Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ మాటల వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత వరకూ జనం మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు...' అని ఒక మేధావి హెచ్చరించారు. ఆయన వాక్కులు నూటికి నూరు పాళ్లూ నిజం. వ్యాపార వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకే దశావతారాలు ఎత్తుతున్న నేటి పాలకవర్గాలు... తమ మాటల్లోని మర్మం ఏ మాత్రమూ బయటపడకుండా జనాన్ని పదే పదే ఏమార్చుతున్న కాలమిది. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కొన్ని తతంగాలను నిశితంగా పరిశీలిస్తే ఇక్కడి ప్రజలను మోసం చేసేందుకు, వారిని మభ్యపెట్టేందుకు వీలుగా కమలదళం శరవేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. అందుకనుగుణంగా ఆ పార్టీ రంగం సిద్ధం చేసింది. 'మిషన్-19' పేరుతో రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఒక వ్యూహాత్మక కార్యక్రమం... తాజాగా చర్చనీయాంశమవుతున్నది. 'రాష్ట్రంలో ఉన్న 19 ఎస్సీ శాసనసభా నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాన్ని మనం క్యాష్ చేసుకోవాలె. ఇప్పటి నుంచి వాటిపై కేంద్రీకరించి పన్జెయ్యాలె...' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన దరిమిలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వాస్తవానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనీ, దాని స్థానంలో మనువాదాన్ని బలంగా రుద్దాలని బీజేపీ భావిస్తున్నది. ఈ చర్యలకు ఇప్పుడు ఉత్తర భారతంలో ఎక్కువ బలవుతున్నది దళితులు, మైనారిటీలే. ఉత్తర ప్రదేశ్‌తోపాటు మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇంతటి ఘోరమైన పరిస్థితి అక్కడ ఉండగా... ఇప్పుడు తగుదనమ్మా అంటూ మన రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ శ్రద్ధ పెట్టేదెందుకు? 'దళితులు అమాయకులు, చైతన్యహీనులు, అవగాహన లేనివారు, అందువల్ల వారందర్నీ అనేక రకాలుగా అణగదొక్కినా పట్టించుకోరు, తిరిగి మనకే ఓట్లేస్తారు...' అనే ధోరణితో బీజేపీ వ్యవహరిస్తున్నట్టు తేటతెల్లమవుతున్నది. మరోవైపు రైతు ఉద్యమ నేపథ్యంలో ఉత్తరాదిన మోడీ ప్రభ మసకబారుతున్నది. ఈ క్రమంలో అక్కడి మైనస్‌లను దక్షిణాదిన ప్లస్‌లుగా మార్చుకోవాలన్నది దాని తాపత్రయం. అయితే ఎన్ని కుప్పి గంతులేసినా.. కాళ్లు పైకి, తలకాయ కిందికి పెట్టినా కేరళ, తమిళనాడులో ఆ పార్టీ పప్పులుడకవు. ఈ క్రమంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కర్నాటకతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలపై కమలదళం కన్నేసింది. అందులో భాగంగా 'మిషన్-19'ను తెరపైకి తెచ్చింది. ఇదే క్రమంలో నిరుద్యోగ దీక్ష అంటూ బండి సంజరు కరీంనగర్లో హడావుడి చేస్తే... దాని కొనసాగింపుగా సికింద్రాబాద్‌లో నడ్డా హంగామా సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇక్కడ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన, స్థానికత సమస్యలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలకు సంబంధించి టీఆర్ఎస్ను ప్రశ్నించాల్సిందే, బోనులో నిలబెట్టాల్సిందే. కానీ అలా ప్రశ్నించే హక్కు, నిలదీసే నైతికత బీజేపీకి ఉందా..? అన్నదే అసలు సిసలైన ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ బీజేపీ నేతలు... ఏ అంశాలపైనయితే ఆందోళనలు, దీక్షలు అంటున్నారో అవే సమస్యలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ తిష్ట వేసుక్కూర్చున్నాయి. వాటిని పరిష్కరించేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోని బీజేపీకి అవే సమస్యలపై ఇక్కడ పోరాటం చేసే అర్హత ఉంటుందా..? అంటే కచ్చితంగా ఉండదనే చెప్పాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, విద్యా వాలంటీర్ల కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవటం, ఉన్న కొలువులను ఊడబెరకటం తదితరాంశాలపై తెలంగాణాకు చెందిన ఏ ఒక్క బీజేపీ నాయకుడూ ఇప్పటి వరకూ మాట్లాడింది లేదు. పైగా ప్రభుత్వరంగ సంస్థలను మోడీ సర్కారు కారు చౌకగా అమ్మేస్తున్న తరుణంలో... ఆ చర్యలకు వ్యతిరేకంగా నిలబడిందీ లేదు. ఆయా సంస్థలన్నింటినీ ప్రయివేటీకరిస్తే అప్పుడు రిజర్వేషన్లకు దిక్కే ఉండదు కదా..? ఇది దళితులకు తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. ఇలాంటి వాస్తవాలను మరుగుపరచటం ద్వారా బీజేపీ 'మిషన్-19' పేరిట ఒక సరికొత్త మేలి ముసుగును ధరించి తెలంగాణలోని దళిత సామాజిక తరగతుల్లోకి జొరబడేందుకు ప్రయత్నిస్తున్నది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాల పట్ల కేవలం దళితులే కాదు, మిగతా సామాజిక తరగతులు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ మరో విషాధమేమంట... కమల దళం కుయుక్తులకు ఊతమిచ్చే విధంగా గులాబీ పార్టీ వ్యవహరించటం. గతంలో అనేక సందర్భాల్లో పలు విషయాలపై బీజేపీ సంగతి తేలుస్తామంటూ రంకెలేసిన టీఆర్ఎస్ బాస్... ఆ తర్వాత వంగటమనే ప్రత్యేక కళను అభ్యసించి, మోడీకి వంగి వంగి సలాములు కొడుతున్నారు. మొన్నటికి మొన్న ధాన్యం విషయంలోనూ ఇదే తంతు నడిచింది. ఇప్పుడు తన అవసరాల రీత్యా కావచ్చు లేదంటే ఇతర పార్టీలను ఎదగకుండా చేయటంలో భాగంగా కావచ్చు... కానీ తెలంగాణలో కాషాయ పార్టీ ఎదగటానికి కావాల్సిన సరుకును, సరంజామాను సర్దిపెట్టే పనికి కారు పార్టీ పూనుకోవటమనేది ప్రజలకు అత్యంత ప్రమాదకరం. తెలంగాణకు అత్యంత నష్టదాయకం. ఈ సత్యాన్ని గులాబీ బాస్ గమనిస్తే మంచిది.