Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజంగానే సింగరేణి మన తెలంగాణ 'కొంగు బంగారం'. అది ఒక వ్యక్తిది కాదు. ఒక పార్టీదీ కాదు. ఒక రోజులో ఏర్పడింది కాదు. లక్షల టన్నుల బొగ్గు నిక్షేపమది. లక్షల కోట్ల రూపాయలు విలువచేస్తుంది. దాని రక్షణకై రాజకీయ అనుబంధాలను దాటుకుంటూ యూనియన్ల గీతలకు అతీతంగా వేలాది మంది కార్మికులు ఒక్కటై నిలిచిన 'ఆ మూడు రోజుల పోరు' అపురూపం... సింగరేణి నాశనానికి, ఆ మాట కొస్తే దేశంలోని బొగ్గు రంగమంతటి వినాశానికి, ఇంకా చెప్పాలంటే యావత్ ప్రభుత్వ రంగాన్ని దుంపనాశనం చేసేందుకు నడుం కట్టిన బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఆ కార్మికుల వెన్నంటి నిలిచాయి. సమ్మె చేసిన ఆ కార్మికులు, వారి వెన్ను కాచిన రాజకీయ పార్టీలు అభినందనీయులే! ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అభినందనీయురాలే!
అయితే ఈ సందర్భంలో రాష్ట్ర పాలకులు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కోల్‌మైన్స్ (స్పెషల్ ప్రొవిజన్స్) యాక్ట్ 2015 పార్లమెంట్లో పాస్ అయ్యే సమయంలో టీఆర్ఎస్ సభ్యులు ఎక్కడ నిలబడ్డారు? ట్రెజరీ పక్షానా? ప్రతిపక్షాలతోనా? 2017 మార్చి 30న పై చట్టంలోని ఫలానా రూల్స్ ప్రకారం అనేక రాష్ట్రాలలోని 13 బ్లాకు లను అర్రాజు పెడ్తే అటు పార్లమెంట్ సభ్యు ల నుంచి ఇటు అధి నాయకుడి వరకు ఏమైనా 'లొల్లి' చేశారా? నోట్ల రద్దు (2016 నవంబర్ 8) జీఎస్టీ (2017
జులై 1) వంటి ఎన్నో విషయాల్లో బీజేపీతో అంటకాగుతున్నందుకు బహుశా ఆ బండి మన పైకి తోలరనుకున్నారో, తోలినా తమకు పోయేదేంటి అనుకున్నారో!? ఆనాటి ''హనీమూన్' కాలంలోని ఆశలు వేరు, కోరికలు వేరు. అదొక మైకం! తాజాగా మొన్న డిసెంబర్ 8న ఒక పార్లమెంట్ సభ్యుడికిచ్చిన సమాధానంలో బొగ్గు శాఖ ఉపమంత్రి సగర్వంగా కాలరెగరేస్తూ ఇప్పటికి 62 బ్లాకులు, ఆరు రాష్ట్రాల్లో ప్రయివేటు వారికి కట్టబెట్టినట్టు చెప్పారు కదా! ఆ మార్నాడు, అంటే 2021 డిసెంబర్ 9న కేసీఆర్ మోడీకి రాసిన లేఖలో 'మా సింగరేణి''లో బ్లాకుల వేలం ఆపమంటారే గాని ఆ విధానాన్ని కనీసం ప్రశ్నించరు. ప్రయివేటీకరణ సునామీలో అన్నీ కొట్టుకు పోతుంటే సింగరేణిని కేసీఆర్సాబ్ గొడుగుతో తడవకుండా చూడగలరా?
ప్రస్తుతం నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)లో 160 బొగ్గు బావులకు మోడీసాబ్ 'స్పాట్' పెట్టాడు. ఈ ఎన్ఎంపీ గురించి కేసీఆర్ గానీ, టీఆరెస్ పార్లమెంట్ సభ్యులుగాని తమ స్వరం వినిపించారా? అసలు వినిపిస్తారా? ''ఈ రోజు స్టీల్ ప్లాంట్, రేపు మా సింగరేణి' అని గతంలో గంభీరోపన్యాసం చేసిన కేటీఆర్ నేడు సాక్ష్యాత్తు మన 'కొంగుబంగారాని'కి పెను ప్రమాదం వస్తే, దాన్ని కాకి బంగారం (అబ్రకం)లా అమ్మి పడేస్తుంటే కేంద్రంతో యుద్ధం కదా చేయాల్సింది? అల్యూమినియం, జింక్, రాగి, ఇనుము వంటి ప్రధాన గనులు, బాల్కో, నాల్కో హిందుస్థాన్ జింక్, కాపర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ఫ్యాక్టరీలన్నీ బీజేపీ పుణ్యాన ఒక్కొక్కటిగా ప్రయివేటు పరం అవుతున్నాయి. చేత్తో ఆపడానికి చెరువుకు చిన్న రంధ్రం పడలేదు. ఇది ప్రయివేటీకరణ ఉప్పెన. సింగరేణి చల్లగా ఉండేలా చూడమని మోడీకి విజ్ఞప్తులు చేసినా, ముక్కోటి దేవతలకు మొక్కినా నిరుపయోగం. టీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాల్సిన విషయమిది.
బొగ్గు మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో 'తమ గురించి' (అబౌట్) రాసిన మొదటి పేజీలో ''అన్వేషణ, అభివృద్ధికి సబంధించి విధానపరమైన వ్యూహాత్మక విషయాలన్నింటి పైన బొగ్గు మంత్రిత్వ శాఖదే అంతిమ నిర్ణయం'' అన్న మాటలకు అర్థమేమిటి అమాత్యా! సింగరేణిలో 49 శాతం వాటా కలిగి యున్నామన్న వాక్యం దాని తదుపరే ఉంది కదా! సింగరేణితో సహా ''అన్ని సంబంధిత విషయాల్ని (ఆల్ రిలేటెడ్ ఇష్యూస్) నిర్ణయించే అధికారం బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటే కేంద్ర ప్రభుత్వ
విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయకుంటే సింగరేణి బతికి బట్టకడుతుందా? గత ఏడు సంవత్సరాల్లో దేశంలో బొగ్గు గనుల రక్షణ కోసం అనేక సమ్మెలు జరిగాయి. బొగ్గు కమర్షియల్ మైనింగ్‌కు వ్యతిరేకంగా 2000 సంవత్సం నుంచి నేటి తాజా సమ్మె వరకు జరిగిన ఎన్నో సమ్మెల పట్ల టీఆర్ఎస్ వైఖరేంటో. వాటిలో దాని పాత్రేమిటో పరిశీలించుకోవాలి. ''సమ్మెలు కార్మికుల చైతన్యాన్ని పెంచే పాఠశాలలు'' అన్న లెనిన్ మాటలు నిజం ఎక్కడవుతాయోనని పాలక పార్టీలకు భయం. సమ్మె ఎందుకు చేస్తున్నారో కార్మికులకు తెలియాలి. ఏ పార్టీల విధానాలకు వ్యతిరేకంగానో తెలియాలి. ఆ రకంగా సమస్యలకు, విధానాలకు మధ్యనున్న అంతస్సంబంధం అర్థమవుతుంది. అసలు దొంగల్ని గుర్తిస్తారు. అటువంటి పార్టీలతో గులాలు చల్లుకోవడానికి టీఆర్ఎస్ వంటి పార్టీలకు అవకాశాలు మూసుకుపోతాయి.
బొగ్గు గని కార్మికుల పై సమ్మెలన్నింటికి మద్దతుగా ప్రధానంగా వామపక్షాలే నిలిచాయి. నైవేలి లిగ్నైట్ ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో డిఎంకే కూడా నిలచింది. ఆస్థాయిలో టీఆర్ఎస్ కూడా పాల్గొని తన శ్రేణులను కూడా చైతన్య పరిస్తేనే మన 'కొంగుబంగారానాని'కి రక్ష.