Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధాలు, అనుబంధాల గురించి మనం తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కుటుంబ వ్యవస్థలో వీటి ప్రస్తావన ఎక్కువగానే ఉంటుంది. తల్లీ, దండ్రీ, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, అత్త, మామ, తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలా పిలుచుకునే బంధాలలో హృదయ సంబంధమైన దగ్గరితనముంటుంది. ప్రేమతో కూడిన బాధ్యత ఉంటుంది. జీవితం ఉన్నంత కాలమూ కొనసాగే అనుబంధమది. ఒకరికొకరు సంతోషాలను, ఆనందాలను, దుఃఖాలను, బాధలను, వేదనలను ఆత్మీయంగా పంచుకునే సంబంధాలుగా ఈ బాంధవ్యాలు సమాజంలో ఎప్పటి నుండో కొనసాగుతూ ఉన్నాయి. కుటుంబంలో ఒకరి బాధను ఇంకొకరు పంచుకోవటం, ఒకరి కష్టాన్ని తొలగించే ప్రయత్నం మరొకరు చేయటమూ ఈ సంబంధాల్లో ఉంటుంది. నీకోసం నేనున్నాననే భరోసా కూడా ఉంటుంది. అందుకు తగిన ఆచరణ, త్యాగమూ చూడగలుగుతాము.
సమాజంలో భూమి ఆధారంగా జీవనం సాగే సందర్భంలో భూమితో మనిషికి ఉండే సంబంధమూ గాఢమైనదిగా ఉంటుంది. భూమిని వొదులుకోలేని మనస్తత్వం ఉంటుంది. అదే విధంగా కుటుంబ సంబంధాలూ బలీయంగానే ఉంటాయి. ఈ బంధాలు కూడా విడివడకుండా ఒక అనుబంధం మానసికంగా కట్టివేయబడి కొనసాగుతుంది. అంటే అంతా సాఫీగానే ఆనందంగానే సాగుతుందని అనుకోవటానికి లేదు. భూమిపై యజమాని, అతని ఆధిపత్యము ఎలా ఉంటుందో, కుటుంబంలో కూడా యజమాని అనే భావన ఇంటిపెద్దగా సాగుతుంది. అంతే కాకుండా భూస్వామిక విలువల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థ లక్షణాలన్నీ కుటుంబంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అదే విధంగా పితృస్వామిక ఆధిపత్యమూ ఉంటుంది. వీటికి మహిళలల, కుటుంబ సభ్యుల సమ్మతి కూడా ఉంటుంది.
అయితే సమాజ జీవనంలో క్రమంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూమిపై ఉండే యాజమాన్య ఆలోచనలు మారాయి. పంటను పండించాలన్న దాని నుండి సంపద సృష్టించుకోవాలనే భావనపోయి, భూమిని వ్యాపార వస్తువుగా, సరుకుగా మార్చివేయటం జరిగింది. దీంతో దానికి సంబంధించిన అన్ని సంబంధాలలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. భూమి ఆధారంగా జీవిస్తున్న జీవితాలపైనా, కుటుంబ వ్యవస్థపైనా ఈ ప్రభావం పడింది. సంబంధాలు, అనుబంధాలపై కూడా తీవ్రమైన ప్రభావం పడి, అనుబంధం స్థానంలో అవసరం, ప్రయోజనం ప్రాధాన్యం వహిస్తున్నాయి. ఈ మార్పుల సమయంలోనే బహుశ తాతా మనువడు సినిమాలో అనుకుంటా... 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుతున్న నాటకం'' అంటూ ఆ మార్పుల పర్యవసానాన్ని గీతంలో ప్రతిబింబించారు. అంటే వ్యాపారాత్మకమైన విలువలు కుటుంబంలోనూ ప్రవేశించిన ఫలితం అది.
కుటుంబాలపై సమాజంలో పెరిగిన వ్యాపార, లాభాల ప్రభావపు విలువలు పడినప్పటికీ కులానికి, మతానికి సంబంధించిన నమ్మకాలు, అవి అందించిన విలువలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యంత అమానవీయమైన కుల అంతరాల నీచత్వపు విలువలు సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కులాలలో ఉన్న ఉన్నత, హీన భావనలు మానవ సంబంధాలపై రక్తసంబంధాలపై విపరీత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇందుకు అనేక ఉదాహరణలున్నా నిన్నగాక మొన్న వరంగల్జిల్లా పర్వతగిరిలో జరిగిన ఉదంతం వింటే, మనుషులలో కుల భావన ఎంత అమానవీయంగా వ్యవహరిస్తుందో తెలుస్తుంది. కూతురు అంజలి వేరే తక్కువ కులపు అబ్బాయిని ప్రేమిస్తోందని భావించిన తల్లి ఆ అబ్బాయిని ప్రేమించొద్దంటూ హెచ్చరించింది. అయినా మాట వినటంలేదని తెలిసి తల్లి, అమ్మమ్మ కలిసి నిద్రపోతున్న బిడ్డను దిండుతో అదిమి చంపేయడం దారుణం. ప్రేమించినవాడు హీనకులమనే భావన రక్త సంబంధాన్ని కూడా ఎంత క్రూరంగా మార్చివేసింది? ఎంతటి రాక్షసులుగా తయారుచేసింది! కన్న కూతురిని తన చేతులతోనే నిర్థాక్షిణ్యంగా చంపేయటమనే దుష్కార్యానికి ఉసిగొల్పిన కుల ఉన్మాదం ఎంత భయంకరమైనది! ఇది ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి దుర్మార్గంగా చెప్పుకుంటున్నాము. అంజలి తల్లి లాంటి మనస్తత్వాలు సమాజంలో అనేక మందిలో ఉన్నాయి. ఇంతగా వేళ్ళూనుకుపోయిన కుల దురాచారాన్ని నిర్మూలించటానికి పెద్ద ప్రయత్నమే సాగాల్సిన అవసరం ఉంది. కారణం వేరయినప్పటికీ భార్యా భర్తలు కలహించుకుని కన్న కూతురికి కరెంటుషాకు పెట్టి చంపిన ఘటన కూడా మనసును కలచివేస్తున్నది. సమాజంలో వస్తున్న మార్పులు, వొత్తిడిలు, ఆర్థిక ఇబ్బందులు, అంతరాలు, ఆవేదనలు కుటుంబాలలో కలహాలుగా మారి ఆవేశాలు పెరిగి అనుబంధాలనూ, రక్త సంబంధాలనూ హతమారుస్తున్నాయి. ఇందులో కులాలకు సంబంధించిన అహంకారాలు, పరువు అనే ఆలోచన కుటుంబ సంబంధాలను విధ్వంసమొనరిస్తున్నది. ఒకవైపు వికృత వ్యాపార లాభాపేక్షల విలువలు, రెండోవైపు కుల, మత ఛాందస మూఢత్వాలు కలిసి మానవ సంబంధాలను, మానవీయతను దగ్ధం చేస్తున్నవి. ఈ రకమైన ఆలోచనల, ఆచరణలకు వ్యతిరేకంగా సాంస్కృతికోద్యమం సాగాల్సి ఉంది.