Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మోడీ ఓ దురహంకారి''.
''రైతులేమైనా నాకోసం చనిపోయారా? అని విరుచుకుపడిన పొగరుబోతు.''
''రైతుల మరణాలను అపహస్యం చేసిన ప్రధాని''
ఈ మాటలు ఏ ప్రతిపక్ష నాయకుడివో అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నోటి వాక్కులివి! ఆదివారం హరియాణాలోని దాద్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజలపట్ల ప్రధాని క్రూరత్వానికీ, ప్రజా ఉద్యమాల పట్ల పాలకుల అమానవీయతకు దర్పణాలు.
కారణాలేమైనప్పటికీ మొదటి నుంచీ రైతుల ఉద్యమం పట్ల ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న ఈ గవర్నర్ మాటలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయమై తాను ప్రధానిని కలిసినప్పుడు, ఆయన అత్యంత దురహంకార పూరితంగా ప్రవర్తించారనీ, ఉద్యమంలో 500మందికి పైగా రైతులు మరణించడాన్ని ప్రస్తావిస్తుండగానే ''వారేమైనా నాకోసం చనిపోయారా'' అంటూ దురుసుగా విరుచుకు పడ్డారనీ ఆయన తెలిపారు. దానికి నేను ''దేశాన్ని పాలించేది మీరే గనుక వారి మరణాలకు మీరే బాధ్యులు'' అని బదులిచ్చాననీ పేర్కొన్నారు. అలా కొంతసేపు జరిగిన తీవ్ర వాగ్వావాదం తరువాత ఆయన సూచన మేరకు అమిత్‌షాను సంప్రదించగా ''సత్యా... ఆయనకు మతిపోయింది.'' అన్నారని కూడా వెల్లడించారు. ఆ తరువాత దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో ఆయన వివరణ పేరుతో కొంత వెనక్కి తగ్గినా, అప్పటికే ఓ వీడియో ద్వారా ఈ ప్రసంగమంతా వైరల్ కావడంతో ప్రధాని తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రైతులపై ప్రధాని స్పందన ఆయన అహంకారాన్నే కాదు, ప్రజల పట్ల బాధ్యతారాహిత్యాన్నీ సూచిస్తున్నది. అయితే ఇదేమీ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యల ద్వారా మాత్రమే తెలిసిన కొత్త విషయమేమీ కాదు. ఉద్యమ ప్రారంభం నుంచీ విరమణదాకా... ప్రధాని, ప్రభుత్వం రైతాంగంతో వ్యవహరించిన తీరు ఆయన క్రూర స్వభాన్ని ఎప్పుడో తేటతెల్లం చేసింది. మరణించిన రైతుల పట్ల కనీస సంతాపం, విచారం కూడా వెలిబుచ్చలేని వీరి కసాయితనాన్ని ప్రజలెప్పుడో పసిగట్టారు. స్వాతంత్య్రోద్యమం తరువాత దేశం కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఎగిసిపడిన ఈ ఉద్యమానికి అబ్బురపడి ప్రపంచమే సలాం చేసింది కానీ, ఈ కాషాయ పాషాణాలు మాత్రం కరిగింది లేదు.
పైగా ఒక వైపు అధికారిక నిర్బంధాలు, మరోవైపు అసాంఘిక శక్తుల దాడులూ దౌర్జన్యాలూ, ఇంకోవైపు అమానుష అసత్య ప్రచారాలతో ఉద్యమాన్ని నీరుగార్చాలని చూశారు. కానీ ప్రాణాలు కోల్పోతూ కూడా మొక్కవోని దీక్షతో ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టిన అన్నదాతల ముందు ఈ ప్రభుత్వానికి తలవంచక తప్పలేదు. అలా తప్పని స్థితిలోనే ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కు తీసుకుంది తప్ప, చిత్తశుద్ధితో కాదనడానికి సత్యపాల్ మాలిక్ ప్రసంగం మరో ఉదాహరణ మాత్రమే. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందో లేదో, వాటిని మరో రూపంలో తీసుకొస్తామని స్వయానా వ్యవసాయమంత్రే నోరుజారడం, ఆ తరువాత మాట మార్చడం కూడా ఈ ''చిత్తశుద్ధి''ని ఎత్తిచూపడం గమనార్హం. లేదంటే రద్దు చేసే చట్టాలను కూడా పార్లమెంట్ సాక్షిగా ఆకాశానికెత్తడంలోని ఆంతర్యమేమిటి? అంతెందుకు, నిర్దాక్షిణ్యంగా రైతులను వాహనాలతో తొక్కి చంపిన, లఖీంపూర్ ఖేరీ ఘటనలో మాత్రం ప్రభుత్వ వైఖరి చెపుతున్నదేమిటి?
ఘటనకు కేంద్ర మంత్రి అజరుమిశ్రా తనయుడు అశిష్మిశ్రాయే కారకుడని బాధితులైన రైతులూ, ప్రత్యక్ష సాక్షులూ చెప్పినప్పుడు బీజేపీ ఏం చేసింది? అసలు ఆ సమయంలో అతడు అక్కడ లేనేలేడని తోసిపుచ్చింది. అందుకు దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసును నీరు గార్చేందుకు పూనుకుంది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ''సిట్''ను ఏర్పాటు చేయలేకపోయింది. ఇప్పుడు ఆ ప్రత్యేక దర్యాప్తు బృందమే (సిట్) నిందితుడు ఆశిష్ మిశ్రా ఆ సమయంలో ఘటనాస్థలంలోనే ఉన్నాడని దర్యాప్తులో తేల్చి చెప్పడంతోపాటు, అతడే ప్రధాన నిందితుడని కూడా చార్జిషీట్ దాఖలు చేసింది. దీనికి బీజేపీ ఏం సమాధానం చెపుతుంది? ఘటనకు ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అజరుమిశ్రాను కూడా చార్జిషీట్లో చేర్చాలని రైతులూ, వారి తరుపు న్యాయవాదులూ కోరుతున్నారు. ఘటనకు కారణమైన వాహనం కూడా ఆయనపేరు మీదే నమోదై ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. విచారణకు వీలుగా ఆయనను మంత్రివర్గంలోంచి తొలగించాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ నిర్లజ్జగా అజరుమిశ్రాను మంత్రివర్గంలో కొనసాగించడమే కాదు, యూపీ ఎన్నికల సభల్లోనూ తిప్పుతున్నారు కదా! దీన్నేమంటారు? ఇది విచారణకు ఆటంకం కాదా..? ఇవి ప్రభుత్వ పెద్దల దురహంకారాలకూ, దురన్యాయాలకూ ప్రతీకలు కావా..? ఇవన్నీ చూశాక కూడా సత్యపాల్మాలిక్వి ''సత్యవాక్కులు'' కాదని ఎవరు మాత్రం భావించగలరూ..?! బహుశా అందుకేనేమో ఈ వ్యాఖ్యల్ని ఖండించడానికి కూడా కమలనాథులెవరూ ప్రయత్నించడం లేదు.