Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆవు తల్లిలాంటిది'' అంటున్నారు ప్రధాని. అంతేకాదు, గోమాత గురించి మాట్లాడటమే నేరమైపోయిందని కూడా వాపోయారు! ఆయనకు ఆవులమీద ఉన్న అపారమైన ప్రేమకు ఆనందించాలో, అందులో ఆవగింజంతైనా ఆడపిల్లల మీద లేనందుకు విచారించాలో అర్థంకాని పరిస్థితి దేశ ప్రజలది. ఎందుకంటే, ప్రధాని ఏ ఉత్తరప్రదేశ్ వేదికగా ఈ వ్యాఖ్య చేసారో, ఆ ఉత్తరప్రదేశ్‌లోనే గంటకో ఆడపిల్ల జీవితం గంగపాలవుతోంది. ఆ మాటకొస్తే ఆడపిల్లలపై అకృత్యాలను నిరోధించడంలోనే కాదు, సమస్త అభివృద్ధి సూచికల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలది అట్టడుగు స్థానమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు పెల్లుబుకడం సహజం. అందుకే యూపీలో గెలుపు అంత సులువుకాదని పాలకపక్షానికి బెంగపట్టు కున్నట్టుంది. ఈ అసంతృప్తిని దారి మళ్లించేందుకు తిరిగి భావోద్వేగాలను రగిలిస్తున్నారు. ప్రజల నమ్మకాలను సొమ్ము చేసుకునే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పార్లమెంటు జరుగుతున్నా పట్టించుకోకుండా, గత పక్షం రోజులుగా ప్రధాని సాగిస్తున్న రాజకీయ కాశీయాత్రలు, గంగాస్నానాలు, విద్వేష వ్యాఖ్యలు, ఇప్పుడీ ఆవు ప్రేమలూ చూస్తోంటే ఆలోచనాపరులెవరికైనా ఈ అభిప్రాయాలు రాకమానవు.
అభివృద్ధి సంగతి అటుంచితే, అంతకంతకూ యూపీలో పెచ్చరిల్లుతున్న అసాంఘిక, అరాచక ఘటనలకు తోడు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతాంగం పట్ల ప్రభుత్వాలు అనుసరించిన తీరుకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేకించి లఖీంపూర్ ఖేరీ ఘటన వారికి మరింత ఆవేశం కలిగించింది. పైగా ఇది పథకం ప్రకారం సాగించిన కుట్రగా ''సిట్'' నిగ్గుతేల్చింది. అయినప్పటికీ అజరుమిశ్రాను మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఒకవైపు నిస్సిగ్గుగా రాజకీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూనే, మరోవైపు రాజ్యంగ విలువలను సైతం ఉపేక్షిస్తూ స్వయంగా ప్రధానే కాశీ కారిడార్‌ను ప్రారంభించడం చూస్తోంటే ఏలినవారి వ్యూహాలేమిటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ఈ సందర్భంగా ''దేశంలో ప్రతి ఔరంగజేబుకూ ఓ శివాజీ పుట్టుకొస్తాడని'' ప్రధాని కాశీలో చేసిన వ్యాఖ్యల సారం కూడా ఇదే. ఔరంగజేబు చనిపోయి నాలుగొందల ఏండ్లు గడిచిపోయాయి. ఇప్పుడాయన గురించి చర్చించడం వల్ల యూపీలోగానీ, దేశంలోగానీ యువతకు ఉద్యోగాలేమైనా పుట్టుకొస్తాయా? ఆర్థిక వ్యవస్థేమైనా సంక్షోభంలోంచి బయట పడుతుందా? లేక దేశమేమైనా అభివృద్థిపథంలో దూసుకుపోతుందా? ఇవేవీ జరుగవని ఏలినవారికి తెలియదనుకుంటే పొరపాటు. కాకపోతే, ఇలాంటి చర్చవల్ల ప్రభుత్వ వైఫల్యాలూ ప్రజల అసంతృప్తులూ మరుగునపడి, భావోద్వేగాలు చెలరేగి, మత సమీకరణలకు పురిగొల్పి భారిగా ఓట్లు తెచ్చిపెడతాయన్నది వారి వ్యూహం.
ఈ నేపథ్యంలో యూపీ అంచుల్లోనే ఉన్న హరిద్వార్‌లో జరిగిన ''ధర్మ సంసద్''లో వక్తల రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా యాధృచ్ఛికమని అనుకోలేం. ఈ నెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు సాగిన ఈ సభ ఏకంగా ''హిందువులందరూ ఆయుధాలు చేపట్టి ముస్లింలపై యుద్ధానికి సిద్ధం కావాలి'' అని పిలుపునిచ్చింది. సభకు నేతృత్వం వహించిన యతి నరసింహానంద మాట్లాడుతూ... ''మనం ఉపేక్షిస్తే 2029నాటికి ఈ దేశానికి ఓ ముస్లింను ప్రధానిగా చూడాల్సి వస్తుంది. హిందూ జనాభా తగ్గి, ముస్లింల సంఖ్య పెరిగి రోడ్లమీద ముస్లింలు మాత్రమే కనిపించే పరిస్థితులొస్తాయి'' అని విద్వేషం వెల్లగక్కారు. దీనికి కొనసాగింపుగా ''ప్రతి హిందువూ రూ.లక్ష విలువైన ఆయుధాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాల''ని సాగర్ సింథూరాజ్ మహరాజ్ సెలవిచ్చారు. ఇవన్నీ దేనికి సంకేతాలు? ఏ వ్యూహంలో భాగాలు?!
ఇప్పుడు తాజాగా మన తెలంగాణలోనూ వినిపిస్తున్న ''హైదరాబాద్ వెర్సెస్ భాగ్యనగర్'' వివాదం కూడా ఈ కోవలోనిదే. బీజేపీకే కాదు, ఎంఐఎంకూ కావాల్సిందిదే. ఇది ఎలాంటి సమీకరణలకు దారితీస్తుందో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్వయంగా చూసాం. ప్రజల అవసరాలూ ఆకాంక్షలూ అన్నీ మట్టిగొట్టుకుపోయి బీజేపీ, ఎంఐఎం రెండు హిందూ ముస్లిం శిబిరాలుగా బలపడ్డాయి. కనుక, ఇప్పుడీ వివాదాన్నే నినాదంగా మలిచి తెలంగాణా వ్యాపితం చేస్తే రాష్ట్రంలో అధికారం సొంతమవుతుందనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోనూ గణనీయంగా (12శాతం) ముస్లిం జనాభా ఉందీ, దానికి తోడు నిజాం నిరంకుశ దోపిడీ పాలనా చరిత్ర కూడా ఉంది. కనుక ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని యూపీ తరహా విభజన రాజకీయాలకు బీజేపీ తెరవెనుక పన్నాగాలు పన్నుతోంది. ఎక్కడ చూసినా వీరి రాజకీయాలకు మనుషులు కాకుండా మతాలే ప్రాతిపదిక కావడం ఎంత దారుణం? కేవలం తమ రాజకీయావసరాల కోసం కలిసివున్న మనుషులను విడదీయబూనడం ఎంత అమానవీయం..? ఏ ప్రస్థానానికీ అమానవీయత? వీరి మాటల వెనుక మాయల్ని తెలుసుకోగలిగినప్పుడే దీనిని అడ్డుకోగలం.