Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేవుడుసచ్చినట్టు కాగితం ఎవలు రాసి ఇత్తరు? జోగినిగా చేసి ఇంట్లో నుంచి పంపిండ్రు చేతనైనన్ని రోజులు బతికినం. ఇక చేతకావట్లే. పింఛన్ అడిగితే ఎట్ల ఇయ్యాలే అని అధికారులు అడుగుతుండ్రు. వితంతు పింఛన్ అంటే మొగుడు సచ్చినట్టు కాగితం అడుగుతుండ్రు. దేవునికిచ్చి పెండ్లిచేసిరి. ముసలోళ్లకు ఇచ్చే పింఛనైనా ఇస్తలేరు'' ఇది జోగినిగా మారిన బాలమ్మ ఆవేదన. పురుషస్వామ్య దాష్టీకానికి, కులవ్యవస్థ వికృత స్వరూపానికి, గొప్పగా చెప్పుకునే మన సంస్కృతిలోని అమానవీయతకు నిలువెత్తు ప్రతీక ఈ జోగిని వ్యవస్థ. ప్రభుత్వాలు ఒకపక్క ఈ వ్యవస్థను రూపు మాపాలని చట్టాలు చేస్తాయి. మరో పక్క అవే ప్రభుత్వాలు జోగినీ చెప్పే 'రంగా'నికి రాజధాని నగర నడిబొడ్డునే అధికారయుతంగా సకల ఏర్పాట్లు చేస్తాయి. ఈ ద్వంద్వ వైఖరిని ఎట్టా అర్థం చేసుకోవాలి? ఈ వ్యవస్థలో ఇంకా వేలాదిమంది దళిత ఆడపడుచులు మగ్గుతున్నారు. దాని కబంద హస్తాలనుంచి బయటపడి... బతుకుపోరులో అల్లాడిపోతున్నవారు మరెందరో!
5జి స్పీడ్‌తో ప్రపంచం పరుగులు పెడుతున్న ఆధునిక కాలంలో కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక జాఢ్యం జోగిని వ్యవస్థ. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఆ ఆచారం పేరుతో అమాయకపు ఆడపిల్లల్ని బలి చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య కులాల పెద్దలు ఒక మహిళపై లైంగికదాడి చేసి ఊరు ఉమ్మడి వేశ్యగా మార్చాలి అని అనుకుంటే చాలు పీడిత, శ్రామిక యువతిని జోగినిగానో, దేవదాసిగానో, మాతంగిగానో మార్చేవారు. ఇది ఆధిపత్య కులాల వారి దుర్మార్గం! జోగినీలకు కనీస ఆదరణ కూడా కరువే. గ్రామాల్లోని అనేక దేవాలయాల్లో పూజారులకు దీపం పెట్టేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి జీతం ఇస్తున్న ప్రభుత్వం, దేవుని భార్యలైన జోగినిలను మాత్రం పస్తులే ఉంచుతోంది. ఇదెక్కడి న్యాయం? కటిక పేదరికంలో కనీస అవసరాలు కూడా తీరని ఈ ఊరుమ్మడి స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే అవమానాలు, అవహేళనలకు లెక్క లేదు. తండ్రి వైపు నుంచి గుర్తింపులేని వీరి పిల్లలు సమాజంలో ఎదుర్కొనే పరాభవాలకు అంతే లేదు. వారికి స్కూలు అడ్మిషన్ దగ్గర నుంచి ఎదురయ్యే అవమానాలకు ఏ నేరం చెయ్యని ఆ పిల్లలు పొందే మానసిక హింస మాటల్లో చెప్పలేనిది. వారి జీవితకాలపు దు:ఖానికి పరిహారం ఎప్పుడు దొరుకుతుంది?
ఆవు మాంసం తింటే ఆవు తల్లిలాంటిది - ''అమ్మను ఎలా కోసుకుని తింటావురా?'' అని అంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు. మహిళల్ని జోగిని పేర దేవునికి ఇచ్చి పెండ్లి చేసి, దేవుడు తండ్రితో సమానం అని అంటున్నారు. నిజమే మరి దేవుడు తండ్రి అయితే, జోగిని అమ్మ కాదా? మరి అమ్మతో ఊరిజనం ఎట్లా కూడతారురా? మతం, రాజకీయం, ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళకు పాలకుల అండదండలు అందడంతో వారికి ధీమా పెరుగుతూ ఉంది. గుళ్ళలోకి లాక్కుపోయి అత్యాచారం చేస్తే విషయం బయటికి పొక్కదని కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. కొంత కాలం క్రితం ఆసిఫా విషయంలో అదే జరిగింది. ఆసిఫానే కాదు అలాంటి పసిపాపలపై లైంగికదాడులు చేసి, పాశవికంగా చంపేసిపోయే ''పవిత్ర భక్తులు'' పెరిగిపోతున్నారు. అంటే జరుగుతున్నదేమిటి? మనువాదం, పాలకుల అండదండలతో వేయి పడగలతో విస్తరిస్తోంది.
జోగినీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి. కాని, వ్యవస్థను మార్చే చర్యలు మాత్రం శూన్యం. అందుకే ఈ వ్యవస్థ సమాజం మొహం మీద మాయని మచ్చగా ఇంకా మిగిలే ఉంది. జోగినీ స్త్రీలు, వారి బిడ్డలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండవు. ఉండడానికి ఇల్లు ఉండదు, రమ్మనే, పొమ్మనే బంధువులుండరు. కొంతమంది జోగినీలు బిచ్చమెత్తుకుని బతుకుతున్నారు. వితంతు పెన్షన్‌కి గానీ, మరొక రకమైన రాయితీలకు గానీ అర్హులు కాకుండా అడ్డుపడే వీరి గుర్తింపు ఆ స్త్రీల మెడలో గుది బండై కూర్చుంది. మధ్య తెలంగాణలో ''మొగుడనేవాడు మనిషైతే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్‌కి అర్హత పొందుతాను, కానీ నా మొగుడు దేవుడైపాయే. ఆడెప్పుడు సచ్చేది, పెన్షన్ ఎప్పుడోచ్చే?'' అని ఆజోగినీ అడిగిన ప్రశ్నకి అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం ఏమని బదులిస్తుంది? ఆమెని సృష్టించిన ఆ మాయదారి వ్యవస్థ బదులు పలకదు... ఒకపక్క ప్రభుత్వాధినేతలే పోతురాజుల్ని, జోగినీలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతర చేస్తూ, 'రంగం' చెప్పించుకుంటుంటే జోగినీల ప్రశ్నలకు బదులేవరిస్తారు.