Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్‌లో జెలెన్స్కీ ఆధ్వర్యంలోని మితవాద ప్రభుత్వాన్ని రష్యాకు వ్యతిరేకంగా ఎగదోస్తూ అమెరికా, యూరప్ దేశాలు, వాటి అధీనంలోని ప్రచార బాకాలు అదే పనిగా అసత్య ప్రచారం సాగిస్తున్నాయి. రష్యాయేమో దురాక్రమణదారుగాను అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ప్రపంచ శాంతి పరిరక్షకులుగాను అవి చూపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యాన్ని, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సామ్రాజ్యవాద దేశాలు ఎంత ఘోరంగా విఫలమైందీ యావత్ ప్రపంచం గమనించింది. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా 11.53 కోట్ల కేసులు, 1.89 కోట్ల మరణాలతో జి-7 దేశాలు రికార్డుకెక్కాయి. కొత్తగా ముంచుకొస్తున్న ఒమిక్రాన్ విషయంలో ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే యూరప్‌లో ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చేసిన హెచ్చరిక పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయంతో బాటు దశాబ్దాలుగా అమలు చేస్తూ వస్తున్న నయా ఉదారవాద విధానాలు సృష్టించిన ఆర్థిక ఉత్పాతం వీటిని ఇంకా వెన్నాడుతూనే ఉంది.
అదే సమయంలో చైనా, రష్యా అన్ని రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయి. సామ్రాజ్యవాద దేశాల పెత్తనాన్ని ఇవి బాహాటంగానే సవాల్ చేయడం, బహుళ ధ్రువ ప్రపంచం దిశగా పరిణామాలు చోటు చేసుకుంటుండడం సంపన్న దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. చైనా, రష్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దేశాలు పావులు కదుపుతున్నాయి. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం పేరుతో చైనాపై దాడి చేస్తున్న జి-7 దేశాలు, రష్యాపై దాడికి ఉక్రెయిన్ను సాకుగా చూపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే ఊరుకునేది లేదని ఈ కూటమి ప్రతినిధులు లివర్‌పూల్ నుంచి ఒక ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని 2014లో కుట్ర ద్వారా కూల్చివేసిన అమెరికా ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. యనుకోవిచ్ చేసిన నేరమేమిటి? ఇ.యు, ఐఎంఎఫ్ డిమాండ్ చేసిన పొదుపు చర్యలను అమలు చేసేందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఆయన, రష్యా సహాయాన్ని కోరారు. దీనిని సహించలేని అమెరికా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫాసిస్టు శక్తులను ఎగదోసింది. ఆ తరువాత వచ్చిన మితవాద ప్రభుత్వం ఉక్రెయిన్ కమ్యూనిస్టు పార్టీతో సహా ప్రతిపక్ష రాజకీయ పార్టీలపైన నిషేధం విధించింది. ఉక్రెయిన్‌లో 40శాతానికి పైగా ప్రజలు మాట్లాడే రష్యన్ భాషను నిషేధించడం, ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రష్యన్ తెగలను క్రూరంగా అణచివేయడం వంటి ఫాసిస్టు చర్యలకు పాల్పడింది.
రష్యన్ జనాభా ఎక్కువగా ఉన్న డాన్బాశ్చ్, లుగానెట్క్స్ ప్రాంతాల్లో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ నాజీలను తలపించింది. అటువంటి ఫాసిస్టు ప్రభుత్వానికి అమెరికా బాహాటంగా మద్దతిస్తున్నది. దానికి అండగా నాటో సేనలను ఈ ప్రాంతానికి తరలించింది. ప్రత్యర్థుల పన్నాగాలను గమనించిన రష్యా తన సరిహద్దుల్లో సైన్యాలను అప్రమత్తం చేస్తే దానిపై అమెరికా నానా యాగీ చేస్తున్నది. రష్యా తన సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తే దురాక్రమణకే అంటున్న అమెరికానే అతి పెద్ద దురాక్రమణదారు. అమెరికా ప్రపంచ వ్యాపితంగా 700కి పైగా సైనిక స్థావరాలను నెలకొల్పింది. అదీగాక నల్ల సముద్రం చుట్టూ ఉన్న పోలండ్, చెక్, హంగరీ, ఇతర ప్రాంతాల్లో సైన్యాన్ని, ఆయుధాలను అమెరికానే మోహరించింది. ఉక్రెయిన్ నుంచి ప్రయోగిస్తే ఆరు నిమిషాల్లో మాస్కోను చేరుకునేలా క్షిపణులను సిద్ధం చేసి ఉంచింది. సోవియట్ యూనియన్ పతనమైన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో నాటోను తూర్పు దిశగా ఒక్క అంగుళం కూడా విస్తరించబోమని అమెరికా హామీ ఇచ్చింది. ఇప్పుడు దానికి కూడా తూట్లు పొడిచి తూర్పు యూరప్‌లోని లాత్వియా, లిథువేనియా, వంటి దేశాలను నాటోలో చేర్చుకుంది. బెలారస్ అందుకు తిరస్కరించడంతో ఆ దేశంపై ఆంక్షలు విధించింది.
ఉక్రెయిన్ను తన గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా యూరోపియన్ దేశాలకు రష్యా గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టును అడ్డుకోవడం అమెరికా పన్నాగంలో భాగం. తద్వారా అమెరికన్ ఇంధన కంపెనీలకు లాభం చేకూరేలా చూసుకుంటున్నది. మధ్య ప్రాచ్యంలో సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా పన్నిన పన్నాగాన్ని ఇరాన్‌తో కలసి రష్యా సమర్థవంతంగా తిప్పికొట్టడం, వెనిజులా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను చైనాతో కలసి రష్యా గట్టిగా వ్యతిరేకించడాన్ని అమెరికా సహించలేకపోతున్నది. బైడెన్ పుతిన్‌తో జరిపిన ఫోన్ సంభాషణల తరువాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. మధ్య ప్రాచ్యంలో ఇంధన వనరులపై ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అయితే, అమెరికాతో ఢ అంటే ఢ అనడానికి చైనా. రష్యా సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రధాన అణు సంపన్న దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తే ప్రపంచ శాంతి, సుస్థిరత తీవ్ర ప్రమాదంలో పడతాయి. సమస్యను అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం చర్చల ద్వారా పరిష్కరించు కోవాలే తప్ప ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అమెరికాకు తగని పని.