Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త ఏడాది ప్రారంభమై పట్టుమని పదిరోజులైనా కాలేదు. అప్పుడే రాష్ట్రంలో పది మంది ఉపాధ్యాయులు, రాజకీయ వేధింపులతో ఒక కుటుంబం, అప్పుల భాదతో మరో కుటుంబం అర్థాంతరంగా తమ జీవితాలను ముగించుకున్నారు. నిన్నటికి నిన్న ఖమ్మంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే ''చావుభయం కన్నా బతుకు భయమే అధికంగా ఉంది. ప్రాణాన్ని తాకట్టు పెట్టి జీవితాన్ని అప్పుగా తీసుకున్నా. అప్పుకోసం.. తలుపు తడితే, నాప్రాణాన్నే తీసుకో అంటా''.. అంటూ కృషీవలుడులో దువ్వూరి రామిరెడి రాసిన
''మరణ భయంబునాకు అణుమాత్రము లేదు'' అనే పద్యం గుర్తుకు వస్తోంది.
మరి ఈ పరిస్థితికి కారణాలేమిటీ? వ్యక్తిగతమా? సామాజికమా? తప్పుప్రజలదా? పాలకులదా? పాలకులు అనుసరిస్తున్న విధానాలదా? ఈ ప్రశ్నలకు సమాధానాల సంగతి అటుంచితే ఆత్మహత్య సరియైనది కాదనడంలో మరో ఆలోచనకు తావు లేదు. కానీ అవి మన దేశానికి సహజాతాలుగా మారిపోయాయి. గత కొన్నేళ్లుగా దేశంలో రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలే వినేవాళ్ళం. అవి క్షణికావేశంతో వేసిన అడుగులు కావు. జీవితాలు అప్పుల సుడిగుండాల్లో చిక్కుకుంటున్నాయి. బతికే మార్గాలు మూసుకుపోతున్నాయి. అంతిమంగా ఈ నిర్ణయాలకు దారి తీస్తున్నాయి. కాగా ఇప్పుడు అన్ని రంగాలలో అన్ని వర్గాలలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉపాధ్యాయుల మెడలో స్థానికత గుదిబండలా మారడంతో ఈ జాబితాలోకి ఉపాధ్యాయులు కూడా చేరారు. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఈ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జీవితంతో పోరాడలేక, సమస్యలను ఎదుర్కోలేక, పాలకుల పాశవిక ధోరణి భరించలేక, చీకట్లో బతకలేక ఈ దారుణ నిర్ణయానికి వస్తున్నారు. ఒకదేశంలో ప్రజలు ఆత్మహత్యల పాలవుతున్నారంటే ఆ దేశాన్ని కచ్చితంగా బలహీనదేశంగానే పరిగణించాలి.
నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తరువాత ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలు వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకుంటున్నాయి. దీంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతుల ఆత్మహత్యలకు కనీస మద్దతు ధర లభించకపోవడం ఒక కారణమైతే, మరోకటి పండించిన పంటను ప్రభుత్వాలు సేకరించకపోవడం. ఈ రెండింటి కారణంగా వ్యవసాయం దెబ్బతింటోంది. ఎంఎస్ఎంఈలు దివాళా తీస్తున్నాయి. కనీసం వీటికి బ్యాంకుల రుణాలు సైతం అందడం లేదు. దీంతో సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. తాజాగా మిర్చికి తామర తెగులు వచ్చి లక్షల్లో నష్టం వాటాల్లుతోంది. ఈ సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కనీసం అటువైపు తొంగి కూడా చూడటం లేదు. ఎంఎస్పీపై కేంద్రాన్ని రాష్ట్రాలు అడగటం లేదు. 2014 ఎన్నికలలో గెలిస్తే ఒకటిన్నర రెట్లు ఎంఎస్పీ అని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఆ మాటే మేం అనలేదని సర్వోన్నత న్యాయస్ధానానికే అసత్యాలు తెలిపింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానంతో అధికార పీఠమెక్కిన మోడీ ఏలుబడిలో నిరుద్యోగిత రేటు గత నలభై ఎండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ విధానాల ఫలితమే ప్రభుత్వ రంగం ప్రభను కోల్పోయి ప్రయివేటు రంగం పుంజుకోవడం. దీనితో అనేక లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారు బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారు. ఇందుకు కారకులెవరు?
విఫల ప్రేమలూ, కుటుంబంలో కలహాలు, పరీక్షల్లో తప్పడం వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడటం గతం నుంచే ఉండేది. వ్యాపార నష్టాలు, వ్యవసాయం దెబ్బతినడం వంటిది ఆధునిక ప్రేరకాలు. ఇవి రెండూ ప్రభుత్వాలు నియంత్రించదగ్గవే. కానీ, అందుకు సంబంధించిన చర్యలు ఒక్కటి చేపట్టడం లేదు సరి కదా, కాస్తో, కూస్తో ఆసరాగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నారు. దోపిడీవ్యవస్థలో దోపిడీశక్తులకు ప్రభుత్వం అండగా నిలబడినప్పుడు దోపిడీశక్తులు- ప్రభుత్వం ఒకటే అయినప్పుడు ప్రజలను నిరాశ ఆవహిస్తుంది. ఒక్కొక్కసారి లోతుగా ఆలోచిస్తే.. ఈదోపిడీ వ్యవస్థ కావాలని ప్రజలలో పిరికితనం పెంచుతున్నట్టు కనిపిస్తుంది. అన్నీ ప్రయివేటీకరణ చేయాలనే పాలసీ వెనుక కూడా అదే కుట్ర కనిపిస్తుంది. యావత్ ఉత్పత్తి రంగాన్ని, విక్రయ రంగాన్ని అంబానీలకూ, అదానీలకూ అప్పగించటంలో దాగి ఉన్నది కుట్ర కాకపోతే ఏమిటి? చిన్నచిన్న వ్యాపారులేమి కావాలి? బతకలేక.. పిల్లలను పెంచలేక.. సంసారం ఈదలేక ఏమవుతారు? ఆత్మహత్యల వెనుక ప్రభుత్వాల కుట్ర, దోపిడీ వ్యవస్థ లక్షణాలున్నాయి అనడానికి ఇవి ఓ ఉదాహరణ మాత్రమే. ఎందుకీ ఆత్మహత్యలు? ప్రశ్నిద్దాం.. పోరాడుదాం.. ఆత్మహత్యలు చేసుకోవటమంటే దోపిడీ వ్యవస్థకులొంగటమే. పుండోదిక్కున ఉందంటే మందో దిక్కున పెట్టే అలవాటు మన వ్యవస్థది. దీనిని చక్కదిద్దాల్సిన బాధ్యత పౌరసమాజానిది.