Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్ అనే ఆంగ్లపదాన్ని మనం రోడ్డు అని తెలుగు చేసుకున్నాం. ఇప్పుడు చదువు వచ్చినా రాకపోయినా అదే పేరు ఖరారయింది. రహదారని ఎవరో కొందరు పనికట్టుకుని పిలవటం తప్ప, రోడ్డు అనేది తెలుగు భాషలో స్థిరపడిపోయినపదం. రోడ్డనగానే డాంబరు రోడ్డు, సిమెంటురోడ్డు, కంకరతో వేసిన మట్టి రోడ్లు గుర్తుకు వస్తాయి. రోడ్డు అనేది నాగరికతకు ఆనవాలుగా మారిపోయింది. అది ఊళ్ళకూ ఊళ్ళకూ మధ్య అనుసంధాన కర్త. దూరపు కాలాన్ని తగ్గించిన సాంకేతికత. ప్రదేశాలను తాళ్ళతో కట్టేసిన అనుబంధ సరము. ఏమైనా... కలిపే గుణమున్నది రోడ్డుకి. వీడిపోవటానికీ అది మార్గదర్శే. అయితే నిలదీయటానికీ, నినాదానికీ నికరమైన వేదికా రోడ్డే. అనేక ఆధునిక జీవితాల ధైన్యస్థితికి అద్దం పట్టేదీ రోడ్డే.
వాడి బతుకు రోడ్డున పడిందిరా అంటాం కదా! అంటే రోడ్డే దిక్కయింది అని అన్నట్టు. నిజంగానే దిక్కుమొక్కులేని వారికి దిక్కయ్యేది రోడ్డే. ఏ రోడ్డున వెళ్ళాలో తెలియని వాళ్ళు నాలుగు రోడ్ల కూడలిలో చేరి సంశయిస్తూ ఉంటారు. ఒక రోడ్డు అనేక ప్రభావాల్ని కలిగిస్తుంది, అనేక పరిణామాలకు హేతువై నిలుస్తుంది. రోడ్డుండటం మంచిదే కానీ, పల్లెకు రోడ్డు పడగానే పల్లె రూపమే మారిపోయి అనేకానేక నగర వ్యాపార సంస్కృతితో పాటు మానవ సంబంధాలను ఎట్లా విచ్ఛిన్నం చేసిందో తెలుపుతూ ఒక నాటకమూ వచ్చింది. కాబట్టి రోడ్డును తేలికగా తీసుకోవద్దు. దాని వెంట ప్రవహించే సంస్కృతి ఎంతో ఉంటుంది. పరిణామం చెందుతున్న మనిషి మానసికతను ఎక్స్రే తీసి చూపెడుతుంది.
రోడ్డుపై మనం పయనిస్తామా, రోడ్డే మనల్ని నడిపిస్తుందా! ఇదో మనోవైజ్ఞానిక చర్చ. ఎన్నో చిత్రాలకు, జీవన గమనాలకు వేదికగా నిలిచే రోడ్డును గురించి కావ్యాన్నే వెలువరించొచ్చు. బతుకు దెరువుకు దారులు చూపిస్తుంది. బతకలేని వారికి ఓదార్పు అయి నిలుస్తుంది. ఇంట్లో తగవు తీరకపోతే రోడ్డే గతౌతుంది. చదువుకున్నా ఉద్యోగం దొరకని యువత, తండ్రికి భారంగా మారితే వాళ్ల చూపులన్నీ రోడ్డెక్కుతాయి. కళ్ళు సరిగా కనపడని, కాళ్లూ చేతులూ ఆడని వయసుపైబడ్డ వారికి రోడ్డు దాటడం పెద్ద పరీక్ష. మనుషులకయినట్టుగానే రోడ్డుకూ గాయాలవుతాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లాలి మనం. లేదంటే మనకూ గాయాలు చేస్తుంది. వలస జీవుల కన్నిటి పాదాలకు చేతులు పడుతుంది. వారి జీవన గమనాలకు గమ్యాన్ని వెతికి పెడుతుంది. నునుపైన నల్లని తీవాచీ లాంటి రోడ్డు, తెల్లని మేఘపు తీగలాంటిరోడ్డుపై అప్పుడప్పుడూ ఎర్రని రుధిర ప్రవాహమూ ముంచెత్తుతుంది. రక్తసిక్తమై గుండె పగులుతుంది. కొందరి జీవితాల చివరిమాటలను రికార్డుచేస్తుంది రోడ్డు. భయానక బీభత్సాలకు నెలవవుతుంది. వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడినా అతివేగంగా ప్రాణాలకు ముప్పుతెచ్చినా రోడ్డే సజీవ సాక్షిగా నిలబడుతుంది.
అధికారపు నిరంకుశ విధానాలనూ రోడ్డు అడ్డుకట్టలా దిగ్బంధనం చేస్తుంది. అహంకారపు మాటలకు నిరసన గళ సమ్మర్థన స్రవంతియై పరుగెత్తుతుంది. బాధితుల సమస్యను బ్యానరైటంగా మార్చి దేశపు ఎజెండాగా నిలుస్తుంది. శ్రామికుల న్యాయమైన కోర్కెల సాధనకు రోడ్డు ఒక పోరాట స్థలం. దోపిడీకి వ్యతిరేకంగా కదం తొక్కే కార్మిక కదన క్షేత్రం. రోడ్లపై సీలలు పాతినా, ముళ్లకంచెలు వేసినా, గోతులు తవ్వినా, బండరాళ్లు పరచినా అక్కడ తలలెత్తేవి నినాదాలే, ప్రతిఘటనా సమూహాలే. ఘాజీపూర్ రోడ్డువైపు వెళ్లి చూడండి ఎన్నెన్ని అనుభవాలు పంచుతుందో! సింఘు, టిక్రి వైపున్న రోడ్లను అడగండి మత్తగజాలను తుత్తునీయలు చేసిన ముచ్చట్లెన్నో అందిస్తాయి. లఖింపూర్ రోడ్డును వినండి... మన నేతల కుతంత్రాలను వివరిస్తుంది.
రోడ్డుకు తరతమ బేధం లేదు. నువ్వెందుకోసమైనా నిర్మించవచ్చుగాక, అందరినీ అంతే సమానంగా చూస్తుంది రోడ్డు. అందుకే మొన్న ప్రధానిని సైతం పంజాబ్లో ఫిరోజ్పూర్ రోడ్డు నిరభ్యంతరంగా నిలిపేసింది. హుస్సేని వాలా ఫ్లైఓవర్ రోడ్డుని తేలికగా తీసుకున్నారో, పకడ్బంధీగా సానుభూతికై ప్రణాళికలే వేసారో... ఏదైతేనేమి! రోడ్డు నిలువరించిన దేశనేతగా చరిత్రకెక్కారు. ''ఎవరికోసం చచ్చారు?'' అన్న అహంకారాన్ని కొద్దిగానైనా తగ్గించి వెనుతిప్పి పంపింది రోడ్డు.
అందుకే రోడ్డు ఇప్పుడు ఓ రాజకీయ కురుక్షేత్రం. ఎత్తుగడలకు వ్యూహాలకు ప్రధాన ప్రతీకార క్షేత్రం. ప్రజల మనోభావాల ప్రకటనకు అచ్చొత్తని పత్రిక రోడ్డు. నియంతలను వెనక్కు పంపే తిరుగుబాటు రోడ్డు. నువ్వు రోడ్డుని నీ కోసమే నిర్మించుకొని ఉండొచ్చు. పెట్టుబడి ప్రవాహానికి సరళీకృతంగా ఏర్పడవచ్చు. ఉదారపు నిగనిగలు పరచవచ్చు. అవే జన సామాన్యానికి ఆయుధమై నిలుస్తున్నాయి. ఆసరాగా మెరుస్తున్నాయి. నువ్వు రోడ్డున పడేసిన వారి ఆవేదనలే నిన్నూ రోడ్డున పడేస్తాయి. సత్యాలేవో తేటతెల్లం చేస్తాయి!