Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానించే ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021 భారత పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు నివేదించాలని ప్రతిపక్ష ఎంపీలు ఎంతగా మొత్తుకున్నా పార్లమెంటు ఉభయసభల్లో దాన్ని ప్రభుత్వం అతి నిరంకుశంగా ఆమోదింపజేసుకుంది. ఈ చర్య ద్వారా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల పట్ల తన అసహనాన్ని మరోసారి బయటపెట్టుకుంది. లోక్సభ డిసెంబర్ 20న కేవలం 25నిమిషాల చర్చతోనే ఆమోదించడం దారుణం. అంతకుముందే 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన రాజ్యసభలో డిసెంబర్ 22న మూజువాణీ ఓటుతో ఆ బిల్లును ఏకపక్షంగా ఆమోదింపజేశారు. ఈ బిల్లు వల్ల ఓటరు కార్డు ఆధార్ కార్డు అనుసంధానతతో పాటు ఓటు నమోదుకు ఏడాదిలో ఒక తేదీ కటాఫ్ బదులు నాలుగు తేదీలలో అవకాశం ఇవ్వడం, సర్వీస్ ఓటర్లు భార్యాభర్తలిద్దరూ ఓటెయ్యొచ్చుననడం తప్ప విశాల ప్రజానీకానికి ఒరిగేదేమీ లేదు.
అయితే ఆధార్ అనుసంధానాన్ని చట్టబద్ధం చేయడంతో గోప్యంగా ఉన్న ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఇక బహిరంగమవుతుంది. వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచుకోవడం ప్రాథమిక హక్కు అని పుట్టుస్వామి కేసులో సుప్రీం కోర్టు 2015 ఆగస్టులో తీర్పు చెప్పింది. ఏ పౌరుని వ్యక్తిగత డేటానైనా తెలుసుకోవాలంటే అందుకు చట్టపరమైన ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా సుప్రీం చెప్పింది. కనుక ఈ బిల్లు రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇంత హడావుడిగా నిరంకుశంగా ఈ బిల్లును ఆమోదింపజేసిన మోడీ ప్రభుత్వం చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు ఊసెత్తడం లేదు. నిజంగా ఎన్నికల సంస్కరణలు జరగాలంటే ఆ చట్టం రావాలి.
దేశ పౌరుల నుండి సేకరించిన వ్యక్తిగత డేటాను వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించడానికి దోహదం చేసే వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే డేటా రక్షణ చట్టాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం పౌరుల ఆధార్, పాన్ నెంబర్ వంటివి తప్పనిసరిగా అనుసంధానం చేస్తేనే వివిధ ప్రభుత్వ సేవలు గాని, ప్రభుత్వ రంగ సంస్థల సేవలు కాని అందుతాయని షరతులు విధించింది. ఇప్పటికే టెలికాం కంపెనీల, బ్యాంకుల సేవలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆ సమాచారం బడా వ్యాపార సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ప్రయాణాలకు ఆరోగ్య సేతు యాప్ను తప్పనిసరి చేశారు. ఆ విధంగా వచ్చే సమాచారాన్ని ఇన్సూరెన్స్ సంస్థలు, కార్పొరేట్ వైద్య సంస్థలు తమ వ్యాపారం కోసం వినియోగించుకుంటాయి. వ్యాక్సినేషన్ కోసం కో-విన్ యాప్ను వాడివున్నట్టైతే మన ఆమోదంతో నిమిత్తం లేకుండానే మన సమాచారం ఇన్సూరెన్స్ కంపెనీలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు చేరిపోయి వుంటుంది. ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలు దాని ఆధారంగా మనకు ఇన్సూరెన్స్ డబ్బుల్ని ఎగనామం పెట్టొచ్చు. ఉద్యోగుల కార్యకలాపాలను మానిటర్ చేసే యాప్లను ఆ ఉద్యోగుల ఫోన్లలో ఇన్స్టాల్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హర్యానాలో అంగన్వాడీ ఉద్యోగులు ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటారో సూచించే యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. మునిసిపల్ వర్కర్ల ఫోన్లలో యాప్ వారి కదలికలనే గాక వారి మాటలను సైతం రికార్డు చేస్తుంది. ఇవన్నీ ఆ కార్మికుల, ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కదా!
ఇజ్రాయిల్ నిఘా వ్యవస్థ ఎన్ఎస్వో గూఢచర్య సాధనాలను మోడీ ప్రభుత్వం ఉపయోగించి వాటి ద్వారా చట్టవిరుద్ధంగా మొబైల్ ఫోన్లను, లాప్టాప్లను హ్యాక్ చేసింది. పాత్రికేయులు, ప్రజా జీవితంలో ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు, ఆఖరుకు న్యాయమూర్తులతో పాటు అధికార పార్టీ నాయకులను సైతం పెగాసస్ విడిచిపెట్టని విషయం తెలిసిందే. వ్యక్తిగత సమాచారాన్ని మన అనుమతి లేకుండా మనకు తెలియకుండా సర్కారు వారు వినియోగించడం (దొంగిలించడం) గురించి ఇలా ఎన్నైనా పేర్కొనవచ్చు. దేశంలోని ఓటర్లందరి వ్యక్తిగత సమాచారానికి ఇకపై గోప్యత ఉండదు. ఈ దుష్ట చట్టాన్ని తిప్పికొడితేనే ప్రజాస్వామ్యానికి రక్ష.