Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొద్దిపాటి నిర్లక్ష్యం కొండంత సమస్యకు దారితీసినట్టు... ప్రభుత్వ విధానపరమైన లోపాలు విద్యార్థులకు శాపాలుగా మారాయి. వాటి ఫలితంగా రాష్ట్రంలోని ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. అధ్యయనం, అధ్యాపనం, అభ్యసనం అనే మూడు ప్రక్రియలు విద్యారంగంలో కీలక సూత్రాలు. వీటిని పక్కనబెట్టిన పాలకుల నిర్లక్ష్యం, నిర్లిప్తత, బాధ్యతా రాహిత్యం... వెరసి ఇంతటి తీవ్రమైన సమస్యకు దారితీసింది. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలను నెలల తరబడి మూసేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో గతేడాదిలో ఎక్కువ భాగం ఆన్లైన్లోనే పాఠాలు నడిచాయి. అవి ఎంతమంది విద్యార్థులకు అర్థమయ్యాయో.. లేదో తెలియని గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సర్కారు వారు తీసుకున్న ఒక నిర్ణయం మరింత గందరగోళానికి, అంతకు మించిన అయోమయానికి దారి తీసింది. గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి ప్రమోటయ్యి... ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రకటించటమే దీనికి కారణం. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు, మేధావులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం మొండిగా పరీక్షలను నిర్వహించింది. ఫలితాలు విడుదలైన తర్వాత ఎదురైన పరిస్థితులు, అనుభవాలు మనకు తెలిసినవే. అవి విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలను కండ్లకు కడుతున్నాయి.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయటమనేది ఒక బృహత్తర ప్రక్రియ. ఇది ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు విద్యాశాఖ, ప్రభుత్వానికి సంబంధించిన ఒక కీలక బాధ్యత. పిల్లలకు పాఠాలు బోధించటమనేది గురువుల పని అయితే... ఆ బోధనకు కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించటమనేది సర్కారు విధి. పాఠశాల, కళాశాల భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ, అన్ని సబ్జెక్టులకు చాలినంత మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమించటం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలను అందుబాటులో ఉంచటమనేవి వీటిలో ప్రధానం. ఇది పూర్తయిన తర్వాత బోధన సరిగ్గా సాగుతుందా..? లేదా..? విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాలు పెరుగతున్నాయా..? లేదా..? అనే అంశాలను సంబంధిత ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. ఈ అంకం పూర్తయిన తర్వాత అత్యంత ప్రధానమైంది విద్యార్థులను పరీక్షలకు మానసికంగా సిద్ధం చేయటం, వారు వాటిని రాసేందుకు వీలుగా అన్ని సౌకర్యాలనూ కల్పించటం. ఇంటర్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ప్రభుత్వం ఈ రెండింటిలోనూ ఫెయిలైంది. పోయినేడాది మొదటి సంవత్సరం చదివిన వారికి.. ఈ యేడాది పరీక్షలు నిర్వహించాల కున్నప్పుడు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులతో చర్చించి, నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. దాంతోపాటు 80శాతం సిలబస్‌కే పరీక్షలు నిర్వహించిన దరిమిలా... మూల్యాంకనంలో కూడా అందుకు తగ్గట్టే సర్దుబాటు చేయాల్సింది. కానీ ఇవేవీ చేయని సర్కారు... ఇష్టానురీతిన వ్యవహరించటం ద్వారా వాటన్నింటినీ ఒక తంతుగా ముగించి తీవ్రమైన తప్పిదానికి పాల్పడింది. 2020లో కరోనా వల్ల ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఎలాంటి పరీక్షలు రాయకుండానే పాసై పోయారు. కానీ ఆ ఏడాదిలో అంతో ఇంతో పాఠాలు వినీ, అవి అర్థమైనా, కాకపోయినా ఇప్పుడు ఎంతో కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులను పాస్, ఫెయిల్ అనే పద్ధతిలో ఇంటర్ బోర్డు శిక్షించటం బాధాకరం. ఎంతో కొంత గ్రేస్ మార్కులను కలిపి వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించాల్సిన సమయం, సందర్భమిది. మరోవైపు విద్యార్థులు నైరాశ్యానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం, విద్యాశాఖ, సంబంధిత ఉన్నతాధికారులు... అందుకు భిన్నంగా ఇప్పటి వరకూ స్పందించకపోవటం అత్యంత శోచనీయం. గత కొన్నేండ్లుగా ఇంటర్ విద్యలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, లొసుగులు, మూల్యాంకనంలో ఘోరమైన పొరపాట్లు జరగటం తెలంగాణలో ఆనవాయితీగా మారింది. ఇలాంటి తప్పిదాల వారసత్వాన్ని చెత్తబుట్టలో వేసే విధంగా ఇంటర్ బోర్డును తక్షణం ప్రక్షాళన చేయాలి. తద్వారా ఇక మీదట మార్కులు, ర్యాంకులు, పాస్, ఫెయిల్ అనే కారణాలతో ఏ ఒక్క విద్యార్థీ ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందుకోసం టన్నుల కొద్ది చిత్తశుద్ధిని సర్కారు వారు ప్రదర్శించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇంటర్ సమస్య అనేది కేవలం పిల్లలదే అని చూడకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రుల సంఘాలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యారంగ నిపుణులు కూడా ఉద్యమించాలి.