Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్రలోని కరువు ప్రాంతమైన మరాట్వాడా మహిళల గాథ మానవ హక్కుల హననానికి ఒక విషాద ఉదాహరణ. ఆ ప్రాంత మహిళలు చాలామందికి గర్భసంచులు లేవు. అక్కడి చెరకు పంట గుత్తేదారులు గర్భసంచి తొలగించుకున్న మహిళలను మాత్రమే పనిలోకి తీసుకోవడం ఇందుకు కారణం. మహిళలు నెలసరి కారణంగా రెండు, మూడు రోజులు పని చేయలేరనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఈ అత్యంత హేయమైన ఘటన మనదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతి వ్యక్తికీ పుట్టుకతోనే కొన్ని హక్కులు లభిస్తాయి. వాటిని పరిరక్షించడం ఆయా దేశాల్లోని ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదు. అయినప్పటికీ నిత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజల హక్కులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు గురవుతున్నాయి. జాతి, మతం, ప్రాంతం, లింగ, కులం, రంగు, రూపు పేరుతో ప్రజలు వివక్షకు గురవుతున్నారు. హక్కుల హననం నిత్యం జరుగుతూనే ఉంది. సమస్త మానవాళి ఎలాంటి వివక్షకు గురికాకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, సమాన హక్కులతో జీవించాలన్నది ఐక్యరాజ్య సమితి ఆశయం. అందుకోసమే డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నది. కానీ భారత్లో అందుకు విరుద్దంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక తెలుపుతుంది. మన దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూత్వ ముసుగులో మూకుమ్మడి దాడి చేసి మనుషుల్ని కొట్టి చంపుతున్నారు. జీవనోపాధులు కొల్లగొట్టడం, ప్రాథమిక హక్కులు నిరాకరించడం వంటివన్నీ నిరాటంకంగా, ఎవరూ ప్రశ్నించని రీతిలో కొనసాగిపోతున్నాయి. మన రాష్ట్రంలోనూ మరియమ్మ లాంటి ఘటనలు ఎన్నో ఉదాహరణలుగా మన ముందున్నాయి.
బాలల హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, లింగ పరమైన వివక్ష, మహిళలపట్ల హింస, కులమత సంఘర్షణలలో హక్కుల కోసం ఉద్యమించిన సామాజిక కార్యకర్తలు హతమవుతున్నారు. ప్రతి వ్యక్తికీ కనీస సౌకర్యాలు పొందే హక్కు ఉంటుంది. కానీ రాష్ట్రాల్లో ఇప్పటికీ తాగునీరు, రవాణా, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేని గ్రామాలు కోకొల్లలు. పంచవర్ష ప్రణాళికలు ముగిసినా, వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా కొన్ని వర్గాల్లో సామాజిక అభివృద్ధి లోపించడం హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర ఫలాలు వారికి ఇప్పటికీ అందకపోవడం బాధాకరం. మానవులపై ఔషధ ప్రయోగాలు చేయడం అత్యంత నేరం. కానీ, ఇటీవల భద్రాచలం ఆదివాసీ యువతులపై ఇలాంటి ప్రయోగాలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివాసులను మోసం చేస్తున్నారు. వారి హక్కులను కాలరాస్తూ మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
పీసా చట్టం-1996 ప్రకారం అటవీ వనరులపైన అధికారం ఆదివాసులదే. కానీ, వారి అనుమతి లేకుండానే వనరుల వెలికితీత విచ్చలవిడిగా జరుగుతోంది. ఒడిశా, మధ్యప్రదేశ్ల లోని అడవుల్లో, తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల ప్రాంతంలో చేపడుతున్న యురేనియం అన్వేషణ వంటి కార్యక్రమాలు ఆ ప్రాంత ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సహజ వనరుల పేరుతో అడవులు విధ్వంసానికి గురవుతున్నాయి. దేశ జనాభాలో 8శాతం ఉన్న ఆదివాసుల హక్కుల సంగతి సరేసరి. సంచార జాతుల పరిస్థితి దయనీయం. వారి హక్కులు తరచూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. స్థిర నివాసంలేని వారి జీవనం దుర్భరంగా ఉంది. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ఇటీవల వచ్చిన 'జై భీమ్' సినిమా ఇలాంటి ఘటనల ఆధారంగానే తెరకెక్కింది.
మన దేశంలో రాజ్యాంగ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలను మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఎన్హెచ్ఆర్సి 28వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హౌం మంత్రి అమిత్ షాల ప్రసంగాలు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. మెజారిటీవాద రాజకీయాల కోణం నుంచే దేశంలో మానవ హక్కులు చూడబడుతున్నాయి. అందుకే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, దళితులు, ఆదివాసీల మానవ హక్కుల ఉల్లంఘనలను పాలక వ్యవస్థ పట్టించుకోవడం లేదు. మతపరమైన, భాషాపరమైన, జాతి పరమైన వివిధ మైనారిటీల హక్కులను ఏ మేరకు పరిరక్షించ గులుగుతుందన్నది ప్రజాస్వామ్యానికి పరీక్షగా ఉంటుంది. కాబట్టి, రాజకీయాలు, రాజకీయ లబ్ధి, నష్టం అనే కోణం నుండి చూసినపుడు మానవ హక్కులకు అతి పెద్ద ఉల్లంఘన జరుగుతోందంటూ మోడీ మాట్లాడిన మాటలు, ఈ ఆరోపణలు అన్నీ కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తిగా వర్తిస్తాయి. సాధారణ ముస్లింల హక్కులను పణంగా పెట్టి మతోన్మాద ధోరణలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నది ఈ సంకుచిత హిందూత్వ రాజకీయాలే.