Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మత్తు నింపని జీవితపు సీసా, విసిరేసిన ఖాళీ సంచిలా కొట్టుకుపోతుంది. నిజంగా దోస్త్! నేను నేనై నిలబడలేనప్పుడు, ఏదో ఒక నిషా నాలో ఉషారు పుట్టించాలి'' అంటాడో కవి. అవును... చాలా మంది మత్తును ఆహ్వానిస్తూనే ఉన్నారు. మత్తులో ఏదో గమ్మత్తయిన మహత్తుదాగి ఉంది..! ''ధమ్మారో ధమ్.. మిఠ్ జాయే హమ్.. భోలో శుభ్ శ్యామ్... హరేకృష్ణ.. హరేరామ్'' అని ఆ రోజుల్లో సామూహిక మత్తులో పాడుకున్న పాటలూ ఉన్నాయి. తాగి ఊగటమూ ఊగుతూ తాగటమూ ఎక్కడా దొరకని ఆనందాన్ని మైకంలో పొందటమూ అనేక తరాలుగానే చూస్తున్నాము. మత్తులో తప్ప దొరకని ఆనందాన్ని మరి పొందటమెలా? అందుకే ''స్వర్గలోక మగుపడతది మైకంలో'' అన్నాడు.
''మత్తువదలరా.. మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా!'' అని పూర్వకాలం నుండే మత్తులో తూగేవాళ్ళకు మేల్కొలుపులు ఎన్ని పాడినా మత్తను వొదులుకోవడం జరగనేలేదు. మత్తులోకి పోవడానికి అనేక మార్గాలున్నాయి. మధ్యపానం అని ఇప్పుడు మనం అంటున్నాం గానీ సురాపానమన్నమాట పురాణాల్లోనే లిఖించబడి ఉంది. అంటే పురాణాల్లో దేవతలు కూడా సోమరసాన్ని సేవించి మత్తు నింపుకొనేవాళ్ళని తెలుస్తున్నది. అంటే మత్తుకు తరతమ బేధాలేమీలేవన్నట్లే కదా! ఒక్క మద్యపానంతోనే కాదు ఇంకా అనేక రకాల మత్తెక్కించే పదార్థాలు మన సమాజంలో ఉన్నాయి. మద్యపానమైతే ప్రభుత్వమే మరీ పనిగట్టుకుని ప్రజలచేత తాగించి, ముంచి గల్లా నింపుకుంటున్నది. అందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. ఇది వేరే విషయం. ఇక మరింత మత్తునందించే వాటిని మాదకద్రవ్యాలు అంటారు. వీటిని వాడటాన్ని, తయారు చేయటాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. వాటిలో ముఖ్యంగా గంజాయి ఒకటి. ఈ చెట్ల ఆకుల పొగ పీల్చడం ద్వారా మత్తులోకి పోతారు. ఇక హెరాయిన్, బ్రౌన్
షుగర్ మొదలైనవి విరివిగానే ఉన్నాయి. పూర్వం నల్లమందు అని కూడా ఉండేది.
మొన్నామధ్య వేల కోట్ల రూపాయల హెరాయిన్ గుజరాత్ విమానాశ్రయంలో దొరికింది. ఈ మాదకద్రవ్యాల వ్యాపారంలో పెద్ద పెద్ద మాఫియాలే ఉన్నాయి. ఇదేమీ చిన్నా చితకా వ్యాపారం కాదు. వేల కోట్లతో సాగుతున్నది. అధికార పెద్దల అండదండలూ దండిగానే ఉంటాయి. అవన్నీ బయటికి రాకుండానే మేనేజ్చేయబడతాయి. ఇప్పుడివన్నీ ఎందుకంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయల గంజాయి కేసులు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఈ గంజాయిసాగు, అమ్మకాలపై పెద్ద దుమారమే లేచింది. మన తెలంగాణలో సాగులేదంటున్నారు గానీ అది పూర్తిగా నిజం కాకపోవచ్చు. కానీ అమ్మకాలు విపరీతంగా జరుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తుందనేది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. గత రెండు నెలల్లోనే ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల్లో 75 కేసులు దొరికాయంటే తక్కువేమీ కాదు. యేడాదిలో ఐదువేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటం పెద్ద విషయం. ఈ మధ్య కాలంలో గంజాయి జారు పెరిగిన మాట వాస్తవం.
యువతలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం పెరగటం ఆందోళన కలిగించే విషయం. ఉన్నత విద్యా కేంద్రాలు, పేదల వాడలూ, బడా బాబుల స్థావరాలలో ప్రధానంగా వీటి వినియోగం జరుగుతున్నది. ధనవంతుల విషయంలోనైతే తిన్నదరగని జల్సాతనం కారణమైతే, మిగతావారిలో సామాజిక వొత్తిడి ప్రధానమైన కారణం. చదువులో ఒత్తిడి, ఉపాధిలేమి, ఉపాధి ఉన్నా చాలీచాలని వేతనాలు, చదివిన చదువుకు తగిన కొలువులు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో కూడా వ్యవసాయం అప్పులతో నిండిపోవటం, సాగుభవిష్యత్తు అగమ్యంగా మారటం, నష్టాలతో బతుకు చితికిపోవటంతో ఈ వొత్తిడులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. వీటిని తట్టుకోలేని మానసిక సంఘర్షణలు మత్తులోకి లాక్కెళుతున్నాయి. ఇక ఇదే తేలికైన ఆదాయ మార్గమని ఆశచూపి ఈ రవాణాలోకి యువతను వ్యాపారులు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు, పెట్టుబడులు పెట్టి గంజాయి పంటకు పురికొల్పుతున్నారు.
సమాజంలో ఒక పరిణామాన్ని మనం గమనించవచ్చు. ఉపాధిలేమి, పేదరికం, నిరుద్యోగం, ఆకలి పెరిగిన పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ స్థితిలోనే మత్తు వినిమయం పెరిగింది. ఇంకోవైపు బడా వ్యాపారుల, కార్పొరేట్ల ఆస్తులు పెరుగు తున్నాయి. దోపిడీ పెరిగిందనటానికి ఇంతకంటే వేరే నిరూపణలే అక్కరలేదు. అందుకనే వ్యాపారుల పక్షం వహించే పాలకులు సమాజం మత్తులో తూగాలని కోరుకుంటారు. తరాలుగా రెండు మత్తులు జనాన్ని పక్కదారి పట్టిస్తూనే ఉన్నాయి. వాటికోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఒకటి మత్తు పానియాల వాడకం, మత్తు పదార్థాల వినియోగమైతే, రెండో మత్తు మతం. గుళ్లు, బాబాలు, అలౌకిక వ్యవహారాలు. ఈ రెండూ పనిచేయని చోట నిర్బంధాలు, నియంతృత్వాలు, పోలీసులు. ఈ మూడింటిపైనా ఎక్కడలేని ప్రేమ చూపిస్తారు మన పాలకులు. ఎందుకంటే ప్రశ్నించడం, ఎదురు తిరగడం, పోరాడటం ఏదీ సహించలేరు.
పైకి సామాన్యులు చేసే నేరాలన్నీ ఈ వ్యవస్థ పురికొలిపే పర్యవసానాలేనన్న ఎరుకను కలిగి ఉండాలి. ఈ మత్తుకు మూలాలను వెతకకుండా, వాటి పరిష్కారాలు జరగకుండా ఎన్ని కేసులు దొరికినా, ఎందరిని నిలువరించినా ఆగని మత్తు వ్యవస్థ ఇది. దీన్ని ఛేదించే ధృఢ చిత్తాన్ని కలిగి ఉండటమే చేయగలిగింది.