Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గాలి పెదవుల తాకి వెదురుగానాలు
నీలి మబ్బుల జూసి నెమలి నాట్యాలు
వద్ది మద్దెల మీద వల్లంకి తాళాలు
ఆటపాటల దరువు కడవి తొలిగురువు' కళకు, కైతకు, స్వరానికి, పదానికి ఆదిగురువు ప్రకృతి. మనిషి కూడా ప్రకృతిలో భాగమే. కాకపోతే మనసును తీర్చి దిద్దుకున్న మహాఘనుడు మానవుడు. శ్రమే దానికి మూలహేతువు. అయినా సమస్త ఆవరణంలో తానొకడు. మనిషి సుందర పాద విన్యాసానికి, పద విన్యాసానికి ప్రకృతి ప్రేరణ. అందుకే గాలి పెదవులు తాకి వెదురు గానం చేసిందంటున్నాడు కవి. 'మానవుని తొలి సౌందర్యానంద చర్యలలో కవిత్వం ఒకటి' అని కాడ్వెల్ మహాశయుడు చెప్పినట్టుగానే మానవుని ఆనంద సందర్భమే కాదు, దుఃఖపు, వేదనపు, బాధలో కూడా గానం ఓదార్పుగా అభివ్యక్తమవుతుంది. పరవశించిన ఆది మానవ సమూహాలు పాడుకున్నదే పాట. పాటకు మానవునికున్నంత చరిత్ర ఉంది.
ఆదిమ కవిత్వం పాటే. అందుకే అది స్వచ్ఛమైనది. హృదయాలను హత్తుకుంటుంది. ఊయలలూపుతుంది. జోలపాడుతుంది. మేల్కొలుపుతుంది. ఉరికిస్తుంది. ఉవ్వెత్తున లేస్తుంది. ఆలోచననిస్తుంది. ఆవేశం నింపుతుంది. అందరి గొంతుల్ని కలిపి ఉత్సాహం పెంచుతుంది. జీవితపు అన్ని అనుభవాల కళాహారమే గేయమై గళమెక్కుతుంది. పనిలోంచి వచ్చిన పరస్పర సంబంధాల్లోంచి పల్లవిగా నిలుచుని, చరణమై సాగిపోతుంది. అందుకే 'పాట పనితో పాటే పుట్టింది, పనీ పాటతోనే జతకట్టింది' అంటాడు కవి. ప్రకృతి ఒడి దాని వేదిక. ఇప్పటికీ ప్రకృతి సిద్ధమైన భూమిపై ఆధారపడి పనిచేసే పల్లెలు, కొండ కోనలు, అడవులు సెలయేళ్లు పాటకు నిజమైన ఆదరువులు. జీవనలయలే పదాలకు సంగీతాన్ని సమకూరుస్తాయి. అందుకనే సజీవంగా నిలుస్తాయి. అలాంటి ప్రకృతి జీవనం విధ్వంసమవుతున్నప్పుడు పాట మూగబోయి ఎలా ఉంటుంది? మట్టి బతుకుల్లో సంఘర్షణ ఎక్కడుంటుందో, కన్నీళ్ళలో తడుస్తున్న పల్లెలు ఎక్కడ దర్శనమిస్తాయో! అక్కడల్లా పాట తన చేతులతో ఓదార్చి కర్తవ్యాన్ని బోధిస్తుంది.
ఈ పరిస్థితికి తెలంగాణ నిలువెత్తు నిదర్శనం. కనుకనే పాటల ఊటలకు నెలవు ఈనేల. తిరుగుబాటు చైతన్యాలకు కోరస్ నందించటమే ఇక్కడ పాటల ధ్యేయం. అందుకనే ''అద్దాల అంగడి మాయ / దాని సూపుకు నరుని బతుకు / బొంగరమై పాయెర - నువ్వు మూసుకోని ఉన్న, అది తోసుకొస్తదన్న, నువుతాళమేసుకున్న అదిగాలమేస్తదన్న, నువ్వు అలసి నిదురలున్న, అది కుదిపి లేపురన్న, దాని షాపు యాడ ఉంటదో, దాని సావుకారి ఎవడో, కనుక్కుందమని పోతే, నీకు కార్డు అంటగడతి, నువు కొననివి కొనిపిస్తది, కోతిగ జూపిస్తది' అని ప్రపంచీకరణలో వినియోగదారీ తత్వాన్ని విపులంగా గానం చేశాడు గోరటి వెంకన్న. అందుకే పాటకూ, ఆ పాటల్లోని తేటయిన కవిత్వానికీ, ప్రకృతి ప్రేమతత్వాకీ కేంద్ర సాహిత్య అకాడమి పట్టం కట్టింది. తెలంగాణ నేలలోని మట్టి దుఃఖాన్ని ప్రపంచానికి చాటిన వెంకన్నకు ఈ గుర్తింపు రావటమంటే అది ఈనేల జనపదానికి దక్కిన గౌరవమే. ఇక్కడి వారసత్వపు చైతన్యం ఆయన గొంతులో కదలాడింది. 'గాలి నేల నింగి నీరు, ఆదిలొ అందరివి, మనిషిలోని లోభిగుణం కొందరి వంటున్నది, పుట్టిన కులం వల్ల ఒకడు గొప్ప అంటున్నది, దేవుని వరం వల్ల నరునికి సుఖమంటున్నది, సుఖం గూర్చె సంపదంత, సెమట సేతిసలువంట' అని చెప్పగలిగాడు.
ఇక ఈ సంవత్సరంలోనే కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, ప్రసిద్ధ సైన్సు రచయిత దేవరాజు మహారాజు అందుకోవడం మరింత సంతోషాన్ని నింపుతోంది. బాలలకే కాదు, మనందరికీ శాస్త్రీయ ఆలోచనలను అందించే రచయితగా సామాజిక బాధ్యతతో కలాన్ని ఎక్కుపెట్టిన యోధుడు ఆయన. అదే విధంగా 'మెట్ట భూముల్ని మెత్తగా జల్లెడపట్టిన నాగండ్లకు బతుకు పంటను / ఎలా ఇంటికి తెచ్చుకోవాలో తెలుసు / ఇంకెప్పుడైనా రైతు ఊపిరి చెట్ల కొమ్మలకు వేలాడితే, తోలు చెప్పుల సప్పుడే, దేశమంతా జాతీయగీతమై మారుమోగుతుంది' అని కష్టజీవుల బతుకును కవిత్వీకరించిన తెలంగాణ పల్లెకవి తగుళ్ళగోపాల్కూ సాహిత్య అకాడమీ యువ పురష్కాం దక్కడం ఆనందదాయకం. పల్లెభాషను, మానవ సంబంధాల్లోని ఆత్మీయతను హత్తుకున్న కవిత్వం అతనిది. ఈ ముగ్గురూ తెలంగాణ నేల నుండి సృజనరంగాన ఎదిగి వచ్చిన వారు కావటం ఒకింత గర్వకారణం. నవ తెలంగాణ హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలుపుతున్నది.
కళకైనా కవితకైనా సామాజిక జీవితమే ముడిసరుకు. నేడు సామాన్యుల జీవనగతి విధ్వంసమవుతున్నది. అది ప్రకృతి విధ్వంసంలో భాగమే. ఈ ధ్వంస రచనకు దోపిడి వ్యవస్తకారణం. దాని లక్షణమే అది. అందుకు తోడుగా నేడు సాంస్కృతిక జీవనంపైనా తీవ్ర దాడి జరుగుతోంది. ఇది మనుషులను, సమభావాన్ని ఛిద్రం చేస్తున్నది. కవులూ రచయితలూ కళాకారులూ వీటికి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయమిది. మనిషిని, ప్రకృతిని కాపాడుకోవటానికి గొంతెత్తాల్సిన సందర్భం. అందుకు ఈ గుర్తింపులు దోహదం చేయాలని ఆశిద్దాం.