Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతమో మద్యమో ఏదైతేనేం... జనాన్ని మత్తులో ముంచితే తప్ప తమ ఎత్తులు సాగవన్నట్టుగా ఉంది బీజేపీ వ్యవహారం! మొన్న హరిద్వార్‌లో విషం చిమ్మిన మత విద్వేష ప్రసంగాలను మరువకముందే, నిన్న విజయవాడలో ''మందుబాబులు ఓటేస్తే చాలు తాము ముందుకు సాగిపోతామంటూ'' నిర్లజ్జగా ప్రకటిస్తోంటే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేనా, ఓటేసినందుకు ప్రతిఫలంగా యాభైరూపాయలకే చీప్ లిక్కర్ బాటిల్ అందిస్తాం అని హామీ ఇస్తుంటే అవాక్కవుతున్నారు. ఇవి అన్నది ఏ చోటా మోటా లీడరో అయితే ఏమో అనుకోవచ్చు. కానీ ఆయన సాక్షాత్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభ సాక్షిగా సోమువీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయనీ వ్యాఖ్యలు నిండు సభలో, జాతీయనేతల సమక్షంలో చేశారు. అయినప్పటికీ వారెవరూ వీటిని ఖండించకపోగా కనీసం స్పందించకపోవడం విడ్డూరం!
అందుకేనేమో... ఈ ప్రజాగ్రహసభ నిజంగానే ప్రజాగ్రహాన్ని మూటకట్టు కుంటోంది. మరీ ఇంత నీచంగా ఎలా మాట్లాడుతారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర పార్టీల నేతలూ, సామాన్య ప్రజలే కాదు, సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కేవలం మందు చౌకధరలకే అందిస్తామని మాటిచ్చి ఊరుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తాగుబోతులు కోటిమందికి పైగానే ఉన్నారనీ, వారందరూ ఓటేస్తే పీఠం తమదేననీ లెక్కలతో సహా వివరించారు. అందుకని ప్రజలు తమ సంక్షేమం కోసమో, అభివృద్ధి కోసమో కాకుండా... 2024లో చౌకగా లభించే చీప్‌లిక్కర్ కోసం బీజేపీకి ఓటేయ్యాలట. నిజంగా ఇది ఎంత జుగుప్సాకరం? ప్రజలంటే ఎంత చులకన భావం? మరీ ఇంత దిగజారుడుతనమా? బహుశా దేశంలో ఓట్లకోసం బూర్జువా పార్టీలు సాగించే చీప్ పాలిటిక్స్‌లో ఇప్పటివరకు ఇంతకు మించింది మరొకటి లేదేమో..! కాబట్టే బీజేపీ తెస్తానన్న మంచిరోజులంటే అర్థం మందురోజులేనా? అని జనం నిలదీస్తున్నారు.
చేసిన వెకిలి వ్యాఖ్యలకు సదరు నేత మర్యాదగా క్షమాపణలు చెప్పుకుంటే కాసింతైనా పరువు దక్కేదేమో. ఆ పని చేయకపోగా, తగుదునమ్మా అంటూ ఆయన వివరణ పేరుతో వాటిని సమర్థించుకున్న తీరు మరింత జుగుప్స కలిగిస్తోంది. మద్యం సేవించేవారంతా రోజూ ఖర్చుచేసే రూ.250లో రూ.200 తగ్గితే వారి కుటుంబ భారం తగ్గి సోదరీమణులకు నెలకు ఆరువేలు ఆదా అవుతుందని సెలవిచ్చారాయన. కానీ ఆ సోదరీమణుల సకల కష్టాలకూ మద్యమే కారణమన్న సత్యాన్ని విస్మరించారు. మద్యం మత్తు విచక్షణను చంపేసి, పైశాచికత్వాన్ని ప్రేరేపిస్తుందన్న సంగతి మరిచిపోయారు. మహిళల ఆదాయం గురించి మాట్లిడిన నేత, ఆ మహిళలపై సాగుతున్న హింసలో మద్యమే తొలి ముద్దాయి అంటున్న బాధితులకు ఏం సమాధానమిస్తారు? కేవలం గృహ హింస మాత్రమే కాదు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మద్యం మత్తులో జరుగుతున్నవే కదా..! మద్యం అనేది మంచి చెడుల విచక్షణను నశింపజేసి, ఎదుటివారిని చంపే, లేదా చచ్చే తెగింపును తెచ్చిపెడుతుందని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. దేశంలో పెచ్చరిల్లుతున్న అనేక అసాంఘిక చర్యలకూ, హత్యలకూ, ఆత్మహత్యలకూ మద్యమే ప్రధాన కారణమని ''జాతీయ నేర నమోదు సంస్థ'' విశ్లేషణలు సైతం చెబుతున్నాయి. ఈ విషయం ఈ ''పెద్దమనుషుల''కు తెలియదంటే నమ్మగలమా? ఎంతసేపటికీ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకోవాలన్న యావే తప్ప, వీరికి ప్రజలేమైపోతారన్న ధ్యాసే ఉండదా..?
మహిళాజనోద్ధరణకై సారాయి ధరలు తగ్గించాలనుకునే ఈ ''మహానుభావుల''కు వారికి పెనుభారంగా మారిన నిత్యావసరాల ధరలు తగ్గించాలనే భావన ఎందుకురాదు? సమస్త సరుకుల ధరల పెరుగుదలకు కారణమైన పెట్రోల్ రేట్లను అదుపు చేయాలన్న ఆలోచన ఎందుకు లేదు? 'కోటి మంది తాగుబోతులు ఓటేస్తే చీప్‌లిక్కర్ యాభైరూపాయలకే ఇస్తామంటూ ఒక రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా నిండు సభలో ప్రకటిస్తారా?' అంటూ ఆ పార్టీ అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ''ఇంకా నయం మద్యంతోనే ఆపేశారు... బీజేపీకి ఓటేస్తే వయాగ్రా, కండోమ్స్ కూడా ఉచితంగా సరఫరా చేస్తామని అనలేదు'' అంటూ సామాజిక మాద్యమాల్లో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా ఇంటా బయటా ఇన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆ పార్టీ జాతీయ నేతలెవరూ నోరుమెదపక పోవడం గమనార్హం! హరిద్వార్‌లో బుసకొట్టిన మత విద్వేషాల పట్ల ప్రదర్శించిన ఉదాసీనతనే, విజయవాడ ''మద్యవిశేషం'' పట్ల కూడా ప్రదర్శిస్తున్నారు. అయినా పదవీ వ్యామోహాలే తప్ప ప్రజా క్షేమం పట్టని పార్టీ నుండి ఇంతకన్నా ఏం ఆశించగలం. బహుశా వారికి జనం కూడా తమలాగే ఉదాసీనతనే ప్రదర్శిస్తారని నమ్మకం కాబోలు. లేదా ప్రజలు మంచిరోజుల కన్నా మందురోజుల కోసమే ఎదురు చూస్తున్నారన్న భావన కావచ్చు. కానీ వాటన్నిటినీ వమ్ము చేస్తూ ప్రజలు ఛీ కొడుతున్నారు. చివరికి ప్రజానుగ్రహం కోసం తలపెట్టిన సభ ''ప్రజాగ్రహాన్నే'' మిగిల్చింది.