Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య..' 'అందరికీ విద్యనందించటమే మా లక్ష్యం..' ఇలాంటి నినాదాలను ఏండ్ల నుంచి మనం వింటూనే ఉన్నాం. వీటి గురించి పాలకులు ఎంత ఊదరగొట్టినా సర్కారు బడుల్లో చదువుకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. ఫలితంగా పేద పిల్లలకు ఉన్నత విద్య కాదుగదా... ప్రాథమిక విద్య కూడా అందని ద్రాక్షగా మారింది. ఒకవేళ అందినా అది నామ్‌కే వాస్తేగానే ఉంటున్నది తప్ప నాణ్యమైన విద్య మచ్చుకైనా కానరావటం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేజీ టూ పీజీ వరకూ ఉచిత విద్యనందిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి పలుమార్లు మంత్రులను ప్రశ్నించిన సమయాల్లో... కేజీ అంటే అంగన్వాడీలు, పీజీ అంటే ఉస్మానియా, కాకతీయ అనే సమాధానాలిచ్చిన సందర్భాలూ లేకపోలేదు. అదే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. కామన్ విద్యా విధానమనే స్ఫూర్తికి విఘాతం కలిగినప్పటికీ ఆంగ్ల మాధ్యమం అవసరం, అనివార్యత, దానిపై తల్లిదండ్రులకు ఉన్న మోజు, పిల్లలకు పోషకాహారం లభిస్తుందనే ఆశ... వెరసి వారిని సాకలేని పేదలు, సామాన్యులను గురుకులాల వైపు మళ్లేలా చేశాయి. ఏదేతైనేం.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక మంది బడుగు, బలహీనవర్గాల వారి పిల్లలు గురుకులాల్లో చదువుకున్నది నిజం, వారిలో కొంత మంది మంచి ప్రతిభా పాటవాలను ప్రదర్శించి ప్రయోజకులైన వాస్తవాన్ని కూడా మనం కాదనలేం. వాటితోపాటు గతం నుంచి ఉన్న సంక్షేమ హాస్టళ్లు కూడా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడూ కొనసాగుతున్నాయి.
కాకపోతే ఇటీవల గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి వెలుగు చూస్తున్న ఘటనలు ఇటు తల్లిదండ్రులను, అటు పిల్లలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా నాణ్యమైన చదువు లేకపోవటంతోపాటు నాణ్యతలేని ఆహారం, కలుషితమైన నీరు తదితర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ముక్కిపోయిన బియ్యం, పాడైపోయిన ఉల్లిగడ్డలు, చింతపండు.. కుళ్లిపోయిన కూరగాయలతో తమకు భోజనాన్ని వండి పెడుతున్నారంటూ పలు గురుకులాలు, హాస్టళ్లలోని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో నీరు కలుషితమవటంతో వాటిని తాగిన పిల్లలు ఆస్పత్రుల పాలైన ఘటనలూ వెలుగు చూశాయి. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలల పరిస్థితి చెప్పనవసరం లేదు. అధ్వాన్నంగా పడి ఉంటున్న వాటిని ఉపయోగిస్తే... పలు రకాల జబ్బులు రావటం ఖాయం. మరోవైపు ప్రస్తుత చలికాలంలో సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు చలికి వణుకుతున్న వార్తలు ప్రతిరోజూ పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ఇలా మౌలిక వసతుల కొరత అనేది వాటిని తీవ్రంగా వేధిస్తున్నది.
ఇలాంటి సమస్యలన్నింటికీ ప్రధాన కారణం విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వానికి దీర్ఘకాలిక లక్ష్యాలంటూ లేకపోవటమే. అందుకనుగుణంగా విధి విధానాలు, పక్కా కార్యాచరణను రూపొందించిన దాఖలాలు లేనేలేవు. తన రాజకీయ అవసరాలు, కేవలం ఒక కొత్త నినాదం కోసమే కేజీ టూ పీజీ ఉచిత విద్య అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు తప్ప నిజమైన చిత్తశుద్ధిని ప్రభుత్వం ఇక్కడ ప్రదర్శించలేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఒకవేళ అలాంటి చిత్తశుద్ధే ఉండి ఉంటే... రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్య, వారి డిమాండ్‌కు అనుగుణంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి, వాటికి పక్కా భవనాలు నిర్మించటం, శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించటం, నిర్వహణ కోసం నిధులు కేటాయించి, వాటిని నిర్ణీత సమయంలో ఖర్చు చేసి ఉండేవారే. కానీ ఆ పరిస్థితి ఊహల్లో కూడా కానరావటం లేదు. దీంతో ప్రస్తుతం సర్కారు భర్తీ చేశామని చెప్పుకుంటున్న దాదాపు 33 వేల గురుకుల పోస్టులన్నీ కాంట్రాక్టు పద్ధతిలోనివే. అంటే హెడ్మాస్టర్ నుంరచి గేటు దగ్గర కాపలా వాడిదాకా అందరివీ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలేనన్నమాట. అలాంటప్పుడు తమ కొలువులు ఉంటాయో.. పోతాయో తెలియని పరిస్థితుల్లో అనునిత్యం అభద్రతా భావంలో ఉండే సదరు సిబ్బంది, ఉద్యోగులు పిల్లలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలుగుతారా..? లేదా..? అన్నది పాలకులు సమధానం చెప్పాల్సిన ప్రశ్న. మరోవైపు ఇప్పటికీ అనేక గురుకులాలు, సంక్షేమ హాసళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతుండటం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లోని గురుకులాల్లో అత్యధిక పాఠశాలలకు ఆటస్థలమే లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు అక్కడ పిల్లల మానసిక వికాసాన్ని మనం ఊహించటం అత్యాశే అవుతుంది. పేదవారికి, అణగారిన ప్రజలకూ విద్యను దూరం చేసే ప్రక్రియ నూతన విద్యా విధానంతో దేశంలో విస్తరిస్తోంది. రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయంతోపాటు విద్యను కూడా కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకున్న ఫలితమిది. అందువల్ల ఇప్పటికైనా భావి భారత పౌరుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్కారు వారు... గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణతోపాటు మొత్తం విద్యారంగం కోసం ఒక సమగ్ర విధానాన్ని, స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. వాటి అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి. అప్పుడే అవన్నీ బాగుపడతాయి.