Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడచిన ఆగస్టు 11న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభా నియమాలు, విధానాలు, నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై 12మంది రాజ్యసభ సభ్యులను శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడం ముమ్మాటికీ ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమే! సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడం, అనంతరం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టడం సమంజసమే. దేశ అత్యున్నత చట్టసభల్లో కార్యకలాపాలు స్తంభించిపోవడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. ఈ ప్రతిష్టంభన సృష్టికర్తయైన పాలక పక్షమే దానిని తొలగించడానికి పూనుకోవాలి. సదరు ఎం.పి.లు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ ఉపసంహరణ అని ప్రభుత్వం మొండిగా వాదించడం తగదు. సభ సజావుగా సాగడం పాలకపక్షానికి ఇష్టం లేదని భావించవలసి వస్తుంది. సభను స్తంభింపజేయడం అన్నది 2014కి ముందు బీజేపీ అమలు చేసిన ఎత్తుగడ. ప్రతిపక్షానికి అది ఒక ఆందోళనా సాధనం అని ఆ పార్టీకి ఆనాటి నేత అరుణ్ జైట్లీ సిద్ధాంతీకరించారు కూడా! అలాంటిది పెగాసస్ వంటి కీలక సమస్యపై సర్కారును నిలదీసిన సభ్యులపై ఇప్పుడు ఇలాంటి వేటు వేయడం బీజేపీ ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. పైగా గత సమావేశాలలో జరిగిన దానికి ఈ సమావేశాలలో చర్యలకు పూనుకోవడం మరీ విడ్డూరం.
నిబంధనలకు విరుద్ధంగా ఎం.పీ.ల సస్పెన్షన్ జరిగిందని, ఎం.పీ.లు క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని ప్రతిపక్ష పార్టీలు ఒక్కమాటగా చెబుతున్నాయి. సస్పెన్షన్‌కు అనుసరించిన ప్రక్రియలో జరిగిన అవకతవకలను వారు ఎత్తిచూపారు. కొంత మంది సభ్యులు ఆ ఘటనలో కూడా లేరు. ఆగస్టు 11న రాజ్యసభలో ఆందోళన చేసిన 33 మంది సభ్యుల జాబితాను బులెటిన్‌లో విడుదల చేశారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) నేత ఎలమరం కరీం పేరు అందులో లేదు. నాడు ఆందోళనలో లేని సభ్యుడిని ఎలా సస్పెండ్ చేస్తారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సభలో ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా దాన్ని అనుమతించకపోవడం పార్లమెంటరీ నిబంధనల ఉల్లంఘనే. నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న ఎం.పీ.ల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్ న్యాయమైనది. కానీ, ప్రజాస్వామ్యాన్ని ''రక్షించడానికి'' ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సమర్థించుకోవడం ధర్మం కాదు. ఆగస్టు 11న ప్రతిపక్ష సభ్యులపై మార్షల్స్ దాడి చేశారు. ఆ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ ఆగస్టు 13న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కరీం లేఖ రాసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా కనీసం విచారణ కూడా చేయకపోవడం ప్రతిపక్షం పట్ల వివక్ష, కక్ష కాక మరేమిటి ?
నల్ల వ్యవసాయ బిల్లులను ఆమోదించినప్పుడూ, ప్రజా ప్రతిఘటన పర్యవసానంగా ఆ చట్టాలను రద్దు చేసినప్పుడూ పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే మోడీ సర్కారు 'కథ' నడిపింది. అదే ఆనవాయితీగా మారకుండా ఉండేందుకు బీజేపీ నిరంకుశ విధానాలను ఉమ్మడిగా తిప్పికొట్టాలి. పార్లమెంటులో ప్రతిపక్షాల సమన్వయానికి సస్పెన్షన్ వ్యవహారం ఒకవిధంగా దోహదపడినట్టుంది. ప్రతిపక్షాలతో ఎడమొఖం పెడమొఖంగా ఉన్న టీఎంసీ ఈ ఆందోళనలో భాగస్వామి అయింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్లు ఇందులో పాలుపంచుకోకపోవడం విస్మయకరం. ప్రజాస్వామ్యంపై దాడి జరిగినపుడు ముఖ్యంగా ప్రతిపక్షాలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినపుడు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం ఎంతో అవసరం. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని ఉమ్మడిగా ప్రతిఘటించాలి. ఆ దిశగా తెలుగు రాష్ట్రాల పార్టీలు అడుగులు వేయడం అవశ్యం. ఉభయ సభలు సాగడం, వాటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అధికార పక్షానికే కాదు, ప్రతిపక్షాలకు, ప్రజలకు కూడా అవసరం. ఈ ప్రతిష్టంభనకు కారణమైన ప్రభుత్వం ఇకనైనా బాధ్యతగా వ్యవహరించి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు చొరవ తీసుకోవాలి.