Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారేయేరులో కొత్తనీరు వచ్చి చేరాలి. అప్పుడే జవమూ జీవమూను. అలాగే తరలిపోతున్న తరం తలంలో కొత్తతరం రావాలి. నూతన తరం తయారవుతూనే ఉంటుంది. అయితే అది అన్ని వ్యవస్థల్లోకి చేరుకోవాలి. లేకుంటే అది నిలిచిపోయిన ఆలోచనలా నిస్తేజమవుతుంది. నిలువున్న నీటిలా మలినమవుతుంది. ముఖ్యంగా సమాజాన్ని తమ తమ దృక్పథాలతో ముందుకు నడిపే రాజకీయ వ్యవస్థలోకి యువతరం రాకపోతే వెనుకబడిన భావాలు రాజ్యమేలుతాయి కదా! 'కొన్ని దశాబ్దాలుగా విద్యార్థి లోకం నుంచి ఒక చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడు ఎవరూ కనిపించలేదు, ఉద్యమించలేదు' అని మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్న మాటలు అక్షరాలా నిజం. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత సామాజిక ప్రయోజనాల కోసం జరిగే కృషిలో విద్యార్థుల పాత్ర తగ్గిపోయిందన్న మాటా వాస్తవమే.
'యువతరం శివమెత్తితే, నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా! చీకటే మాసిపోదా!' అని పాడుకున్నాం. యువతలో వుండే శక్తికది నిదర్శనం. అందుకే స్వామి వివేకానంద 'నాకు ఉక్కు గుండెలు గల పది మంది యువకులను ఇవ్వండి, ఈ దేశాన్ని మార్చివేస్తాను' అని అన్నాడు. మన దేశంలో పెద్ద భాగంగా ఉన్న యువత సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతమైనప్పుడే నూతన మార్పులకు మార్గం ఏర్పడుతుంది. చదువుకుంటున్న యువత సామాజిక వాస్తవికతకు దూరంగా ఉండటమనేది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే సామాజిక విప్లవాలు, మార్పులు అన్నీ రాజకీయంగా చైతన్యవంతమయిన, సామాజిక బాధ్యత గల విద్యార్థుల నుంచే వచ్చాయి. మన దేశ స్వాతంత్య్రం కోసం డెబ్బయి ఐదేండ్ల క్రితం విద్యార్థులుగా ఉన్న యువతే ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నది. ప్రజలను చైతన్య పరిచేందుకు రాజకీయ రంగంలోకి దూకారు. సుబాస్చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి, భగత్‌సింగ్, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైన అనేక మంది విద్యార్థి దశ నుండే దేశం కోసం ఆలోచించి జీవితాలను అంకితం చేశారు.
కానీ నేడు విద్యార్థులు, యువత రాజకీయరంగంలోకి రావడానికి ముందుకు రావటం లేదు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి రాజకీయాలు దిగజారిపోయిన విలువలతో, స్వార్థంతో నిండిపోయి ఉండటం. డబ్బు, దర్పం ఉన్న వాళ్ళకే ప్రాధాన్యతలు పెరగటం. రెండోది నేటి విద్యా వ్యవస్థ, సమాజం వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం చేసే ఆలోచనలు అందివ్వటం. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత వ్యాపార మార్కెట్ రంగం మనుషుల్ని వినియోగదారులుగా మాత్రమే తీర్చిదిద్దింది. మార్కెట్ విద్యనే రూపొందించింది. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యతో సేల్స్‌మెన్‌గా, సరుకులను ప్రమోట్ చేసే రిప్రజెంటీటీవ్స్గా నేటి విద్యార్థులు మారుతున్నారు. సామాజిక శాస్త్రాల అధ్యయనం, సమాజ అధ్యయనం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో విద్యార్థికి సమాజంపట్ల బాధ్యత కరువైపోయింది.
విద్యా వ్యవస్థ ప్రయివేటు వ్యాపారంగా మారటంతో, నేటి తల్లిదండ్రులు కూడా విద్యను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. ప్రయివేటు కళాశాలల్లో, కాన్వెంట్లలో చదివితే ఎక్కువ డబ్బు సంపాదించే ఉద్యోగావకాశాలు వస్తాయనుకొని పిల్లల్ని సంపాదనా పరులుగానే భావిస్తున్నారు. దాంతో యువతలో స్వార్థపరత్వము, సంకుచితత్వం కూడా చోటు చేసుకుంటోంది. మొత్తం సమాజంలో భాగంగా మన అభివృద్ధి ఆధారపడి ఉంటుందనే అవగాహన వారికి లేకుండా పోయింది. సామాజిక వాస్తవికతకు దూరంగా ఉండటంతో రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. సమాజాన్ని, వ్యవస్థను మనమే మార్చుకోవాలన్న స్పృహ కూడా సన్నగిల్లింది. విద్యార్థుల నుండి నాయకత్వంలోకి చేరే యువత శాతం చాలా తగ్గిపోయింది. ఈ కారణంగా వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయి. తాతలు, తండ్రుల వారసులుగా వంశపారంపర్య రాజకీయాలు కొనసాగుతున్నాయి.
అయినప్పటికీ, ఇప్పటికి కూడా వామపక్ష విద్యార్థి ఉద్యమం వీటన్నింటికీ ఎదురునిలిచి ఉద్యమాలలోకి విద్యార్థులను, యువతను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఆ మేరకు దేశ ప్రజాస్వామిక స్ఫూర్తిని అందరికీ అందించే దాంట్లో ముందుంటున్నది. ఈ దేశపు మౌలిక భావనలైన ప్రజాస్వామిక, లౌకిక తత్వాలకు ఎదురవుతున్న సవాళ్ళను ప్రతిఘటిస్తూనే ఉన్నది. అదింకా సరిపోదు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకోసం, నూతన తరం ఆశలను ఆశయాలను నిజం చేసుకోవడం కోసం కార్యరంగంలోకి దూకాల్సిన అవసరం ఉంది. జస్టిస్ రమణ చెప్పినట్లుగానే కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసినవాళ్ళు సంపన్నుల కేంద్రంగానే పనిచేస్తారు. జైభీమ్ సినిమా నిజమైన నాయకుడు జస్టిస్ చంద్రులాంటి వాళ్ళు ఇప్పుడు మనకు దొరకడం కష్టం. ఏ కొద్దిగానో అక్కడక్కడ కనపడవచ్చు. అందుకే యువరక్తం ప్రవహించే విద్యార్థులు చైతన్యంతో రాజకీయరంగంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈ దేశం వారి కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది.