Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారు సార్లూ 'ప్చ్' అంటున్నారు. తెలంగాణలోని జనమూ 'ప్చ్' అంటున్నారు. ప్రజలూ, పాలకులు అందరి నోళ్ళలో 'ప్చ్'! మనసుల్లో 'ప్చ్'! ఇది కాకతాళీయమే అయినా నిజం. అయితే కారణాలు విభిన్నమైనవే కాదు, విచిత్రమైనవి కూడ! రహదారి గుంటలు, మిట్టలతో ఉంటే 'అధికార' షికార్లు కొట్టాలనుకునే కార్లకి, కారు సార్లకి 'ప్చ్'లు హఠాత్తుగా ప్రాప్తించాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని మరిచిపోయో, పక్కకునెట్టో, పాతరేసో మరో ఇరవైయేండ్లు అధికార పీఠంలో పర్మినెంట్ అయిపోయినట్లు స్వప్నిస్తూ, జరిగే ప్రతి అలికిడీ తన నిద్రాభంగానికేనని భ్రమిస్తూ, ధర్నాచౌక్‌తో సహా అన్నింటినీ రద్దుచేస్తూ, అణిచివేస్తూ సాగే పాలనకు 'ప్చ్'లు ముసురుకొంటున్నాయి.
జీఎస్టీకి ఎదురేగి స్వాగతించారు గులాబీనేతలు. అలాంటిది సడన్‌గా లేచి ''ఏకంగా ఏడుశాతం పెంచి పన్నెండు శాతం చేస్తే మా చేనేత బతికి బట్టకట్టేదెలా?'' అని కేటీఆర్ ప్రశ్నించడం ఆశ్చర్యమేమరి! హౌటల్లో టిఫిన్ తిన్నవాడికి ఐ.జి.ఎస్.టి, ఎస్జీఎస్టీలు కలిపి బిల్లు తడిసి మోపెడవుతూంటే ఏ ఆలోచనతో అది రాష్ట్రానికి మేలు చేస్తుందనుకున్నారు? ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సహా ఆటోమొబైల్రంగం, వినిమయ సరుకుల ఉత్పత్తి దారులు, ఫార్మాకంపెనీలు మొదలైన దేశ, విదేశ కంపెనీలన్నీ తమకు జీఎస్టీ తగ్గించమంటున్నాయి. ఇవన్నీ ఆమోదిస్తే నెలకి లక్ష కోట్ల జీఎస్టీ పద్దు ఎక్కడ్నించి వస్తుంది. ఈ ఆదాయం రాకపోతే పరిస్థితి ఏమిటి? ఈ విషవలయానికి అంతమెక్కడుంది? విదేశీ సరుకులకు దేశమంతా ఒకటే పన్ను ఉండేలా చూస్తామని, రాష్ట్రాలు వాటిపై అమ్మకం పన్ను విధించకుండా చేస్తామని మోడీ మహాశయుడు బహుళజాతి కంపెనీల చేతిలో చెయ్యేసి చెప్పిన ఫలితమే జీఎస్టీ. ఒకసారి అవునని, ఇంకోసారి కాదనడానికి అది ఎన్నికల వాగ్దానం కాదు. ఎమ్.ఎన్.సి.లతో యవ్వారం! తూచ్ అనడానికి చాన్సెక్కడుంది? రాష్ట్రాల వనరులపై జీఎస్టీ ఒక దాడి. అమ్మకం పన్నును లాగేసుకోవడం ద్వారా రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బతీస్తుందని ఆనాడు కేరళ ఎల్.డీ.ఎఫ్. ప్రభుత్వం, ముఖ్యంగా దాని ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజక్ నెత్తీనోరు కొట్టుకున్నా మన రాష్ట్రం స్పందించలేదు. అదే జరిగుంటే కేంద్ర సర్కార్ విధానాల్ని ప్రతిఘటించే శక్తులు బలపడేవి కదా!
''బలమైన కేంద్రం, మున్సిపాలిటీల్లాంటి రాష్ట్రాలు'' - ఇదీ అరెస్సెస్ పథకం. సామ్రాజ్యవాదుల గేమ్‌ప్లాన్‌లో ఇది సరిగ్గా ఇముడుతుంది. కేంద్రం చేతిలో ఆర్థిక వనరులన్నీ కేంద్రీకరించడానికి జీఎస్టీ ఒక శాంపుల్ మాత్రమే. ఆ రకంగా రాష్ట్రాల వనరులను కొల్లగొట్టడం జీఎస్టీతో ప్రారంభమై నేడు రాజ్యాంగమిచ్చిన ''ఉమ్మడి జాబితా''లోని విద్యుత్‌ను, విద్యను, రాష్ట్ర జాబితాలోని వ్యవసాయాన్ని సంపూర్ణంగా హస్తగతం చేసుకుంది బీజేపీ ప్రభుత్వం. దాని పర్యవసానమే వ్యవసాయ చట్టాలు. వాటికి వ్యతిరేకంగానే గత సంవత్సరంపైగా ప్రధానంగా ఉత్తర భారతదేశ రైతాంగం పోరాడింది. ఫుడ్ కార్పొరేషన్‌ను నీరు గార్చే ఆ విధానమే కదా నేడు మన రాష్ట్ర రైతాంగం పాలిట శాపమైంది!? ఇవన్నీ రాష్ట్ర నేతల దృష్టిలో ఉన్నాయా?
రేవంత్‌రెడ్డి మొన్న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చెప్పిన జవాబే కదా నేడు అధికారయుతంగా ''తెలంగాణకు బీజేపీ ఏమియ్యలే''దని గులాబీ బాస్ పత్రికల్లో సమాచారం కుమ్మరించేందుకు ఉపయోగపడింది. ''2016-17 నుండి ఇప్పటి వరకు కేంద్రం రూ.2600కోట్లు అప్పులిచ్చింది తప్ప, ఒక్కపైసా గ్రాంటు కూడా ఇవ్వలేద''ని 2021లో మాట్లాడేవారు 2016-17 నుండి ఎందుకు చప్పుడు చేయలేదు? సంవత్సరాల వారీ అణాపైసలతో సహా నేడు లెక్కలు ప్రచురించేవారు ఇప్పటిదాక మాట్లాడలేదెందుకు? మోడీ ఎంత నిరంకుశంగా ఉంటారో ఈ ఏడేండ్లలో టీఆర్ఎస్ ఎంపీ లెవరూ అధినేతకు చెప్పలేదా? ''మా రాష్ట్ర మంత్రుల''ను కూడ అవమానం చేస్తారా? అని ఇప్పుడు గగ్గోలుపెడితే ఉపయోగం ఏంటి?
కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలన్నింటినీ పేరు పేరునా ప్రయివేటు వారికి కట్టబెడ్తూంటే మాట్లాడకుండా మన సింగరేణి బ్లాకులను ప్రయివేటువారికిస్త్తూంటే ఆగమంటే ఆగుతుందా? కేసీఆర్ లెటర్‌కే భయపడిపోయే వ్యక్తా మోడీ! ఒక వేళ ఇటు భారత పాలకులు వెనక్కి తగ్గినా అటు బహుళజాతి కంపెనీలు ఆగవు. అవసరమైతే పాలకుల్ని మార్చుకుని ముందుకు పోతాయి. అలా మారిన ''కారణజన్ముడే'' మోడీ.
స్వరాష్ట్రం వస్తే ఉద్యోగాల జాతర జరుగుతుందనుకున్న రాష్ట్ర యువతకు కొత్త కొలువులు రాక, ఉన్నవి ఊడి ఉరితాళ్ళకు వేలాడుతున్నారు. ఉపాధి దొరికిన చిరుద్యోగులకు జీతాలు సరిగా రాక, వచ్చినవి బతుకు బండిలాగేందుకు చాలక అందరూ 'ప్చ్' అంటున్నారు. రైతు ఆత్మహత్యలు అనంతంగా సాగుతూనే ఉన్నాయి. కనీస వేతనాల కోసం కార్మికులు, మద్దతు ధర కోసం రైతులు, ఉద్యోగాల కోసం యువత ''త్రాచుల వలెనూ.. రేచులవలెనూ'' పైకి లేచే కాలం ఎంతో దూరంలో లేదు.