Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్ కరై సో ఆజ్... ఆజ్ కరై సో అబ్... (రేపటి పని ఈరోజు చెయ్యి, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి...) అని కబీర్దాస్ ప్రవచించారు. ప్రతీ దానికి రివర్స్‌గా మాట్లాడే కమలనాథులు... కబీర్ హితోక్తులను కూడా రివర్స్‌లో అర్థం చేసుకున్నారు కాబోలు. అందుకే ఎప్పుడో మాట్లాడి సరి చేయాల్సిన అంశంపై అప్పుడు నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు వ్యవహరించిన కాషాయ నాయకులు ఇప్పుడు మాత్రం నానా యాగీ చేస్తున్నారు. తద్వారా తామే సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్నామంటూ తెగ ఫోజులు కొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజన, స్థానికత అనే అంశానికి సంబంధించి టీఆర్ఎస్ సర్కారు విడుదల చేసిన 317 జీవో గురించి (దాని లోపాలు, లోతుపాతులు, ఇబ్బందులు మనకందరికీ తెలిసినవే) వారిప్పుడు రోడ్ల మీదికి రావటమే ఒక వింతయితే... తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ జీవోలోని అంశాల్లో మార్పులు, చేర్పులు చేస్తామంటూ ప్రకటించటం అంతకు మించిన విడ్డూరం.
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు... 317 జీఓ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో జాగరణ చేపట్టిన సంగతి మనకెరుకే. ఆ తర్వాత మహబూబ్‌నగర్, వరంగల్‌లో ఆ పార్టీ అధ్వర్యాన ఇదే అంశంపై పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్, అసోం సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, హిమాంత బిశ్వా శర్మతోపాటు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ జుగ్ సైతం రాష్ట్రానికి అరుదెంచారు. బండి సంజరును ఇంద్రుడు, చంద్రుడు, అరివీర భయంకరుడంటూ వారు ఆకాశానికెత్తిన వైనాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది.
ఇక్కడ మనం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే... 317 జీవోపై ఉత్పన్నమైన సమస్యలను బీజేపీ రాజకీయంగా ఉపయోగించు కోదలుచుకున్నదే తప్ప వాటి పరిష్కారంపై ఆ పార్టీకి ఎంతమాత్రమూ చిత్తశుద్ధి లేదని విదితమవుతున్నది. ఎందుకంటే ఉద్యోగుల విభజన, స్థానికత తదితరాంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినప్పుడుగానీ, వాటిని కేంద్ర హోంశాఖ, క్యాబినెట్ ఆమోదించినప్పుడుగానీ కమలం పార్టీ నుండి సడీ చప్పుడు లేదు. వాటిలో ఏ ఒక్క అంశానికి కూడా సవరణను అది సూచించలేదు. ఆ తర్వాత 2018 ఆగస్టు 29న రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసినప్పుడు కూడా ఆ పార్టీ స్పందించలేదు. వీటన్నింటినీ విస్మరించి, ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తి, ఆగ్రహావేశాలను సొమ్ము చేసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో బీజేపీ పావులు కదుపుతున్నది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యానాల్లోనూ కుటిలబుద్ధి బయటపడుతున్నది. 'మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 317 జీవోలో మార్పులు, చేర్పులూ చేస్తాం. తద్వారా ఉద్యోగులకు ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరిస్తాం...' అంటూ కమలం నేతలందరూ తొడగొట్టి మరీ చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తామేం చేస్తారో మాట మాత్రం కూడా చెప్పటం లేదు. తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. వారిలో ఒకరు కేంద్ర మంత్రి కూడా. ఇంత అధికారం, కేంద్రంతో సయోధ్య నడపగల అవకాశం ఉండి కూడా వారు 317 జీఓపై మౌనం దాల్చటం గమనార్హం. 'మేం ఉద్యోగులకు అండగా ఉంటాం. కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. అందువల్ల జీవోలో మార్పులు చేసేందుకు వీలుగా మరోసారి రాష్ట్రపతికి పంపాలని కోరుతాం. ఇందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతాం...' అని ఆయా నేతలు వక్కాణిస్తే వారి మెళ్లో మనం దండేసి దండం పెట్టొచ్చు. కానీ ఆ నాయకగణం ఆ మేరకు ఒక్క ప్రకటనా చేయకపోవటం ఇక్కడ గమనార్హం. ఉద్యోగుల స్థానికత, విభజన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దూరదృష్టి కొరవడటం, సరైన ప్రాతిపదిక లేకుండానే జోన్లను ఏర్పాటు చేయటం, అందరితో సమగ్రంగా చర్చించి, ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో మదింపు చేయకపోవటం తదితర కారణాల రీత్యా ఇప్పుడు ఈ సమస్య జఠిలమై కూర్చుంది. ఫలితంగా 22,500 మంది ఉపాధ్యాయులు, 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందువల్ల కాషాయ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలకు చేతనైతే... ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. తద్వారా తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. లేదంటే ఇప్పుడు వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు.. ఫక్తు డ్రామాలనే విషయాన్ని జనం తొందరలోనే గ్రహిస్తారు.