Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిండి కలిగితే కండ కలదోరు / కండ కలవాడేను మనిషోయి' అంటూ దేశమంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో శతాబ్దం కిందటే మహాకవి గురజాడ అప్పారావు అద్వితీయమైన నిర్వచనమిచ్చారు. స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి అయినా ఈనాటికీ గురజాడ వేదనను పాలకులు ఒంటబట్టించుకోకపోవడం శోచనీయం. దేశంలో పౌష్టికాహార లేమితో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతోందని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన ఐదో విడత సర్వే తేల్చింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ - ముంబయి చేపట్టిన జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)లో పలు ఆసక్తికర విషయాలు, విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ జనగణన పూర్తయితే వాస్తవిక గణాంకాలు వెల్లడౌతాయి. ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే నమూనానే అయినా విధానపర తప్పులు సరిదిద్దుకునేందుకు ఒక గీటురాయి. ప్రధానంగా పోషకాహార లేమి సమస్య నేటికీ కొనసాగుతుండటం సిగ్గుచేటు.
దేశంలో ఆహార భద్రత పెను సవాలుగా కొనసాగడం కచ్చితంగా పాలకుల విధానపరమైన వైఫల్యమే. కోవిడ్ మహమ్మారి తర్వాత 80కోట్ల మందికి తిండి గింజలను ఉచితంగా అందజేయడాన్ని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోందంటే దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజల దయనీయ స్థితికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. పౌరుల మనుగడకు అవసరమైన ఆర్థిక స్థితిని మెరుగపర్చే విధానాల కంటే పౌరుల ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తామనే 'స్వచ్ఛ భారత్' వంటి పాపులర్ పథకాలకే పాలకులు ప్రాధాన్యతనిస్తున్నారు. పరిశుభ్రత నినాదాల మాటున తిండి గింజల తిప్పలు తెరచాటుకు పోతున్నాయి. ప్రజల జీవనోపాధుల మెరుగుపర్చి వారి కొనుగోలు శక్తి మెరుగుపర్చే చర్యలు చేపట్టాలి. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరిగితేనే తప్ప సమాజ పురోభివృద్ధి సాధ్యం కాదన్న సంగతి పాలకులు ఒంటబట్టించుకోవాలి.
దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది మహిళలున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 'నారీ ఆధిక్య భేరీ' అంటూ పెద్దపెద్ద శీర్షికలతో కథనాలు ప్రచురించినంత మాత్రన సమాజంలో మహిళలకు ప్రాధాన్యత పెరిగిపోయిందన్న భావనకు వస్తే అంతకు మించిన తప్పిదం ఉండదు. నేటికి మన సమాజంలో పురుషాధిక్య భూస్వామ్య భావజాలమే కొనసాగుతోంది. 'కంటే కూతుర్నే కనాలి' హితోక్తులు వల్లిస్తూనే కొడుకు కోసం తపిస్తూ లింగ నిర్థారణ, అబార్షన్ వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఆడపిల్ల పుడితే మెట్టింటివారి వేధింపులు, చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నాయి. స్త్రీ-పురుష నిష్పత్తిలో మహిళల సంఖ్య పెరిగినట్లు కనిపిస్తున్నా ఐదేండ్ల లోపు చిన్నారుల్లో బాలుర-బాలికల నిష్పత్తి 1000:929గా ఉండటం సమాజంలో ఆడ పిల్లలకు ఏపాటి ప్రాధన్యత ఉందో బోధపడుతుంది. పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేకపోవడం కారణంగా ఆడ పిల్లలు చదువులకు దూరమవుతున్నారంటే వారికి దక్కుతున్న ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో సంతానోత్పత్తి రేటు గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి తగ్గింది. దేశ జనాభాలో 15ఏండ్ల లోపు వయస్సున్నవారి వాటా దశాబ్దిన్నర కాలంలో బాగా పడిపోయింది. అక్షరాస్యత, జనాభా నియంత్రణ, మంచి వేతనంతో కూడిన ఉపాధి కల్పన, మహిళల సంక్షేమం వంటి అంశాల్లో విధానపరమైన సవాళ్లను అధిగమించడం లో ప్రభుత్వాలు ఇప్పటికీ తగినంత శ్రద్ధ వహించడం లేదని ఎన్ఎఫ్హెచ్ఎస్ తేల్చి చెప్పింది. ప్రాంతీయ అసమానతలు కూడా దేశంలో తీవ్రంగా ఉన్నట్లు ఈ సర్వే నిగ్గు తేల్చింది. ఉత్తర, మధ్య భారత్లో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకించి కేరళ, తమిళనాడులో సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సూచీలు చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం. జనాభా నియంత్రణ లోనూ ఉత్తరాది, మధ్య భారత్ వెనుకబడి ఉంది. జీవించే హక్కు, ఆహార భద్రత, రక్షణ, విద్య, ఆరోగ్యం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో చాలా కీలకమైనవి. పాలకులు ఇప్పటికైనా ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యామ్నాయ విధాన నిర్ణయాలు చేపట్టాలి.