Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హఠాత్తుగా మోడీ సర్కార్ బరితెగింపుతో ఏడాది ముగిసిపోవడం యాధృచ్చికం కాదు. అది పథకం. దేశమైనారిటీలపై యుద్ధ ఘోషణే కాదు, యుద్ధం ఆరంభమైంది కూడ! దీన్ని బట్టి రానున్న వత్సరం వేడుకగా ఉంటుందో, మరిన్ని రక్తపుటేరులు పారిస్తుందో అంచనా కట్టడం పెద్ద కష్టమేమీకాదు. ఇది ఒక ఎత్తయితే మిలిటెంటు రైతు ఉద్యమ రణభేరి నడుమ చలి మబ్బుదుప్పట్లు తొలగించుకుని 2021 (గత ఉగాది నుండి) (వి)ప్లవనామ సంవత్సరంలోకి దేశం కాలూనింది. ఈ రణనామ సంవత్సరాన్ని రైతుల మరణనామ సంవత్సరంగా మలిచి ఏడువందలకి పైగా చితిమంటలతో చలికాచుకుంది మోడీసర్కార్. అయితేనేం?! వాళ్ళు హాలికులు. హలదారులు. ప్రకృతినే పాదాక్రాంతం చేసుకున్న వారికి ప్రభుత్వాలొక లెక్కా! మోడీ సర్కార్‌ను మోకాళ్ళపైకొంచగలిగారు. ఏమైనా, ఉగాది పచ్చడిలా 'తోడా కట్టా, తోడా మీఠా'తో కొత్త ఏడాదిలో కాలూనుతున్నాం.
ఈరోజు అందరూ 'హ్యాపి న్యూఇయిర్' చెప్పుకున్నా, నిజమైన 'హ్యాపీనెస్' ఆ గుప్పెడు మందికే! కుప్పలు తెప్పలుగా ఉన్న మిగిలిన వారందరికీ కష్టాలూ, కడగండ్లే! ఇన్ని లక్షల యేండ్ల మానవ ఉనికిలో ఇవి కొత్తేం కాదు. కందమూలాలు తినే దశ నుండి తానే 'కాడై' ఫ్యూడలిజాన్ని మోసే దాకా, యంత్రంలో యంత్రమై పెట్టుబడికి 'కందెనై' కాలిపోతున్న నేటివరకు ఇవన్నీ మానవానుభూతులే? కష్టజీవుల అనుభవాలే. 2022లోనైనా ఈ ముదనష్టపు కాలం ముగిసిపోతుందన్న ఆశ! ఇది ఊహమాత్రం కాదు సుమా! ఈ రణనామ సంవత్సరపు భౌతిక అనుభం. వాస్తవాల్ని కనుమరుగు చేయడం ఎంత వాక్పటిమున్న నేతలకైనా అసంభవం. ఒకట్రెండేండ్లు మాటలమ్మితే ఎవరైనా కొంటారు. తింటారు. జీర్ణం చేసుకుని ఓట్లు రాలుస్తారు. ఏడేండ్లా? వాటి 'డేట్ ఎక్స్పైర్' అయిపోయింది మోడీ సాబ్!
రైతులు దేశానికి అన్నంపెట్టే వాళ్ళేకాదు. అన్ని రంగాల కష్టజీవులతో 'అ' 'ఆ'లు దిద్దించగలరు. సరళీకృత విధానాలపై పోరు సలిపే మార్గం చూపగలరని రుజువు చేశారు. మన పాలకులకు కార్పొరేట్లు ఎంతటి సజాతీయులైనా, గుజరాతీ అస్మదీయులైనా, దేశ పార్లమెంటరీ సాంప్రదాయాలను కూడా కాలదన్ని చేసే చట్టాలు చిత్తు కాగితాలేనని చెప్పకనే చెప్పారు కదా! కులాల్ని, మతాల్ని, 2013లో పరివార్ సృష్టించిన చీలికల్ని అధిగమించి, వారిని మళ్ళీ బంధించింది వారు చిందించే చెమట చుక్కే! రణ నామ సంవత్సరంలో అన్న దాతలు ప్రాణ ప్రతిష్ట చేసింది అన్ని తరగతుల పోరాటాలనే కాదు, దేశ ప్రజాస్వామ్యాన్ని కూడ! మోడీ, ఆయన వంది మాగధులు, కిరాయి 'కల' పతులు 'ఆహా.. ఓహౌ' అని పరవశించమని దేశ ప్రజలకి చెపుతున్నా ప్రపంచ ఆకలి సూచీ, నిటి ఆయోగ్ తయారు చేసే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ప్రపంచ అసమానతల నివేదిక వంటి వాటన్నిటిలో భారతదేశ స్థానం దిగజారుతూనే ఉంది. దేశంలో స్థానిక స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పోరాటాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. వాటి అణిచివేతలూ సాగుతూనే ఉన్నాయి. రాజుకునే ఉద్యమాలపై ఎక్కడైనా పాలకులు చేసే పనే అది. ఏ రాజ్యమైనా అమలుచేసేదే! మోడీ సర్కార్ ప్రత్యేకతేమంటే అది రెండు తలల విషనాగు. ఒక తల కార్పొరేట్ల వశం. రెండవది ''పరివారాని''కి అంకితం. 2015లో యూపీలో ఆవుమాంసం తిన్నాడనే డౌట్‌తో మహ్మద్ అఖ్లాక్ హత్యతో మొదలై మొన్న అంబాలలో ఏసుక్రీస్తు విగ్రహ విధ్వంసం వరకు నిరాఘాటంగా మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక సంవత్సరంలో 350 వరకు జరిగాయి. ఆవుపేరుతో, లవ్‌జిహాద్ పేరుతో ముస్లింలను టార్గెట్ చేసిన పరివార్ శక్తులు, మత మార్పిడుల పేరుతో క్రిష్టియన్లపై దాడిచేస్తున్నారు. దాడులకు అంతే లేదు. యోగి ఆధ్వర్యంలో యూపీలో గుజరాత్ పునరావృతం అవుతోంది. ఎన్ఎస్ఏ కింద అరెస్టులు, మూకదాడులు, ఎన్కౌంటర్లు యూపీలో నిత్యకృత్యం. తరాలుగా వ్యవసాయం చేస్తున్న ముస్లింలను అసోంలోని కొన్ని గ్రామాల్లో వ్యవసాయం చేయరాదని నిషేధించారు. మధ్యప్రదేశ్‌లో ముస్లిం వీధివ్యాపారస్తులను ఆ వ్యాపారాలు చేయకుండా నిషేధించారు. రాంచిలో కాశ్మీర్ ఊలు అమ్మకందార్లను 'జై శ్రీరాం' అనాలని నిర్బంధించి చితకబాదారు. ఈ దాడులకు గురవుతున్నవారంతా పేదలు, దళితులు, గిరిజనులు, ముస్లింలు. దాడుల్లో ధ్వంసమయ్యేవి చర్చీలు, శిలువలు, మసీదులు, వాటి మినార్లు.
తాము విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలకు ప్రజల ఐక్యత అడ్డుగా ఉంది. మోడీ ఊకదంపుడుతోనే తమ అంతిమ లక్ష్యం, హిందూరాజ్య స్థాపన సిద్ధించేలా లేదు. ప్రజల్లో వర్గ ఐక్యత పెనవేసుకునే కొద్దీ నోళ్ళ నుండే చాకుల్ని, బాకుల్ని వర్షించగల శతఘ్నులు కాళీచరణ్ మహారాజ్‌ల వంటి వారి ఆవశ్యకత పెరిగింది. అదే నేడు హరిద్వార్‌లో, రారుపూర్‌లో చూస్తున్నాం.
మనుషుల్ని వినిమయ దార్లుగా చూస్తుంది కార్పొరేట్ సంస్కృతి. మనుషుల్ని మతస్థులుగా పరిగణిస్తుంది సంఫ్‌ుపరివార్ సంస్కృతి. మనుషుల్ని మనుషులుగా నిలిపేది వర్గపోరాటం మాత్రమే. ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలలో వర్గ పోరాటమే 2022లో శ్రమజీవులకు రక్ష.