Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడు కొన్నింటిని లక్ష్యం చేసుకున్నారు. ఇప్పుడు మరికొన్నింటిని. దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పేదల్లో చిచ్చుపెట్టేవే. కార్మిక సంఘాలు ముసుగు వేసుకున్నవి కొన్ని. గిరిజనుల ఐక్యతను దెబ్బతీసేవి మరికొన్ని ఉన్నాయి. వాటిని ముట్టుకోలేదు. ఈ దాడిలోనూ మతోన్మాదమే బుసకొడుతోంది. దేశంలో దాదాపు 31 లక్షల స్వచ్ఛంధ సంస్థలున్నాయి. అంటే దాదాపు ప్రతి 400మందికి ఒక ఎన్జీవో ఉంది. అయితే అందులో అనేకం స్రామాజ్యవాదానికి తొత్తులుగా ఉండే ఎన్జీవోలు. అవి ప్రజల్లో చీలికలు తీసుకు వస్తాయి. అలాంటి వాటి మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ అందుకు విరుద్ధంగా ప్రజలకు సేవ చేసేవి, ప్రభుత్వాన్ని విమర్శించే వాటిపై వాటి లైసెన్సును రద్దు చేస్తూ చర్యలకు ఉపక్రమించింది. దాదాపు 12 వేలకు పైగా ఎన్జీవోలకు సంబంధించి విదేశాల నుంచి విరాళాలు పొందడానికి అవసరమయ్యే ఎఫ్సీఆర్ఏ లైసెన్సును కేంద్రం రద్దుచేసింది. అయితే, ఒక్క శనివారమే దాదాపు ఆరు వేల ఎన్జీఓలు, సంస్థలు లైసెన్సులు కోల్పోవడం గమనార్హం. ఏడు దశాబ్దాల క్రితమే నోబుల్ బహుమతి గ్రహిత మదర్ థెరిస్సా స్థాపించిన 'మిషనరీ ఆఫ్ చారిటీ' లైసెన్సును పునరుద్ధరించడానికి కూడా నిరాకరించింది. మరి కొద్ది రోజులకే మిగతా సంస్థల లైసెన్సులను కూడా రద్దు చేయడం మోడీ ప్రభుత్వ నియంతత్వ వైఖరికి నిదర్శనం.
ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ లైసెన్సు కోల్పోయిన సంస్థలలో కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందించిన సంస్థలే ఉన్నాయి. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ప్రతిఏడాది మోడీ ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా ఎండగడుతుంది. అందుకే అటువంటి సంస్థలపై చర్యలకు ఉపక్రమించారు. ఇది కూర్చున్న కొమ్మనే నరుకోవడం కాక మరేమిటి? దేశ వ్యాప్తంగా శనివారం నాటికి 22,762 ఎఫ్సీఆర్ఏ నమోదిత ఎన్జీవోలు ఉండగా, నేడు ఆ సంఖ్య 16,829కి తగ్గినట్టు హౌం శాఖ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నది.
విదేశీ సంస్థల నుంచి భారీ ఎత్తున విరాళాలు అందుకుంటూ మత మార్పిడులకు, అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర సంస్థలు నిర్దిష్ట ఆధారాలను సేకరించలేక పోయాయి. కేవలం అనుమానంతో పేదలకు అందుతున్న ఆ కాస్త సాయానికి కూడా మోకాలడ్డటం సమంజసమా? గతంలో వరదల సమయంలో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్ల భారీ ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఈ చట్టానే బూచిగా చూపి ఆ సాయాన్నీ తిరస్కరించింది ఇదే బీజేపీ సర్కార్.
ఎఫ్సీఆర్ఏ నిబంధనలను కఠినతరం చేస్తూ 'చాప కింద నీరులా' ప్రభుత్వేతర సంస్థల మీద మోడీ ప్రభుత్వం కొంతకాలంగా పట్టుబిగిస్తున్న విషయం తెలిసిందే. ఏడేండ్ల కాలంలో కొన్ని వందల ఎన్జీఓలకు విదేశీనిధులు అందుకొనే హక్కులేకుండా చేసింది.ఈ చట్టాన్నే ఆయుధంగా వాడుతూ గ్రీన్ పీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇత్యాది పలు అంతర్జాతీయ సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. ఆస్ట్రేలియాలో ఆదానీ కంపెనీకి బొగ్గు తవ్వకాలను అనుమతులకు అడ్డుపడిన గ్రీన్పీస్పై ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తలుచుకుంటే విదేశీనిధులు నిలిపివేయడానికీ, ఆయా సంస్థలు తమకు తాముగా గతించిపోయేట్టు చేయడానికి ఏలాంటి రంధ్రాన్వేషణకైనా వెనకాడదని ఈ ఘటన స్పష్టం చేస్తున్నది. కానీ, వేలాదిమంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేస్తున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉంటేనే ప్రభుత్వం తన విలువను కాపాడుకోగలదు. దేశ విలువలను కూడా పెంచగలదు.
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'పీఎం కేర్స్' పేరుతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసింది. అన్ని ఛారిటీస్ మాదిరిగానే పీఎం కేర్స్ కూడా వ్యవహరిస్తుందని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికీ ఆ నిధి వివరాలను గోప్యంగానే ఉంచింది. 'తనకో న్యాయం.. పరులకు మరో న్యాయం' అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ సంస్థ మీద కఠిన చర్య తీసుకున్నప్పుడు కారణాలు వివరించడం ప్రభుత్వ కనీస బాధ్యత. 'కొంత ప్రతికూల సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అన్న ఒక్కమాటతో ఈ అనుచిత నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకోలేదు. ఆయా సంస్థల ఆడిట్లో గోల్ మాల్ ఉంటే పరిమితులకు లోబడే ఆ గుట్టు విప్పవచ్చు. ఎన్నో ఏండ్లుగా విదేశీ విరాళాలు అందుకుంటూ ఏటా జమాఖర్చులు చూపే ఆ సంస్థలతో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏమిటో తెలియజేయకుండా శిక్షిస్తే ఎలా? పారదర్శకత ఏమాత్రం లేని సర్కారీ చర్య సంస్థలతో ప్రయోజనం పొందే రోగులకు, ఉద్యోగులకు ఆసరా లేకుండా చేయడాన్ని రాజకీయపక్షాలే కాదు, మానవత్వం ఉన్నవారెవరూ సమర్ధించరు. ఎక్కడైన నిధులు దుర్వినియోగం జరిగిన చోట, అక్రమాలను గుర్తించిన చోట చర్యలు చేపట్టకుండా గుంపగుత్తాగా అన్నింటిని ఒకే గాడిన కట్టడం సరైంది కాదు.