Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ కొత్త రకం 'ఒమిక్రాన్' ప్రపంచ దేశాలను ఠారెత్తిస్తోంది. రెండేండ్ల క్రితం బయల్పడిన కోవిడ్-19 అతలాకుతలం చేయగా రెండవ ఉధృతిలో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఆ ఉపద్రవం నుండి ప్రపంచం పూర్తిగా కోలుకోకమునుపే దక్షిణాఫ్రికాలో కొత్తగా కనుగొన్న బి.1.1.529 (ఒమిక్రాన్)తో కలకలం రేగింది. అసాధారణ మ్యుటేషన్ల కలయికగా ఒమిక్రాన్‌ను వైద్య పరిశోధకులు పేర్కొనడమే కాకుండా డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారి అని ప్రాథమికంగా నిర్థారించారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ స్వల్ప సమయంలోనే ఐరోపా దేశాలకు వ్యాపించింది. జర్మనీ, బ్రిటన్, ఇజ్రాయెల్, బాట్స్వానా, హాంకాంగ్, ఆస్ట్రేలియాలలో ఒమిక్రాన్ కేసులు బయట పడ్డాయి. అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించి అంతర్జాతీయ ప్రయాణాలపైన కఠిన ఆంక్షలు విధించాలని, వైరస్ కట్టడి చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించింది. ఆగేసియా దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేసింది. ఆలస్యంగా మేల్కొన్న భారత ప్రభుత్వం యథామామూలుగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేస్తూ లేఖలు పంపించి చేతులు దులుపుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఇప్పటికైతే అచేతనావస్థలోనే ఉంది. ముంబయిలో ఒమిక్రాన్ కేసు నమోదైందన్న వార్త దేశాన్ని మరింత భయకంపితులను కావించింది.
కోవిడ్ రెండవ దశ ఉధృతికి మోడీ ప్రభుత్వ అలసత్వమే కారణమన్న వాస్తవం ప్రజలకు తెలిసిందే. వైరస్ ఆట ముగిసిందని స్వయాన అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించి ముందస్తు సన్నద్ధతకు గండి కొట్టారు. సెకండ్ వేవ్ సృష్టించిన విపత్తును తలచుకుంటేనే జనం యావజ్జీవాలు కుంగుతాయి. ఆక్సిజన్ లేమి, వైద్య సదుపాయాల కొరత, అరకొర టీకాలు ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేశాయి. ప్రతి రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు జనాన్ని వణికించాయి. అనాలోచిత లాక్డౌన్లతో లక్షలాది వలస కూలీలు, పేదలు అన్నమో రామచంద్రా అని విలపించారు. కోవిడ్‌తో కుటుంబాలకు కుటుంబాలనే పోగొట్టుకున్న అభాగ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే విషయంలో కేంద్రం భీష్మించగా సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తన ప్రత్యేక నిధులను కాకుండా రాష్ట్రాలు తమకు కేటాయించిన విపత్తు సహాయ నిధి నుండి బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వమంది. ఒక్క పరిహారం విషయంలోనే కాదు. వైద్య సదుపాయాలకు సైతం రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చింది లేదు. వైరస్ కట్టడి, సహాయ చర్యలు తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చిందంతే. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మూడవ ముప్పు పొంచి ఉందంటూ వెలువడుతున్న సంకేతాల నేపథ్యంలో సైతం కేంద్రం ప్రేక్షక పాత్ర వహించడం బాధ్యతా రాహిత్యం.
ఇప్పటికైతే ఒమిక్రాన్ వ్యాప్తి వేగం, అది కలిగించే తీవ్ర ఆరోగ్య లక్షణాలపై పరిశోధనాత్మకంగా నిర్ధారణ కానప్పటికీ గతంలో ఎదురైన పరిణామాల రీత్యా ముందస్తు సన్నద్ధతకు కేంద్ర ప్రభుత్వం వేగంగా కదలాల్సిన అవసరం ఉంది. అటువంటి చిత్తశుద్ధి మోడీ సర్కారులో లోపించింది. పోషకాహారం విషయంలోనూ, ఆకలి సమస్యలోనూ మన దేశం ఎక్కడో అట్టడుగున ఉందని ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ సంస్థలు కుండబద్దలు కొట్టాయి. ప్రజల తలసరి ఆహార వినియోగం ఏడేండ్ల బీజేపీ జమానాలో ఏకంగా తొమ్మిది శాతం తగ్గిపోయిందని ఎన్ఎస్ఎస్ సర్వే బట్టబయలు చేసింది. కరోనా వేరియంట్లను ఎదుర్కోవాలంటే ప్రజల్లో రోగ నిరోధక శక్తి ఉండాలి. కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్న వేళ వారిలో ఇమ్యూనిటీని ఆశించడం వంచన. వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో సైతం ఈ ఒమిక్రాన్‌ను నిరోధించే శక్తి ఎంత ఉంటుందనేది ప్రశ్నార్థకమని నిపుణులు అంటున్నారు. ఇక వ్యాక్సిన్‌కు ఇంతవరకూ నోచుకోని వారి పరిస్థితి ఏమిటి? వ్యాక్సినేషన్ మొదలై 11 నెలలు గడిచినా మూడవ వంతు జనానికి పూర్తి స్థాయిలో టీకాలు అందలేదు. ఈ వైఫల్యం ముమ్మాటికీ కేంద్రానిదే. తతిమ్మా రాష్ట్రాలు ఒమిక్రాన్, మూడవ దశపై వేగంగా అప్రమత్తవుతుండగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమీక్షలకే పరిమితమైంది. మరి కార్యాచరణ ఎప్పుడు? రెండవ దశ దేశంలోనే కాదు, రాష్ట్రంలోనూ ఎంతగా భయోత్పాతం కలిగించిందో చూశాం. ఒమిక్రాన్ కట్టడిపై రాష్ట్రం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తం కావాలి. నిధులు, వైద్య సహాయ సహకారాలపై కేంద్రాన్ని నిగ్గదీసి నిలదీసి సాధించాలి.