Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రణ భేరి మోగించండి! రక్తం ఏరులై పారనీయండి!!
విజయమో, వీరస్వర్గమో!'' అంటాడు షేక్స్పియర్ ''ఆరవ కింగ్ హెన్రీ''.., ఆ మాటల్ని అలానే తీసుకున్నారో ఏమో ఢిల్లీని గేరివేసిన రైతువీరులు. ఆ ఉద్యమం శాంతియుతమే. కాని మోడీ సర్కార్ దానిపై రక్తపు శకటాల్ని ఉసిగొల్పింది. లోతైన ఆ చక్రాల దాహార్తిని తీర్చేందుకు నాలుగు రౌండ్ల పిస్తోలు గుండ్లూ ఉరికి వచ్చాయి. ఫొటో జర్నలిస్ట్ రమణ్ కాశ్యప్ని బలితీసుకున్నాయి. ఏడు వందలకు పైగా సాటి యోధులు నేలకొరుగుతున్నా లక్షలాది ఆ వీరుల లక్ష్యం చెదరలేదు. పయనం ఆగలేదు. వారి సంకల్పం ముందు రుతువులు తలవంచాయి. అవును కదా! వాళ్ళు సేద్యగాళ్ళు. ఎండా వానలు వాళ్ళనేమి చేస్తాయి?! గోడీ మీడియాలో పోజులిచ్చిన బెంజ్కార్లు, బి.ఎమ్.డబ్ల్యు.గాళ్ళు వెలిసిపోయారు. ఆ ఉద్యమంలో అత్యధిక మంది చిన్న, సన్నకారు రైతులేనన్న పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల పరిశోధన ఆరబ్ గోస్వాముల, అజ్తక్ చానళ్ళ చెంప చెళ్ళు మనిపించింది.
వాళ్ళు దాటిన 'వైతరిణి' ఫసిఫిక్ మహాసముద్రం కంటే లోతైనది. వాళ్ళంతా దైవభక్తులే. విజయం వస్తే మన క్రికెట్ ఆటగాళ్ళలా ఆకాశంవైపు తిరిగి దండం పెట్టుకునే వారే! కాని 'లలాట లిఖితం' మార్చనగునా అని దేవుడిపై భారం వేసికూచోలే. మానవ నిర్మిత అడ్డంకుల్ని మానవ ప్రయత్నం ద్వారానే ఎదుర్కోవాలనుకున్నారు. ఎదుర్కొన్నారు కూడ! 'సంస్కరణ వాదులు' మొదటి దశ రాజకీయులకే వదిలేశారు. సీఏఏ / ఎన్ఆర్సీ వ్యతిరేకుల్ని 'తుక్డే, తుక్డే గ్యాంకు'లన్న కొత్వాలు భాషే మీడియాలోని వారి అంతేవాసులు విశ్వంలో ప్రతిధ్వనించారు. మోడీ మూడు రైతు చట్టాలు వ్యవసాయాభివృద్ధి కోసమేనంటే ఏలినవారు కక్కిన కూటినే పంచామృతంగా గ్రోలే ''గోడీ మీడియా'' దేశమంతపెద్ద భూతద్దంలో చూపింది. ఆ విధంగా పరిశీలన, పరిశోధన, భిన్నాభిప్రాయాల సమాహారంగా వార్తలుండాలన్న విచక్షణ కోల్పోయి ప్రభుత్వ గజ్జల్లో వెచ్చగా విశ్రమించింది.
రెండవ దశలో ఆర్థిక వేత్తలు రంగంలోకి దిగారు. వారి ముందో, వెనకో, పక్కనో, మీడియా ప్రముఖులు కూడా ఉంటారు కదా! ''మోడీ స్థిర చిత్తుడనుకున్నాం. చివరికి ఆయన కూడ రాజకీయాలకే తలొగ్గాడు'' అని వాపోతున్నారు నేటి సమాజంలో ఆర్థిక వేత్తలుగా చెలామణీ అవుతున్నవారు. కొందరేమో 2022 (యూపీ ఎన్నికలు) ముఖ్యమని, మరికొందరు 2024 (లోక్సభ ఎన్నికలు) ముఖ్యమని రాస్తున్నారు. సంవత్సర కాలం మోడీని భుజాన మోసిన ఒక చానెల్ ''రైతు చట్టాల ఉపసంహరణ బీజేపీకి ఏమీ లాభించదు. పైగా మోడీ కీర్తిని మసకబార్చింది'' అన్నది. 'కొంపతీసి కార్మిక కోడ్లు కూడా ఉపసంహరిస్తారేమో' అని కొందరు ఆర్థిక వేత్తలు వాపోతున్నారు. ఇవి రెండూ లేకుంటే ఇక కార్పొరేట్ల బాన పొట్టలు నిండేదెట్టా? వాటిని నింపేదెవరన్నది వారి 'ఆవేదన!'. దాని కోసం ఒంకర టింకర వాదనలు ముందుకు తెస్తున్నారు. ఉచిత విద్యుత్ రైతులకివ్వడం వల్ల వాటర్ టేబుల్ తగ్గిపోతుందని, పర్యావరణ పెనుమార్పులకు దారితీస్తుందని ఒక వాదన. ప్రస్తుతం మిషన్ కాకతీయ వల్ల తెలంగాణలో చెరువులు నిండి భూగర్భ జల మట్టాలు పెల్లుబికిన తీరు కండ్లముందే ఉంది కదా! గతంలో వామపక్ష ప్రభుత్వం బెంగాల్లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకిచ్చిన ప్రాధాన్యత వల్ల నేడు వరిపంట పెద్ద ఎత్తున పెరిగిన విషయం ఈ పెద్దలకు కనపడదేమో!
మోడీ రెండవటర్మ్లో ప్రళయభీకరంగా ''సంస్కరణల''కై ప్రయత్నించారు. దేశ విదేశ కార్పొరేట్లు ఉప్పొంగిపోయారు. ఇప్పుడు 378 రోజుల రైతు పోరాటంతో ఒకడుగు వెనక్కి తగ్గాడు. ఏది ఏమైనా, ఈ వెనకడుగు వెనక జి-7 దేశాల సలహా ఉంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థల సంప్రదింపులున్నాయి. ఎందుకంటే పంజాబ్, హర్యాణా, యూపిల్లో జియోకి గిరాకి తగ్గింది. రిలయెన్స్ బంక్ల్లో డీజిల్ కొట్టించుకునే రైతులు తగ్గారు. ఇలాంటి ఉద్యమం దేశమంతా విస్తరిస్తే మొదటికే మోసం రావచ్చనే భయముంది. బీజేపీకి 2024 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం కీలకం. దాన్ని సుసాధ్యం చేయాలంటే 71మందిని లోక్సభకు పంపిన యూపీ కీలకం. రైతు ఉద్యమానికి ముగింపు పలకకుంటే గ్రామాల్లో కెళ్ళే పరిస్థితే లేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (ఆయన యూపీ వాసి) అవకాశమున్నప్పుడల్లా చెప్పిన విషయం విదితమే కదా!
ఫలితమొచ్చే వరకు పోరాటమంటే ఏమిటో దేశానికి నేర్పింది రైతు ఉద్యమం. సాధారణ సమస్యలు కాకుండా నిర్దిష్ట సమస్యలపై ఉడుం పట్టు పడితే, 500 సంఘాలను కలుపుకుని విశాల ఐక్య ఉద్యమం నిర్వహిస్తే పాలకులను లొంగదీయవచ్చని రుజువు చేసిన మహా ఉద్యమం నేడు విజయ దరహాసం చేస్తోంది.