Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణదేవరాయల కాలంలో అంగళ్ళలో రతనాలు రాశులుగా పోసి అమ్మారని గొప్పలు చెప్పుకుంటారు కానీ అదేమంత గొప్ప విషయం కాదంటాను. ఆధునిక కాలంలో అక్షరాల కుప్పల్ని పోసి, అధ్యయనశీలురారా! రండి! మీ జ్ఞాన నేత్రాలు మనసారా విప్పారగ పుస్తకమూటల్ని సొంతం చేసుకోండి. జ్ఞాన సమాజ నిర్మాణంలో పాలు పంచుకోండి. అని సంవత్సరపు చివరి మజిలీలో భాగ్యనగరంలో అక్షరాల విందు భోజనాల్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులు.
ఇవేమీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సెల్లుఫోన్లుకాదు. బ్రాండెడ్ దుస్తుల ప్రదర్శనాకాదు. హీరోయినో, హీరోనో తొడిగి సృష్టించిన ట్రెండ్ డిజైనింగ్ డ్రెస్సులూ కావు. దూకుతూ రైడ్ చేయగల బైకో, కారో, స్పోర్ట్స్ మోటరోకాదు. ఇంట్లో ఉంటేనే హౌదా అమాంతం పెరిగిపోయే టీవీనో, ఫర్నిచర్సెట్ల ప్రదర్శనో కాదు. తిరిగి తిరిగి లాభాలు తెచ్చిపెట్టే రియల్ ఎస్టేట్ సమాగమమో, బంగారు ఆభరణాల మెరుపుల కౌంటర్లూ కాదు. కేవలం కాగితంపై పరుచుకున్న అక్షరాల సంపుటుల కోలాహలం! హృదయానికి ఆలోచనను అనుసంధానించే మధ్యవర్తుల మాటల సమూహాలు. వీటి పట్లా మోహము కలవాళ్ళు సమాజంలో ఉండటం మూలానే మనమింకా ఇలా మిగిలున్నాం. పుస్తకాలు కూడా వ్యాపారం కావచ్చు. కానీ కొన్నవాళ్ళు తిరిగి అమ్ముకుని సొమ్ముచేసుకోవడానికైతే కాదు. ఏదో నేను ఇంకా తెలుసుకోవాల్సినది ఉందనే ఎరుకతోనే పుస్తకాల్ని కొంటాము. ఈ ఎరుకే జ్ఞానమనవచ్చు. విజ్ఞానాన్ని పెంచుకోవాలనే తపన సమాజంలో పెరగటాన్ని ఆహ్వానించాలి. సరుకులపై, విలాస వస్తువులపై మోజును రోజు రోజుకూ పెంచి పోషిస్తున్న మార్కెట్ మాయాప్రపంచాన, అక్షరంపై ఆర్తిని రగిలించే ఇలాంటి పుస్తక ప్రదర్శనలకు హృదయపూర్వకంగా స్వాగతం పలకాలి.
పుస్తకం లేని ఇల్లు ఆత్మలేని శరీరం లాంటిదంటారు. అంతేకాదు, రొట్టె శరీరాన్ని పోషిస్తుంది. పుస్తకం మనసును పోషిస్తుందనీ చెబుతారు. పుస్తకం మస్తకాన్ని తీర్చిదిద్దే సాధనం. ఏముంటుంది పుస్తకంలో? సమాజమే ఉంటుంది. ఈ విశ్వరహస్యమూ ఉంటుంది. మనుషులుంటారు. మనస్తత్వాలూ ఉంటాయి. పనులుంటాయి. ఫలితాలుంటాయి. ప్రదేశాలుంటాయి. అద్భుతాల వెనకాల దాగిన నిజాలుంటాయి. అనుభవాలుంటాయి. మొత్తంగా చూడలేని దృశ్యాలన్నీ గుదిగుచ్చి, వినలేని తెలుసుకోలేని అన్నింటినీ పోగేసి సంభాషించడముంటుంది. అందుకే ఒక జీవితం స్వతహాగా కూర్చుకోలేని జ్ఞాన సారమంతా అక్షరమై నిలిచేది పుస్తకంలోనే. మన మానవ జాతి వారసత్వంగా అందిస్తున్న అనుభవాల సంచితమే పుస్తకం. మానవాతీత మైనదేదీ ఉండదు. అన్నీ మానవుని సృజనాత్మకాలే. మనల్ని మనం ఆవిష్కరించు కోవటమే పుస్తకమంటే.
మార్కెట్ల విస్తరణతో సరుకుల వినియోగమే మనిషితనంగా కీర్తించబడుతున్న తరుణంలో, ఉద్యోగం, ఆదాయమే పరమావధిగా చదువులు అమ్మబడుతూ కొనబడుతున్న సందర్భంలో పాఠ్యేతర అంశాల పట్లా చూపులు విస్తరించటం బుక్‌ఫెయిర్ సాధించిన విజయం. మరీ ముఖ్యంగా యువత విరివిగా పాల్గొంటూ పుస్తకాలను కొంటూ సెలెబ్రేట్ చేయటం ఆనందకరమైన అంశం. ఎంత ఆదాయమున్నా, చదువెంత కొనగలిగినా ఏదో మనం మిస్సవుతున్నామన్నలోటుతోనే అక్షరాలవైపుకు మళ్ళుతున్నారు. భోజనం కోసం కిరాణా సరుకుల్ని, కూరగాయలను ఎలా కొనుక్కుంటామో మేథోదాహం తీర్చుకునేందుకు పుస్తకాల్ని కొనుక్కుపోవాలి. అవును ఆవైపుగా దాహం పెరగాలి. రంగుల వెనకాల రహస్యాలను, మెరుపుల మాటున దాగిన వాస్తవాలను తెలుసుకోవాలి. భ్రమల తెరలు తొలగిపోవాలి.
అయితే మనకు లభ్యమయ్యే పుస్తకాలన్నింటిలో జ్ఞానమే, సత్యాలే ఉంటాయని అనుకోరాదు. ఏ పుస్తకాలు చదవాలో ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అందుకోసం కసరత్తుచేయాలి. పుస్తకాలు మనం చదవాల్సిందే.అయితే మన సమాజ వాస్తవికత, పరిస్థితుల సమగ్రత ఏ పుస్తకాల్లో దొరుకుతాయో వెతుక్కోవాలి. కేవలం పుస్తకపూజ పనికిరాదు. ఆచరణశీలమైన అధ్యయనం అలవర్చుకోవాలి.
పిల్లలకు పాఠ్యేతర పుస్తకాలను తల్లిదండ్రులు అందుబాటులోకి తేవాలి. అందుకు ఈ ప్రదర్శన శాలలు ఎంతో ఉపయోగపడతాయి. వందలాది పుస్తక సంస్థలు, రచయితలు, కవులు, పత్రికల నిర్వాహకులు ఈ సందర్భంగా లక్షలాది గ్రంథాలను సుందరంగా అలంకరించి ప్రదర్శించడం పండుగలా దర్శనమిస్తోంది. నిర్వాహకుల కృషి అభినందనీయం. ఒక్క రాజధానిలోనే కాదు. జిల్లా కేంద్రాలలో, గ్రామాలలోనూ ఈ ప్రదర్శనలు కొనసాగాలి. యువత చేతుల్లో సెల్లుకాదు, పుస్తకం అలవాటుగా మారే పరిణామం రావాలి. పుస్తకం హస్తభూషణమై వర్థిల్లాలి. పుస్తక ప్రదర్శన సందర్భంగా కేవలం పుస్తకాలు కొనడమూ అమ్మడమే కాదు, ఎంతోమంది స్నేహితుల సాహితీకారుల కలయికలు, పలకరింపులు, సభలు, సమావేశాలు, కొత్తపుస్తకాల ఆవిష్కరణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, చర్చలు విజ్ఞాన పునర్వికాసానికి నెలవుగా పుస్తక ప్రదర్శన నిలవడం గొప్ప సందర్భం.