Authorization
Mon Jan 19, 2015 06:51 pm
5,6,7 & 7,8,9. ఇది అంకెల గురించీ, సంఖ్యల గురించీ కాదు, తేదీల గురించి మాత్రమే కాదు. రెండు ఆలోచనల గురించి. రెండు ప్రాపంచిక ధృక్పథాల గురించి. రెండు వర్గ ప్రయోజనాల గురించి. మొదటిది, మత ప్రాతిపదికన దేశాన్ని నిలువునా చీల్చేది. ఆ రకంగా కార్పొరేట్లు తమ లాభాల పంట పండించుకునేది. రెండవది, నాడు బిటిష్ సామ్రాజ్య దోపిడీని ప్రతిఘటించిన రీతిలోనే నేడు దేశ, విదేశీ కార్పొరేట్ల దోపిడీ దౌర్జన్యాలపై పోరు జెండా లెత్తేది. కార్మికుల్ని, కర్షకుల్ని, ఇతర శ్రమజీవుల్ని ఐక్యం చేసేది. స్థూలంగా ఒకటి చీల్చేది. మరోటి కూర్చేది.
మొదటిది, హైదరాబాద్ శివార్లలో జరిగిన ఆరెస్సెస్ ''అఖిల భారతీయ సమన్వయ బైఠక్'', సర్ సంఘ్ చాలక్, సహ కార్యవాహ్లు మొదలు 36 వివిధ సంస్థలకు చెందిన 216మంది ఆరెస్సెస్ ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరైన సమావేశం అది. రెండవది, సీపీఐ(ఎం) అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ, కేంద్రకమిటీ సమావేశాలు.
ఆరెస్సెస్ సహకార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య విలేకర్ల సమావేశంలో చెప్పిన దాని ప్రకారం ''తమ అంతిమ లక్ష్యం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు సర్వశ్రేష్ట దేశంగా తీర్చిదిద్దటమ''ట. అంటే ఏమిటో అడగడానికి విలేకర్లూ సాహసించలేదు. ఆ డాక్టర్ సాబ్ కూడా చెప్పలేదు. దేశంలో పేదరికాన్ని మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పట్నించీ లెక్కించలేదు. ప్రపంచ బ్యాంక్ డేటాను వినియోగించి ప్యూ రీసెర్చ్ సెంటర్ 2019-20 నుండి 2020-21కి ఒక సంవత్సరంలోనే దేశంలో నిష్టదరిద్రుల సంఖ్య ఆరుకోట్ల నుండి 13.4కోట్లకు పెరిగిందని, ఇది 45సంవత్సరాల క్రితం పరిస్థితికి చేరిందని తేల్చింది. 2021 ముగిసేలోగా అదనంగా మరో 15 నుండి 20కోట్ల మంది గర్భదారిద్య్రంలోకి నెట్టబడతారని కూడా ఆ నివేదిక తేల్చింది. అదంతా విదేశీ శక్తుల కుట్ర అని అరెస్సెస్ కొట్టేసినా, మన నిటి ఆయోగ్ మల్టి డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం బీహార్ జనాభాలో సగానికి మించి (51.91శాతం) పేదరికంలో మగ్గుతున్నారు. దాని వెనుకే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోంలు ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే! ప్రపంచ దేశాల ముందు సర్వోత్కృష్ట దేశంగా తీర్చిదిద్దటమంటే ఇదేనా? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ)లో 116దేశాల్లోనూ భారతదేశం 101వ స్థానానికి చేరింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్లో మనదేశం టాప్లో ఉందని కూడా జీహెచ్ఐ పేర్కొంది. ఇది కూడా విదేశీ కుట్ర అని కొట్టేసేవారికి తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 చిన్న పిల్లల పోషకాహార లేమిగురించి, శిశు మరణాల గురించి మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పింది. బహుశా ఆరెస్సెస్ వారి లెక్కల్లో ఇదంతా ప్రపంచ దేశాల ముందు సర్వశ్రేష్టంగా నిలపడమేనేమో! అయినా మోడీ సర్కార్ మధ్యాహ్న భోజనానికి, ఐ.సి.డి.ఎస్.కు కేటాయింపులు తగ్గిస్తోంటే దానిపై ఆర్ఎస్ఎస్ నోరెత్తదెందుకో?!
''హిందూత్వ వేరు హిందూ మతం వేరు'' అని వేరెవరో చెప్పడం కాదు, సాక్షాత్తూ 1978లో ఆనాటి ఆరెస్సెస్ అధ్యక్షుడు (సర్సంఫ్ుచాలక్) రాజేంద్రసింగ్ నాగపూర్జిల్లా న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ''ఆరెస్సెస్ మతపరమైనదీ కాదు, సేవాదృష్టి కలిగినదీ కాదు'' అన్నారు. ఈనాడు ఆరెస్సెస్ వందలాది సంస్థలను నిర్వహిస్తున్నది. వాటిలో ఈ దశలో అవసరమైన 36 సంస్థలను మాత్రం ఆహ్వానించి మొన్న మీటింగ్ జరిపారు. రానున్న రోజుల్లో ఏ రూపంలో ఉపద్రవం ముంచుకొస్తుందో!? ఇప్పటికే ఆవుపేరున ముస్లింలు, దళితులపై 2015నుండి దాడులు జరుగుతున్నాయి. అంతకు ముందు స్థానికంగా ఎన్నో జరిగుంటాయి. మత మార్పిడుల పేరున క్రైస్తవులపై దాడులు సాగుతున్నాయి. మొన్న మోడీని పంజాబ్లో అడ్డుకున్నారనే మిషతో మోడీ ఒంటిపై చిన్న గీతపడ్డా 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు మించి చూస్తారని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఆకలి, నిరుద్యోగం, పేదరికం వంటివి వారికి పట్టవు.
బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో సంపూర్ణంగా విలీనమైన శక్తుల వారసురాలు సీపీఐ(ఎం). దేశ స్వాతంత్ర పరిరక్షణకు, దాని ఆర్థిక స్వాలంబనకు సమగ్రతకు అంకితమైన పార్టీ సీపీఐ(ఎం). అమెరికా విషకౌగిల్లోకి ఈ దేశాన్ని మోడీ సర్కార్ తీసుకుపోతున్న విషయం 7 - 9 తేదీల్లో జరిగిన కేంద్ర కమిటీ చర్చలోకొచ్చింది. మన ప్రభుత్వరంగ పరిశ్రమలను బఠాణీల్లా అమ్మేస్తున్న విధానాన్ని, రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్న విధానాలను సమీక్షించింది. ఆ విధానాల ప్రతిఘటనకు అవలంబించాల్సిన వ్యూహానికి తుదిరూపమిచ్చింది. ఆసేతుహిమాచలం సభ్యులు, సామాన్య ప్రజలు సైతం చర్చించి రూపొందించే విధానరూపకల్పనకు హైదరాబాద్ కార్యక్షేత్రమయ్యింది. ప్రజాస్వామ్యమంటేనే తెలియని ఆర్ఎస్ఎస్కు ఈ విషయాలేమర్థమవుతాయి? వారికి తెలిసింది మనుషుల్ని చీల్చడం, వ్యవస్థల్ని కూల్చడం!!