Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూతపడిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ హిందుస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్ (హెచ్ఎన్ఐ)ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుని తిరిగి తెరిపించడం అభినందనీయం. ఇంతకు ముందు కాసర్గోడ్లో బిహెచ్ఇఎల్ అనుబంధ విభాగం ఎలక్ట్రానిక్స్ మెషిన్ లిమిటెడ్ (ఇఎమ్ఎల్)ను కేంద్ర ప్రభుత్వం మూసివేసినప్పుడు ఎల్డీఎఫ్ ప్రభుత్వం దాన్ని టేకోవర్ చేసుకుని తనే నిర్వహిస్తోంది. దేశంలోని ఇతర విమానాశ్రయాలతోపాటు తిరువనంతపురం విమానాశ్రయాన్నీ ఎలాంటి అనుభవంలేని ఆదానీకి అప్పగించేందుకు మోడీ సర్కార్ తెగబడినప్పుడు కేరళ వామపక్ష ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ విమానాశ్రయాన్ని తామే నిర్వహిస్తామని చెప్పింది. కేంద్రం దీనిపై మొండిగా ముందుకెళ్లడంతో దానికి వ్యతిరేకంగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ, బలోపేతం కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాగిస్తున్న కృషి ప్రజల మన్ననలు అందుకుంటోంది. ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగం సంస్థలన్నిటినీ ప్రయివేటు పెట్టుబడికి కట్టబెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంటే... రాష్ట్రాలకు ఉన్న అధికార పరిధుల్లోనే ప్రత్యామ్నాయ విధానాలను ఎలా అమలు చేయవచ్చో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేసి చూపిస్తున్నది. ప్రభుత్వరంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది.
నయా ఉదారవాద విధానాలను పూర్తిగా తలకెత్తుకుని, మతతత్వ ఎజెండాను ముందుకు తెస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్రంలోని పచ్చి మితవాద ప్రభుత్వానికి, ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే వామపక్ష ప్రభుత్వానికి మధ్య ఈ తేడాను అందరూ గమనిస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడున్నరేండ్లలో ప్రభుత్వ రంగ సంస్థలను, వాటి ఆస్తులను గుండుగుత్తగా అమ్మేస్తున్నది. చివరికి మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో త్యాగాలు చేసి సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కుపైనా దాని కన్ను పడింది. అక్కడి గంగవరం, కృష్ణపట్నం ఓడరేవులను అదానీకి ఇప్పటికే కట్టబెట్టిన మోడీ సర్కార్ ఇప్పుడు 35 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, ఇంకా అనేక వేల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ తెలుగువారికే గర్వకారణంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేయడానికి పూనుకోవడం దుర్మార్గం. దీనిని గట్టిగా ప్రతిఘటించాల్సిన ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తున్నది. ఆ మాటకొస్తే మన రాష్ట్రప్రభుత్వానిదీ అదే తీరు. అవసరమైనపుడల్లా ప్రజలను తప్పుదోవ పట్టించే పై పై విమర్శలే తప్ప, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఏనాడూ ప్రశ్నించకపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఫెడరల్ వ్యవస్థపై దాడికి పూనుకుంటున్న కేంద్రవైఖరిపై నోరెత్తలేని పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలది! ప్రజల ప్రయోజనాలకన్నా మించిన ప్రాధాన్యతలు ఈ ప్రభుత్వాలకేమున్నాయి? ఈ విషయంలో కేరళను చూసైనా నేర్చుకోవాలి. ఆధునిక కేరళ నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న పాత్ర అనిర్వచనీయమైనది.
భౌగోళిక పరిస్థితుల రీత్యా పారిశ్రామికీకరణకు కేరళ అంత అనువైనది కాకున్నా. పారిశ్రామికాభివృద్ధికి అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నది. భూమి దొరకడం అక్కడొక పెద్ద సమస్య. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ పరిశ్రమలను పెంపొందించేందుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్థిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. వరి, రబ్బరు, కొబ్బరి, కాయగూరలు వంటి ప్రధాన పంటలకు కనీస మద్దతుధర ఇచ్చిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది కేరళే. రాష్ట్ర అవసరాలకు సరిపడా తిండిగింజల ఉత్పత్తిని పెంచడం కోసం 'సుభిక్ష కేరళం' కింద వరి పండించే రైతులకు హెక్టారుకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల నగదు సహాయాన్ని నేరుగా అందిస్తున్నది. పాడి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా గత మూడేండ్లలో పాల ఉత్పత్తుల దిగుమతులను 9లక్షల లీటర్లనుండి 3.2లక్షల లీటర్లకు తగ్గించుకోగలిగింది. రవాణా రంగంలో వెనుకబాటును అధిగమించేందుకు సిల్వర్ లైన్ సెమీ హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి పూనుకుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఒక వైపు పోరాడుతూనే, మరో వైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన వనరులను సహకార బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి, బయట నుంచి పెట్టుబడుల ద్వారా సమీకరిస్తున్నది. తద్వారా లక్షలాది మందికి ఉపాధి చూపుతూ ప్రజల కోసమే ప్రభుత్వమని చాటుతున్నది. వైశాల్యపరంగా చూస్తే కేరళ చిన్న రాష్ట్రమే కావచ్చు. కానీ, అది దేశానికి ఇస్తున్న సందేశం చాలా గొప్పది. ప్రభుత్వ రంగ పరిరక్షణకు కేరళ అనుసరిస్తున్న మార్గం ఎంతైనా అనుసరణీయం.