Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరళీకృత ఆర్థిక విధానాలు శరవేగంగా ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో సగటు జీవికి కావాల్సిన సౌకర్యాలన్నీ మార్కెట్ పరమైపోతున్నాయి. కడుపునిండా తిండి, కట్టుకోవటానికి బట్ట, తలదాచుకోవటానికి ఓ ఇల్లనేవి మనిషి ప్రాథమిక అవసరాలు. వీటి తర్వాత ఆరోగ్యం. జబ్బొస్తే చేయించుకోవాల్సిన వైద్యం ముఖ్యమైనవి. దేశంలోని ప్రతీ పౌరుడికి వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన్నే ఉందని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ దేశాన్ని ఇంతకాలం ఏలిన పాలకుల పుణ్యమాని... అది అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వాలు వైద్యరంగం నిర్వహణ బాధ్యత నుంచి క్రమక్రమంగా తప్పుకోవటమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలోని పేద ప్రజానీకానికి అవసరమైన మందులు, ఇంకా చెప్పాలంటే అత్యధిక మంది అనివార్యంగా వాడాల్సి వస్తున్న బీపీ, షుగర్ తదితర మాత్రలను నిర్ణీత సమయంలో అందించటం ద్వారా వారి ప్రాణాలను కాపాడుతున్న 'ఫిక్స్్డ్ డే హెల్త్ సర్వీసెస్...'ను ప్రభుత్వం ఎత్తేయజూడటమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. '104' వాహన సేవల పేరిట ప్రజలందిరకీ సుపరిచితమైన ఈ సర్వీసెస్‌ను అందిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అందరూ తమ ఉద్యోగాలను కాపాడాలంటూ ఇప్పుడు రోడ్డెక్కారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో ఈ సేవలను ప్రారంభించారు. 'ఊరూరికీ, ఇంటింటికీ వైద్యం...' అనే నినాదంతో '104' వాహనాలకు పచ్చ జెండా ఊపారు. అయితే అప్పట్లో వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మౌలిక వసతులు, మందులు, వైద్యులులేక ఎప్పటి నుంచో కునారిల్లుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను బలోపేతం చేయకుండా ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేయటం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండబోదని పలువురు హెచ్చరిస్తూనే ఉన్నారు. వాహనాలను నడపటంతోపాటు పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను మరింతగా బలోపేతం చేయటం ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలంటూ వైద్యులు, వైద్య నిపుణులు సర్కారుకు సూచించారు. కానీ ఆనాటి ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టింది. కాలక్రమంలో 104 వాహన ఉద్యోగులు, సిబ్బంది తమకు సాధ్యమైనంత రీతిలో ఉన్నంతలో గ్రామీణ, పట్టణ పేదలకు మెరుగైన సేవలందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ విడిపోయాక కూడా ఇప్పటి వరకూ అదే రీతిలో సేవలందిస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచి కదల్లేని వారు, చిన్న పిల్లలు, వృద్ధులకు నిర్ణీత సమయంలో వైద్య పరీక్షలు చేస్తూ, మందులిస్తూ ఆయా వాహనాలు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల మీద దృష్టి సారించిన టీఆర్ఎస్ సర్కారు... '104' సేవలు అవసరం లేదనే ఆలోచనకొచ్చింది. అందుకే మరమ్మతులకు గురైన వాహనాలకు రిపేర్లు చేయకుండా తాత్సారం చేస్తున్నది. ఉమ్మడి పది జిల్లాల్లో మొత్తం 198 వాహనా లుండగా... ఇప్పుడు కేవలం 50శాతం వాహనాలే తిరుగుతున్నాయి. ప్రస్తుతమున్న 33జిల్లాల వారీగా చూస్తే... ఒక్కో జిల్లాకు రెండు వాహనాలు మాత్రమే సేవలందిస్తున్నట్టు తేలింది. అనధికారిక సమాచారం ప్రకారం... ఇప్పుడు తిరుగుతున్న వాటిని కూడా ఈనెలాఖరుకు మూసేసేందుకు వీలుగా రంగం సిద్ధం చేశారని వినికిడి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొస్తున్న వేళ... అత్యాధునిక సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాల్సిన ప్రభుత్వాధినేతలు, అందుకు భిన్నంగా వాటిని మరింత నిర్వీర్యం చేయటం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం... అన్ని రంగాలనూ ప్రయివేటీకరిస్తున్నది. దీంతో ఇప్పుడున్న విద్య, వైద్య రంగాలు కూడా మున్ముందు పూర్తిగా పేదలకు అందని ద్రాక్షగా మారతాయని నిపుణులు, సామాజిక వేత్తలూ హెచ్చరిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌లాంటి పథకాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దటం ద్వారా ఆరోగ్యరంగంలో కూడా మోడీ సర్కారు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. కేంద్ర బడ్జెట్లో వైద్య రంగానికి కనీసం ఆరు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా.. మనది రెండు శాతం కూడా దాటటం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక వైద్యారోగ్య పథకాలు నత్తనడకన నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు విధానాలపై నికరంగా పోరాడాల్సిన రాష్ట్రాలు ఆ పని చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వివిధ రంగాల్లో కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన సీఎం కేసీఆర్... అందుకు భిన్నంగా ఒక నికరమైన విధానంతో పోరాడటం లేదన్న విమర్శ బలంగా వినపడుతున్నది. ఇది రాష్ట్ర వైద్య రంగానికి శాపంగా మారింది. అందుకే 2014 నుంచి ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన కేంద్రం... తెలంగాణకు మాత్రం ఒక్కటీ కేటాయించలేదు. ఇలాంటి విషయాలపై టీఆర్ఎస్ సర్కారు నికరంగా పోరాడుతూనే.. తన పరిధి, పరిమితుల మేరకు పేదోడీకి మెరుగైన వైద్య సేవలందించాలి.