Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జరిగిన దారుణానికి కారణాలేమిటో ''సిట్'' నిర్ధారించింది. కుట్రలో నేరస్థులెవరో కూడా తేల్చి చెప్పింది. ప్రధాని కాశీయానం చేసి ఎన్నిసార్లు గంగలో మునిగినా ప్రక్షాళన జరిగేట్టులేదు! రైతుల న్యాయపోరాటంపై సాగించిన దురంతాలు ''లఖీంపూర్ ఖేరీ'' ఘటన రూపంలో ప్రభుత్వాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై తాజాగా వెలువడిన ''సిట్'' నివేదిక ప్రభుత్వానికి సవాలుగా మారింది. జరిగిన అమానుషం ఉద్దేశపూర్వకమైనదీ, ప్రణాళికాయుతమైనదీ, కుట్రపూరితమైనదీ అని దర్యాప్తు నిగ్గుతేల్చింది. పార్లమెంటు లోపలా, వెలుపలా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దీంతో సభలో ప్రతిపక్షాలకూ, వెలుపల పౌర సమాజానికీ సమాధానం చెప్పలేక ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తమకు అలవాటయిన వాయిదాల పర్వాన్నే ఉభయ సభల్లో కొనసాగిస్తూ దాటవేతకు పూనుకుంటున్నారు.
నిరసన తెలుపుతున్న రైతులను నిర్దాక్షిణ్యంగా కార్లతో తొక్కించిన ఈ ఘాతకం ఎనిమిదిమంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటినుంచీ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని బుకాయించే ప్రయత్నమే చేసింది పాలకపక్షం. సాక్షాత్తూ కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి అజరుమిశ్రా తనయుడు అశిష్మిశ్రా నేతృత్వంలోనే ఈ అమానుషం జరిగిందని రైతులు మొత్తుకున్నా లక్ష్యపెట్టలేదు. మొదట వాహనంలో తన తనయుడు లేనేలేడనీ, ఆ సమయంలో తన పక్కనే ఉన్నాడనీ సెలవిచ్చిన మంత్రిగారు, దానికి వంతపాడిన ప్రభుత్వ పెద్దలు... విడియో ఫుటేజీల్లో ఆధారాలతో సహా దొరికిపోవడంతో మాటమార్చారు. దానిని యాధృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్‌గా చిత్రించజూసారు. ఈ విషయంలో యూపీ పోలీసులూ యథావిథిగా తమ ప్రభుభక్తినే చాటుకున్నారు. చివరికి సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అక్షింతలు వేస్తే తప్ప స్పందించని ఖాకీలు, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కింద నేరం మోపి, అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో యూపీ సర్కార్‌కు ''సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)''ను ఏర్పాటు చేయక తప్పలేదు. అయితే ఇందులో కూడా సుప్రీం కోర్టు కలగజేసుకుని మార్పులు చేయాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప అడుగు ముందుకు సాగని ఈ ప్రహసనమంతా ఏలినవారి వైఖరేమిటో చెప్పకనే చెప్పింది.
నిజానికి ఈ ఘటన కాకతాళీయంగానో, నిర్లక్ష్యం వల్లనో జరిగింది కాదని బాధితులైన రైతులెప్పుడో చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వమే నియమించిన ''సిట్'' కూడా దీనిని ధృవీకరించడంతో ''కన్నంలో దొరికిన దొంగల్లా'' మారింది సర్కారు పరిస్థితి. ఉద్యమిస్తున్న రైతులను హత్య చేయడానికి పక్కా ప్రణాళికతోనే కుట్ర చేశారనీ, ఆ కుట్ర ఫలితమే లఖీంపూర్ ఖేరీ దారుణమని సిట్ నివేదిక స్పష్టం చేసింది. దీనికి తోడు హత్యాయత్నం, లైసెన్స్‌లేని ఆయుధాలు కలిగి ఉండటం వంటి సరికొత్త అభియోగాలు మోపడంతో ఏలినవారు ఆందోళనతో పాటు అసహనానికీ గురవుతున్నారు. ఈ విషయమై ప్రశ్నించిన పాత్రికేయుడిపై మంత్రి అజరుమిశ్రా దాడికి దిగజారడం ఇందుకో ఉదాహరణ. జరిగిన ఘటన నిర్లక్ష్యపూరితం కాదు, కుట్రపూరితం అని తేలిన తరువాత కూడా ఆయనను మంత్రివర్గంలో కొనసాగించడం మోడీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లిన (అ)నైతికత!
ఘటనకు ముందు సదరు మంత్రిగారితో పాటు పాలకపక్ష నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆ కొనసాగింపులో ఘటన జరిగిన తీరు, ఇప్పుడు దర్యాప్తులో తేలిన నిజానిజాలు చూస్తుంటే... ప్రశ్నించే గొంతుకలనూ, ప్రజా ఉద్యమాలను అణచివేసే నిరంకుశ పోకడలే ఈ ప్రభుత్వ విధానంగా స్పష్టమవుతున్నది. శాంతియుతంగా సాగుతున్న నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా తొక్కిచంపిన ఈ దారుణం పక్కా పథకం ప్రకారం జరిగిన చర్యగా రుజువు కావడంతో, ఈ పథకం వెనుక ఎవరెవరున్నారు? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా అజరుమిశ్రాను మంత్రివర్గంలోంచి తొలగించకపోవడం, కనీసం పార్లమెంటులో చర్చకు అనుమతించకపోవడం ప్రభుత్వాన్ని బోనులో నిలబెడుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఎకోన్ముఖంగా చర్చకు తీర్మానాలు ప్రతిపాదించినా, సభాపతులిద్దరూ ఏకపక్షంగా తిరస్కరించగా, మిశ్రాపై చర్యలకు అవకాశమేలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని మాత్రం ఇవేమీ పట్టకుండా, పదమూడు రోజులుగా పార్లమెంటుకు రాకుండా కాశీయాత్రలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పాలకపక్షాన్ని వేలెత్తి చూపడమే కాదు, వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్దినీ, అన్నదాతలను క్షమాపణ కోరడంలో ప్రధాని నిజాయితీని కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి.