Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రజలు మాంసాహారం తినకుండా ఆపలేరు. వారి ఆహార అభిరుచుల్ని అడ్డుకోలేరు. ప్రజలు మాంసాహారం తింటే మీకేంటి సమస్య? మీరు తినకపోతే.. అది మీ దృక్పథం. నేనేం తినాలో మీరెలా నిర్ణయిస్తారు?'' అని అహ్మదాబాద్ మున్సిపాల్టీ అధికారుల్ని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బీరేన్ వైష్ణవ్ ప్రశ్నించారు. ప్రజలు ఏం తినాలో.. తినకూడదో నిర్ణయించడానికి మీరెవరు? అంటూ ఇప్పటి వరకు సామాన్యులు, ప్రజాతంత్రవాదులు మాత్రమే ప్రశ్నించారు. కానీ, నేడు కోర్టులు కూడా అవే ప్రశ్నలు వేస్తున్నాయంటే ఈ దేశంలో తిండి, బట్టలపై ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారో తెలియడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ''రహదారుల వెంబడి ఎక్కడా మాంసాహారం అమ్మరాదు''.. అంటూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వారి ఉపాధిని దెబ్బతీసిన ఈ ఘటనలో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆ వీధి వ్యాపారులకు కొంత ఊరట. దేశంలో ఇలాంటి ఘటనలు అనేకం నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న కర్నాటకలో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెట్టడాన్ని మఠాధిపతులు వ్యతరేకించారు. అయితే అక్కడి విద్యార్థిని ''ఇలానే మా తిండిపై దాడి చేస్తే మీ మఠానికే వచ్చి మరీ మా తిండి తింటాం'' అంటూ తొమ్మిదో తరగతి విద్యార్థిని వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది.
దేశమంతటా అసహన మేఘాలు అలుముకుని ఉన్న కాలమిది. ఆ '' పరివారాని''కి నచ్చనిది తిన్నా, కట్టుకున్నా సహించలేని పరిస్థితులు మెడమీద కత్తిలా వేలాడుతున్న సమయమిది. అసలు జరుగుతున్న వాస్తవమేంటే గతం కంటే కూడా మన దేశం నుంచి బీఫ్ మాంసం ఎగుమతులు అనేక రెట్లు అధికం. ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది వీరి సహచరులే. అయినా తరతరాలుగా ఈ దేశంలోని ఆహారపు అలవాట్లను వ్యతరేకించి చిచ్చు రేపడం వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప సంఘ్ పరివార్‌కు మరో ఆలోచనే లేదు. అదే గుజారాత్ రాష్ట్రంలో దళిత పెండ్లికొడుకు గుర్రంపై వెళ్తుండగా అగ్రకుల మూకలు అడ్డుకొని దాడి చేశాయి. తాజాగా నిన్న మధ్యప్రదేశ్‌లో కులాంతర వివాహం జరుగుతున్న వేదికపై దాడిచేసి పిస్టల్‌తో కాల్పులు జరిపారు. ఈ విధంగా కుల, మత దురహంకారం మంటలు రేపుతుంటే... అక్కడి ప్రభుత్వం ఆ మంటలార్పకుండా ఆజ్యం పోస్తున్నది. వాటితో చలి కాచుకునే ప్రయత్నాలు కూడా చేస్తుండటం ఆందోళనకరం. మన రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. నల్లగొండలో వ్యవసాయం కోసం పశువులను పెంచుకుంటున్న ఓ దళిత కుటుంబంపై ఆరెస్సెస్ మూకలు దాడులకు తెగబడ్డాయి. చిన్న కందుకూరులో సంక్రాంతి నాడు గొడ్డుమాంసం తిన్నారని ఆరెస్సెస్, భజరంగ్‌దళ్ మూకలు అర్థరాత్రి ఆయుధాలతో దాడికి దిగిన తీరు తెలంగాణ సమాజాన్ని కలవరపరిచింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ ఆశ్రమంలోని చేతిపంపు వద్ద తండ్రీ కూతుళ్లునీరు తాగినందుకు స్వామిజీతో పాటు మరికొందరు వ్యక్తులు త్రిశూలంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దళితులపై దాడులు ఆపాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చిన తరువాతే ఈ ఘటనలు చోటుచేసుకోవడం వారి ద్వంద్వ దుర్నతికి నిదర్శనం. గతంలో తెలంగాణ పర్యటనలో మోడీ 'దళితులను కొట్టాలనుకుంటే.. నన్ను కొట్టండి. వారిని చంపాలనుకుంటే నన్ను చంపండి' అని అన్న సంగతి తెలిసిందే. కానీ, ప్రధాని వ్యాఖ్యల తరువాత ఇలాంటి దాడులు మరింత అధికమయ్యాయి అంటే ఆయన మాటల అంతర్యం అదే అయి ఉండవచ్చు.
ఇవి కాకతాళీయంగా జరిగిన సంఘటనలుగా మనం భావిస్తే అది పొరపాటే. దేశవ్యాపితంగా చెలరేగుతున్న అసహన ప్రకంపనల్లో భాగమే ఇవి. ఏ సంస్థాగతమైన మద్దతు లేకుండా ఇలాంటి ఘోరాలకు పాల్పడటం సాధ్యం కాదు. పన్సారే, దభోల్కర్ హత్యల విచారణ నేపథ్యంలో బొంబాయి హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఇటువంటి ఘటనల పట్ల కేంద్రం పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం ఈ చర్యలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ ఘటనలే కాదు, దేశంలో తరచూ చూస్తున్న ఇటువంటి దాడులన్నీ బీజేపీ మార్కు జాతీయ వాదానికి భౌతికమైన వ్యక్తీకరణలు.
మనుషుల్ని, వారి ఆహారపు అలవాట్లని, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించలేని సరికొత్త జాతీయవాదం మన ముందుకొచ్చింది. అసంఖ్యాకులైన భారతీయులందరూ ఆంక్షలతో బతకాల్సిందే. దేశభక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చేసిన తరుణంలో ఏమి తింటే, ఏమి అంటే ఏమవుతుందోనన్న దిగులు సర్వత్రా నెలకొంది. యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంకెంత ఉన్మాదం చెలరేగుతుందో..! ఇంకెలాంటి ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందో? పౌర సమాజమంతా ఒక్కటిగా నిలబడి పోరాడితే తప్ప ఈ విష సంస్కృతిని అరికట్టలేం.