Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణ మార్పులపై గ్లాస్గో ఒప్పందానికి తూట్లు పొడిచే యత్నాలను అమెరికాతో సహా సంపన్న పశ్చిమ దేశాలు భద్రతా మండలి వేదికగా చేపట్టగా, దానిని రష్యా, చైనాతోబాటు భారత్ వ్యతిరేకించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రపంచమంతటా నేడు పర్యావరణ పరిరక్షణ కోసం పెరుగుతున్న ఒత్తిడితో అమెరికా, కెనడా, తదితర సంపన్న దేశాలు కొత్త ఎత్తులు ఎత్తాయి. తమ వంతుగా సాగించిన వినాశనాన్ని కప్పిపుచ్చుతూ, వర్థమాన దేశాలనే నేరస్తులుగా ఇవి చిత్రీకరిస్తున్నాయి. పర్యావరణం పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్నాయి. ఇందుకు తాజాగా భద్రతా మండలిని వేదికగా చేసుకోజూశాయి.
వాతావరణ మార్పులను ప్రపంచ శాంతిభద్రతలతో ముడిపెడుతూ, గ్లాస్గో ఒప్పందం అమలును పరిశీలించే బాధ్యతను భద్రతా మండలికి కట్టబెట్టేందుకు వీలు కల్పించే ముసాయిదా తీర్మానాన్ని ఐరాస భద్రతామండలిలో ఐర్లండ్, నైగర్ ఓటింగ్‌కు పెట్టగా మండలిలోని మొత్తం 15 సభ్యదేశాలకుగాను 12 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. భారత్, రష్యా, చైనా దీనిని వ్యతిరేకించాయి. తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేయగా, రష్యా వీటో చేసింది. చైనా ఓటింగ్‌కు గైర్హాజరైంది. 2020లో జర్మనీ ఈ తీర్మానాన్ని మొదటి సారి ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో దీనిని చైనా, రష్యా తీవ్రంగా ప్రతిఘటించడంతో చర్చల దశలోనే అది ఆగిపోయింది. దీనినే స్వల్ప మార్పులతో ఇప్పుడు నైగర్, ఐర్లండ్ మళ్లీ ముందుకు తెచ్చాయి. మండలిలో వీటో అధికారం కలిగిన అయిదు శాశ్వత సభ్య దేశాల (చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్)లో ఏ ఒక్కరు తీర్మానాన్ని వీటో చేసినా అది చెల్లదు. రష్యా వీటో చేసినందున ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది.
పెట్టుబడిదారుల లాభాల కోసం అభివృద్ధి పేరుతో జీవావరణాన్ని నాశనం చేయడంలో అమెరికా, యూరప్ దేశాలు ముందున్నాయి. కార్బన్ బ్రీఫ్ డాట్ ఆర్గ్ తాజాగా నిర్వహించిన సర్వేలో ప్రపంచ జనాభాలో పది శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా, జపాన్, బ్రిటన్, కెనడాలు ప్రపంచ కాలుష్యంలో 39శాతం వాటా కలిగి ఉన్నాయి. అదే సమయంలో జనాభాలో 42శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చైనా, భారత్, బ్రెజిల్ ప్రపంచ కాలుష్యంలో కేవలం 23శాతం వాటా కలిగి ఉన్నాయి. దీనిని బట్టి తలసరి కాలుష్యం విడుదలలో వర్థమాన దేశాలకన్నా సంపన్న దేశాలే ముందున్నాయన్నది స్పష్టం. ఆ ప్రకారమే కర్బన ఉద్గారాల తగ్గింపులో సంపన్న దేశాలు ముందు బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇష్టపడని అమెరికా, యూరప్ దేశాలు వర్థమాన దేశాలనే మొదట తగ్గించుకోమని ఒత్తిడి తెస్తున్నాయి. భూగోళ ఉష్ణోగ్రతలను 2050 నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలన్న పారిస్ ఒప్పంద స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. తద్వారా తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి భద్రతా మండలి పరిధిలోకి దీనిని తీసుకురావాలని యత్నిస్తున్నాయి. అలా చేయడమంటే వర్థమాన దేశాల పిలకను అమెరికా చేతికి ఇచ్చినట్టే అవుతుంది.
ఐరాసలో అత్యంత శక్తివంతమైన భద్రతా మండలి ప్రధాన బాధ్యత అంతర్జాతీయ శాంతిని పరిరక్షించడం. ఆ బాధ్యతను అది సరిగా నిర్వర్తించకుండా పశ్చిమ దేశాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. రేపు వాతావరణ మార్పుల అంశంపైనా అలా జరగదన్న గ్యారంటీ ఏమిటి? వాతావరణ మార్పులను రాజకీయం చేయడం ద్వారా అభివృద్ధిచెందిన దేశాలు వర్థమాన దేశాలపై స్వారీ చేసే ప్రమాదముంది. కర్బన ఉద్గారాల తగ్గింపునకు అభివృద్ధి చెందిన దేశాలు గతంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించాయి. శిలాజ ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై ఆంక్షలు విధించడం ద్వారా ఆ దేశాల అభివృద్ధిని అడ్డుకునే యత్నం చేస్తున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఆయా దేశాలు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతున్నదీ ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని ఐరాస ప్రధాన కార్యదర్శిని ఈ తీర్మానం కోరుతున్నది. ఆ విధంగా హామీలను నెరవేర్చడంలో వెనుకబడిన దేశాలను శిక్షించే అధికారాన్ని ధనిక దేశాలు తమకు తాముగా దఖలు పరచుకోవాలని చూస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం.
వాతావరణ మార్పుల నియంత్రణకోసం ఐరాస ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యు.ఎన్ ఫ్రేమ్వర్కు క్లయిమేట్ ఛేంజి కన్వెన్షన్ (యుఎన్ఎఫ్సిసిసి) ఆ బాధ్యత చూసుకుంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలు, తీర్మానాల ద్వారా రాజకీయాలకు అతీతంగా వ్యవహరిం చేందుకు అదే సరైన వేదిక. దానిని పక్కన పెట్టి భద్రతా మండలిని తెరపైకి తీసుకురావడం ఎంతమాత్రం అనుమతించరానిది. ఈ విషయంలో భారత్, చైనా, రష్యా ఇదే ఐక్యతతో ముందుకు సాగాలి. వర్థమాన దేశాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవి నికరంగా నిలబడాలి.