Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్కారు బడుల్లో ఉచితవిద్యతో పాటు మధ్యాహ్న భోజనం పథకం కింద పట్టెడు మెతుకులు తినొచ్చని బడి బాట పట్టిన పేద పిల్లల ఆశలపై ఆకలి కష్టాలు ముసురుకున్నాయి. మరోవైపు కడుపునింపే వారి డొక్కెండుతోంది... తాము పస్తులుండి బడి పిల్లలకు ఆకలి ముద్దలైన వారు నేడు అప్పుల ముద్దవుతున్నారు. అప్పులు చేసి అన్నం పెడుతున్న తమను ప్రభుత్వం డబ్బులు చెల్లించకుండా తిప్పలు పెడుతోందంటూ మహిళా కార్మికులు సమ్మె బాట పట్టడంతో మధ్యాహ్న భోజనం ఆగిపోయి లక్షల మంది పేద విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఒకవైపు సకాలంలో బిల్లులు, వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఇంకోవైపు అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు సరేసరి. అయినా, మధ్యాహ్న భోజన పథకాన్ని వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ పథకం అమలులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయి. కార్మికులు పుస్తెలతాడు తాకట్టుపెట్టి బడి పిల్లలకు బువ్వ పెడుతున్నా సర్కారు కనీసం వారి సమస్యలను వినే స్థితిలో లేదు.
మిలీనియమ్ డెవలప్మెంట్ గోల్స్‌లో భాగంగా 2008 నుండి ప్రారంభమైన ఇలాంటి పథకాలు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్నాయి. డ్రాప్ అవుట్స్ తగ్గించి, పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేన్నాయి. రాష్ట్రంలో 26,040 ప్రభుత్వబడులలో 21.50లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. ప్రారంభంలో ఈ ఖర్చులో 75శాతం కేంద్ర ప్రభుత్వ వాటా కాగా,రాష్ట్ర ప్రభుత్వం వాటా 25శాతం. కాగా పథకానికి ''ప్రధానమంత్రి పోషణ్'' అని పేరు మార్చిన కేంద్రం తన వాటా మాత్రం క్రమంగా 60శాతానికి తగ్గిస్తూ, రాష్ట్ర వాటాను 40శాతానికి పెంచి భారం మోపుతోంది. 1-5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ.4.97 ఇస్తారు. 6-10 తరగతుల విద్యార్థులకు రూ.7.45 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవి ఉప్పు, పప్పు, కూరగాయలకే సరిపోవడం లేదు. బియ్యాన్ని మాత్రం పౌరసరఫరాల శాఖ నుంచి సరఫరా చేస్తే సరిపోతుందా? మరి గ్యాస్ ఎవరు ఇస్తారు? ఇవే కాకుండా.. విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్లు అందించాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం రూ.12 కేటాయించామని ఘనంగా చెబుతోంది. వాస్తవానికి రూ.12లకు మూడు గుడ్లు వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఆ ధరలకు భోజనం వండి పెట్టడంతో కార్మికులు నష్టాలు మూటగట్టుకోవాల్సి పరిస్థితులు దాపురించాయి. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర కాలం పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది పిల్లలు అర్ధాకలితో అలమటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బడులు తెరుచుకున్నా.. ఇప్పటిదాకా ఆ బిల్లులు ఏజెన్సీలకు అందలేదు. ఇవి రూ.లక్షలకు చేరి, భారంగా మారడంతో తమ వల్ల కాదంటూ ఏజెన్సీలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. పదేండ్లుగా ఒక్క రూపాయి వారి వేతనం పెరగలేదు. కనీసం వారిని కార్మికులుగానైనా గుర్తించడంలేదు. ఎన్నేళ్లు ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో వారు సమ్మె బాట పట్టారు.
మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోకపోవడంతో ఆ నిధులు కూడా మురిగిపోయి వెనుకకు పోతున్నాయి. పాఠశాలల్లోనే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయని రాష్ట్ర సర్కారు డిగ్రీ విద్యార్ధులకు అమలుచేస్తామని ఆగమేఘాల మీద కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు. మాటలతోనే నాలుగేండ్లు వెళ్ళబుచ్చారు. కొన్ని పాఠశాలల్లో పిల్లల అన్నం ఇండ్ల వద్ద నుంచే తెచ్చుకుంటున్నారు. ఏదీ వీలుకాని కొందరు ఆకలితో నకనకలాడుతున్నారు. ఏ లక్ష్యాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చిందో ఆ లక్ష్యానికే తూట్లు పొడిచే పనికి మోడీ సర్కారు పూనుకుంటోంది. దీనిని కూడా ప్రయివేటీకరించే పనిలో శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే అక్షయపాత్ర ఫౌండేషన్ భాగస్వామ్య పెత్తనంతో పథకం మౌలిక లక్ష్యమైన బడి పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడంతో పాటు అనేక అనర్ధాలు చోటుచేసుకున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన ఆహార హక్కు నొక్కేయబడటమే కాక మరేమిటీ? అందుకే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వారి ఉపాధి రక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన సమయం. ఇది కేవలం వారి సమస్యే కాదు. బాలల హక్కుల సమస్య, భావి భారత పౌరుల పౌష్టికాహార సమస్య. ఇందులో కులవివక్ష, అగ్రకుల ఆధిపత్యం చలామణీ అన్ని అనంతర్లీనంగా దాగి ఉన్నాయి. ఇది రాజ్యాంగ లక్ష్యమైన సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధం. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలి. కార్మికులుగా వారిని గుర్తించాలని కోరుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. లేకుంటే దశల వారిగా ఉద్యమిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పథకం అమలులో కేంద్రం వాటా తగ్గడాన్ని రాష్ట్రాలు గొంతేతాలి. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు సైతం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాడి పథకాన్ని అమలు చేయాలి.