్లో మంత్రాలు సృష్టిస్తూ అధికారగణం పద్దులు రాస్తూ పోయింది. కానీ ఇప్పుడు కాగ్ లెక్కల తాకిడితో ఈ మాయలు, మంత్రాల సంగతి బయటపడింది. ఇన్నాళ్లూ జనాన్ని మభ్యపెట్టిన వైనం బట్టబయలైంది.
ఈ క్రమంలో రెవెన్యూ మిగులు స్థానంలో లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రం భవిష్యత్తేమిటనేది రాష్ట్రపజల ముందున్న ప్రశ్న. ఒకవైపు సంక్షేమ, అభివృద్ధి పథకాలు బాగానే అమలవుతున్నట్టు పైకి కనబడుతున్నా.. వాటి డొల్లతనం మాత్రం క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. మొదట్లో ఠంచన్‌గా వచ్చే ఆసరా పెన్షన్లు ఇప్పుడు ప్రతీనెలా ఆలస్యమవుతున్నాయి. ఉపాధ్యాయుల వేతనాలు ఒక్కో జిల్లాలో ఒక్కో తారీఖున పడుతున్నాయి. వారి జీతాలు పదో తేదీ దాటిన తర్వాతగానీ చేతికందటం లేదు. ఆరోగ్య శ్రీ బిల్లులు సుమారు రూ.వెయ్యి కోట్ల మేర పేరుకుపోయాయి. కేసీఆర్ కిట్ పథకాన్ని నిధుల లేమి వెంటాడుతున్నది. డబ్బు విడుదల కాకపోవటంతో విద్యార్థుల ఉపకార వేతనాలు, మెస్ బిల్లులు, వారికి ప్రోత్సాహకంగా ఇచ్చే నగదు పురస్కారాలు విలవిల్లాడుతున్నాయి. పైసల్లేకపోవటంతో గ్రామీణ రోడ్లు, పట్టణాల్లో రహదారులు అధ్వాన్న స్థితికి చేరాయి. ఆర్టీసీకి, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలకు మోక్షం లభించటం లేదు. తాము చేసిన పనులకు బిల్లులు రాక... చిన్నా చితకా కాంట్రాక్టర్లు సైతం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆఖరికి పరువు కోసం, కుర్చీ మీద కూర్చున్న పాపానికి అప్పులు తెచ్చి మరీ... పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులను నిర్మించిన సర్పంచులు సైతం చెక్కులు రాక లబోదిబోమంటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వటం లేదనే బాధతో ఏకంగా అనేక మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే... ఇంకా మనది మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అంటూ మభ్యపెడుతూ, రెవెన్యూ మిగులును చూపించేందుకు లెక్కలను తిమ్మిని బొమ్మిని చేయటమనేది రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదన్నది మేధావుల మాట. అందుకే ఇప్పటినుంచైనా గులాబీ సర్కారు... రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని జనం ముందు పెట్టాలి. అందుకనుగుణంగా ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. లోటుపాట్లు ఉంటే సవరించుకుని ముందుకుపోవాలి. లేదంటే మనకు మరింత నష్టం తప్పదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కడుపుకొట్టి తన బొక్కసం నింపుకోవడం రివాజగా మారింది. ఈ డాబుసరి మాటలకంటే నిర్దిష్టంగా కేంద్రప్రభుత్వంతో పోరాడటానికి టిఆర్ఎస్ ముందుకు వస్తే ఇప్పటికైనా మంచిది. కనీసం గొంతెత్తే రాష్ట్రాలతో తానూ గొంతు కలపాలి.