Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021, డిసెంబరు19 చిలీకి ఓ చారిత్రాత్మక రోజు. వామపక్షవాది గాబ్రియేలా బోరిక్ చిలీ అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించిన రోజు. ప్రపంచంలో ఎన్నికల ద్వారా సాల్వెడార్ అలెండీ నేతృత్వంలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అమెరికా సామ్రాజ్యవాదుల మద్దతుతో జనరల్ పినోచెట్ సైనిక కుట్ర ద్వారా కూల్చివేసిన యాభై ఏండ్లకు మళ్లీ ఒక వామపక్షవాది అధికారంలోకి రావడం ఒక మంచి పరిణామం. లాటిన్ అమెరికాలో పలు దేశాల్లో ప్రజానుకూల ప్రభుత్వాలను అస్థిరపరచడమో, సైనిక జోక్యం ద్వారా కబళించడమో చేసిన అమెరికా సామ్రాజ్యవాదులకు ఇదొక గట్టి ఎదురుదెబ్బ.
వెనిజులా, బొలీవియా, నికరాగ్వా, హౌండూరస్లలో అమెరికా తొత్తు ప్రభుత్వాలను ఓడించిన వామపక్ష శక్తులు ఇప్పుడు చిలీలో మరో తిరుగులేని విజయం సాధించాయి. పినోచెట్ వారసుడైన మితవాది జోస్ ఆంటోనియాను బోరిక్ మట్టి కరిపించాడు. నిన్నటి వరకు విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్ష పదవిని అధిష్టించనున్నారు. పిన్న వయసులోనే అధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించాడు. అలెండీ స్ఫూర్తిని లాటిన్ అమెరికాలో మళ్లీ రగిలించాడు. ఆదివారంనాటి అధ్యక్ష ఎన్నికల తుది పోరులో చిలీ కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న వామపక్ష కూటమి తరపున పోటీచేసిన బోరిక్‌కు 56శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి పినోచెట్ వారసుడు అంటోనియాకు 44శాతం ఓట్లు వచ్చాయి. నవంబరులో జరిగిన తొలి రౌండు ఎన్నికల్లో ప్రధాన స్రవంతికి చెందిన చాలా పార్టీలను చిలీ ప్రజలు తిరస్కరించారు. దీంతో బోరిక్, ఆంటోనియా మధ్య జరిగిన ఫైనల్ పోరులో బోరిక్ తన ప్రత్యర్థిని చిత్తుగా ఓడించారు. పినోచెట్ 18ఏండ్ల నిరంకుశ పాలన, ఆ తరువాత ఆయన వారసుల పాలనలో చిలీ ప్రజలు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. సహజవనరులకు కొదవ లేని చిలీలో ఒక వైపు పేదరికం, మరో వైపు సంపద పెద్దయెత్తున పోగుపడింది. ఒక శాతం మంది చేతిలో దేశ సంపదలో 25శాతం కేంద్రీకరించబడింది. పినోచెట్ అనుసరించిన పెట్టుబడిదారీ అనుకూల విధానాలే అసమానతలు ఇంతగా పెరిగిపోవడానికి కారణమయ్యాయి. 2008లో ఆర్థిక సంక్షోభం, ఆ తరువాత వచ్చిన కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లో అసంతృప్తికి ఆజ్యం పోశాయి. పినోచెట్, ఆయన వారసులు అనుసరించిన నయా ఉదారవాద విధానాలు కార్మికులపైన, సామాన్యులపైన విపరీత భారాలను మోపాయి. కనివిని ఎరుగని రీతిలో నిరుద్యోగిత రేటు 55శాతానికి చేరింది. పింఛన్లు, విద్య, ఆరోగ్య భద్రతకు ఎలాంటి గ్యారెంటీ లేదు. ప్రజల జీవనం దుర్భరంగా మారిన స్థితిలో మితవాద పినేరా ప్రభుత్వం మెట్రో ఛార్జీలను పదిశాతం పెంచడంతో ప్రజల్లో అసంతృప్తి భగ్గుమంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆ విధంగా ప్రారంభమైన నిరసనలు నయా ఉదారవాద విధానాలకు రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేసేదాకా వెళ్లాయి. చివరికి పినేరా ప్రభుత్వం దిగొచ్చి రాజ్యాంగ పరిషత్‌కు గత మే నెలలో ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్నికల్లో వామపక్ష, నయా ఉదారవాద వ్యతిరేక శక్తులు ఘన విజయం సాధించాయి. రాజ్యాంగ పరిషత్‌పై పట్టు సాధించిన వామపక్ష శక్తులు ఇప్పుడీ విజయంతో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాయి.
విజయం సాధించిన అనంతరం బోరిక్ చేసిన తొలి ప్రకటనలో పినోచెట్ ప్రవేశపెట్టిన పెట్టుబడిదారీ అనుకూల విధానాలను భూస్థాపితం చేసి, సామాజిక సంక్షేమ రాజ్యం స్థాపిస్తానని ప్రతినబూనారు. కార్మికులకు, సామాన్యులకు పెన్షన్, ఆరోగ్య భద్రత పెంపు, పని గంటల తగ్గింపు, పౌర హక్కుల పరిరక్షణ, పర్యావరణ అనుకూల పెట్టుబడులకు పెద్ద పీట వేస్తానని హామీ ఇచ్చారు. మూలవాసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, మహిళలకు సమాన పనికి సమాన వేతనం వంటివి తీసుకొస్తానని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలో అధికారం చేపట్టనుంది. కొత్త రాజ్యాంగ రచన ఒక కొలిక్కి రావడానికి మరో అయిదు మాసాలు పడుతుంది. చిలీ ప్రజల మెరుగైన భవిష్యత్తుకు, హుందాతో కూడిన జీవనానికి బోరిక్ ప్రభుత్వం భరోసా ఇస్తుందని, తద్వారా లాటిన్ అమెరికా దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిద్దాం.