Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వవ్యాప్తంగా కోట్లమందికి అంతర్జాలం నిత్యావసరంగా మారిపోయిన దశలో, సాంకేతికత మాటున ఘరానా మోసాలు ఇంతలంతలవుతున్నాయి. గతేడాది నుంచి భారత్ కరోనా వైరస్‌తో పాటు సైబర్ మోసాలతోనూ తీవ్రంగా పోరాడుతోంది. మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై సైబర్ నేరాలు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించాయి. డిజిటల్ ఇండియా పేరుతో అయిదారేండ్లగా నగదు చెల్లింపులకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) విధానం వంటివి అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగించక తప్పని పరిస్థితి. దాంతోపాటే సైబర్ భద్రత సైతం ప్రమాదంలో పడింది. ఈ కాలంలో దేశంలో సైబర్ నేరాలు ఎన్నో రెట్లు పెరిగినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల కేరళలో జరిగిన వార్షిక సైబర్ భద్రతా సదస్సులో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అందుకు నిన్న హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటనే తాజా ఉదాహరణ. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ కుంభకోణం. ఎస్బీఐ, ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆన్లైన్ లావాదేవీలు, ఫోన్ సంభాషణలతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పుడు వారి దృష్టి జన్‌ధన్ ఖాతాలపై పడింది. ఈ ముఠాలు టోకున నకిలీ ఆధార్‌కార్డులు, బోగస్ పాన్‌కార్డులు పుట్టించి వాటి సాయంతో తప్పుడు బ్యాంకు ఖాతాలు తెరిచి జనం సొమ్మును కోట్లలో కొల్లగొడుతున్న వైనం నిశ్చేష్టపరుస్తోంది. గతంలో దొంగనోట్లు, నకిలీ పాస్‌పోర్టులు, డూప్లికేటు ఫొటో గుర్తింపు కార్డుల బాగోతాలెన్నో చూశాం. ఇప్పుడు వారే ఆధార్, పాన్కార్డుల్నీ యథేచ్ఛగా సష్టిస్తూ సైబరాసురులకు కోరలూ కొమ్ములూ తొడుగుతున్నారు. పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని నాలుగేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరించింది. ఆ చట్టాన్ని చట్టుబండలు చేస్తూ ఏ పత్రాలు, కార్డులు కావాలన్నా చిటికెలో సృష్టించి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ ముష్కరుల దోపిడీకాండ వ్యవస్థాగతంగా నెలకొన్న అనేక వైఫల్యాలను ఎత్తి చూపుతోంది.
జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 27,248 కాగా, 2019లో 44,735 కాగా, గతేడాది 50,035 కేసులు నమోదైనాయి. వేగంగా పెరుగుతున్న కేసుల సంఖ్య నేరాల తీవ్రతను సూచిస్తోంది. సైబర్ నేరాల ఉధృతి ఏడాది కాలంలోనే ఐదింతలైందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం కుండబద్దలు కొట్టారు. రుణయాప్‌ల పేరిట కొన్ని నెలల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటిపోవడం తెలిసిందే. జార్ఖుండ్, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బ్యాంకు ప్రతినిధులుగా దాతృత్వ సంస్థల సంబంధీకులుగా నమ్మబలుకుతూ పలువురి బ్యాంకు ఖాతాల్ని క్షణాల్లో ఖాళీ చేస్తున్న ప్రహసనాలు ఎన్నెన్నో! కొవిడ్ విజృంభణ కారణంగా ఉద్యోగుల వ్యక్తిగత కంప్యూటర్లపై దాడులు అధికమైనట్టు సెర్టిన్ (భారత జాతీయ కంప్యూటర్ అత్యవసర స్పందన బందం) నిరుడే నిగ్గు తేల్చింది.
సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని, మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ ప్రలోభపెట్టే మోసాలూ భారీగానే చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ పేరిట పుట్టుకొస్తున్న ఎన్నో నకిలీ యాప్‌లు అందినకాడికి దండుకుంటున్నాయి. పెట్టుబడిపై పదిరోజుల్లోనే రెట్టింపు లాభాన్ని ఆయా యాప్‌లు చూపిస్తున్నాయి. దాంతో అప్పులు తెచ్చి మరీ లక్షల రూపాయలు ఆ యాప్‌లలో పోస్తున్నారు. వాటిలో కేవలం సంఖ్య మాత్రమే కనిపిస్తుందని, ఆ నగదును తీసుకోవడం(విత్‌డ్రా) సాధ్యం కాదనే వాస్తవాన్ని గ్రహించేసరికి చాలా ఆలస్యమైపోతోంది. పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చిన రుణ యాప్‌లు నిరుడు చాలామంది ఉసురు తీశాయి. భారత్‌లో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పటిష్ట వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఆ మోసాలపై ఫిర్యాదు చేయడానికి 'సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్' పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో వెలుగుచూసే నేరాల సరళిని పరిశీలిస్తూ వివిధ దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర హౌం శాఖపై ఉంది. గత సంవత్సరం తెలంగాణలో నాలుగు వేలకు పైగా సైబర్ నేరాలు నమోదైనా, శిక్ష పడిన కేసులు నాలుగే! తమను ఎవరూ పట్టుకోలేరన్న ధీమానే పదేపదే నేరాలకు పాల్పడేలా చేస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా మార్గాల్లో సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. ఎటువంటి భయాలూ లేకుండా సామాన్యుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోగలిగిన నాడే నిజమైన డిజిటల్ ఇండియా సాకారం అవుతుంది.