Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగాలాండ్ నెత్తరోడింది. ఈశాన్యం ఉలిక్కిపడింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) మరోసారి అమాయక ప్రజలను బలితీసుకుంది. తీవ్రవాదులనుకుని దేశ పౌరులనే కాల్చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆపైన మరో ఏడు ప్రాణాలు. గాయాలతో మరో పౌరుడు.. ప్రజల తిరుగుబాటుతో ఓ జవాను.. వెరసి భద్రతా బలగాల బాధ్యతారహిత కాల్పుల ఘటనలో మృతులసంఖ్య పదిహేనుకు చేరింది. ఎప్పటిలాగే జరిగిన దారుణం పట్ల ప్రభువులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ''అంతులేని విచారం'' ప్రకటించారు. దర్యాప్తులకూ ఆదేశాలిచ్చారు. కానీ పోయిన ప్రాణాలను తిరిగిచ్చేదెవరని ప్రశ్నిస్తోంది ఈశాన్య భారతం. ఈ అతిక్రమణలూ, హక్కుల ఉల్లంఘనలూ ఇంకెన్నాళ్ళని విలపిస్తోందా కల్లోల ప్రాంతం. వీటికి కేంద్రం సమాధానం చెప్పాలి.
ఎప్పటిలాగే మయన్మార్ సరిహద్దుల్లోని తిరు బొగ్గుగనిలో పని ముగించుకుని తిరిగి వస్తున్నారు ఆ కష్టజీవులు. పనిలో అలసటను మరిచిపోయేందుకు పాటలు పాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి తూటాల వర్షం కురిసింది వారు ప్రయాణిస్తున్న వాహనంపై. అసోం రైఫిల్ భద్రతా దళాలు జరిపిన ఈ ఘాతుకానికి ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఎంతకూ తిరిగిరాని తమవారి కోసం వెతుకుతూ వచ్చిన గ్రామస్థులు విగత జీవులై పడివున్న సహచరులను చూసి ఆగ్రహానికి లోనయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జవాన్లు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. మరో ఏడుగురు పౌరులూ, ఒక జవానూ మృతిచెందారు. పదకొండుమంది తీవ్ర గాయాలపాలై విషమ పరిస్థితిని ఎదుర్కొంటుండగా అందులో ఒకరు మరణించారు. మిగిలినవారి పరిస్థితి ఏమవుతుందో తెలియదు. దేశ భద్రత పట్ల మోడీ ప్రభుత్వం ధృడంగా ఉందని చెప్పుకుంటున్న ఏలికలు దీనికేం సమాధానం చెపుతారు?
సరిగ్గా హౌంమంత్రి అమిత్‌షా సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్) వార్షికోత్సవ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం వైచిత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోడీ అధికారంలోకొచ్చినప్పటి నుంచీ సరిహద్దు భద్రతకు అమిత ప్రాధాన్యతనిస్తున్నారని సెలవిచ్చారు. దేశం సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ''మన భద్రతా దళాలే దేశ రక్షణకు భరోసా'' అని నొక్కి వక్కాణించారు. ఈ మాటలకు అర్థం ఇదేనా..?! ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడమేనా..?! అన్న చర్చ నేడు దేశంలో పరిస్థితులకు అద్ధం పడుతోంది.
నిజానికి ఈశాన్య భారతానికి ఈ దారుణాలు కొత్తేమీ కాదు. అనేకానేక ఘటనల్లో ఇది మొదటిదీ కాదు, బహుశా చివరిదీ కాబోదు! ఎవరో ఏమిటో తేల్చుకోకుండానే, వారి వద్ద ఆయుధాలున్నాయో లేవో ధృవీకరించుకోకుండానే ఇలాంటి కాల్పులకు తెగబడటం భద్రతా బలగాలకు పరిపాటిగా మారింది. వేర్పాటువాదాన్నీ, నిషేధిత ఉగ్రవాద సంస్థలనూ అణచివేసే పేరిట దశాబ్దాలుగా సైన్యం సాగిస్తున్న ఈ అమాయకుల ఊచకోత, మహిళలపై అఘాయిత్యాల దృష్టాంతాలెన్నో ఉన్నాయి. నాగాలాండ్‌తో పాటు, అసోం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని కల్లోల ప్రాంతాల్లో ఇవి నిత్యకృత్యాలుగా మారిపోయి చాలా కాలమే అయింది. అశాంతి, అలజడుల నియంత్రణ మాటున సాగుతున్న ఈ దుర్మార్గాలు... ఆ ప్రజల జీవితంలో ఒక భాగమైపోవడం ఎంత అమానుషం..?! సొంత పౌరులపైనే దాడులకు పాల్పడే భద్రతా వ్యవస్థ ఎంత అమానవీయం?!
సైన్యానికి అపరిమితమైన అధికారాలను కట్టబెడుతున్న ప్రత్యేక చట్టాల ఫలితమిది. 1958లో ''ఏఎఫ్ఎస్పీఏ'' చట్టం వచ్చింది మొదలు అక్కడి ప్రజలకు ఈ ఘటనలు దినదిన గండంగా మారాయి. దశాబ్దాల ప్రజానుభవం ఈ చట్టం దుర్వినియోగాన్ని నిరూపిస్తూనే ఉంది. అందుకే ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఏండ్లుగా పోరాడుతోంది స్థానిక ప్రజ. ఇరోమ్ షర్మిళ సుదీర్ఘ నిరాహారదీక్ష గురించి అందరికీ తెలిసిందే. పోలీసు కస్టడీలో సైతం పదహారు సంవత్సరాలు నిరాహారదీక్ష కొనసాగించి ప్రపంచం దృష్టినాకరన్షించారామె. అయినా ఈ ప్రభుత్వాలు చలించలేదు. ఇప్పటికీ అనేకమంది హక్కుల కార్యకర్తలూ, ప్రజాపక్షం వహించే రాజకీయ శక్తులూ నిత్యం ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. అయినా ఈ చట్టం కొనసాగుతూనే ఉంది. ప్రజల ప్రాణాలను బలికోరే ఈ చట్టాలు ఇంకెన్నాళ్లు...? ఇప్పుడు పార్లమెంటులో కూడా జరిగిన ఘటనపై వివరణ ఇవ్వడం, విచారం వెలిబుచ్చటం తప్ప, ప్రతిపక్షాలు ఎంత పట్టుబట్టినా చర్చకు అనుమతించని ప్రభుత్వ వైఖరిని ఎలా ఆమోదించాలి? మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించడం తప్ప, పరిహారం మాటెత్తని సర్కారు తీరును ఎలా అర్థం చేసుకోవాలి? పౌర సమాజం ఆలోచించాలి.