Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రులూ ఎమ్మెల్యేలంతా వరుసబెట్టి వలసబోతుంటే ఈ సంక్రాంతి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది కమలనాథులకు. మరోసారి యూపీని గెలుచుకోవడం ద్వారా ''ఢల్లీీ''ని నిలుపుకోవాలన్న బీజేపీ వ్యూహాలకు స్వపక్షం నుండే సవాళ్ళు ఎదురవుతున్నాయి. మొన్న స్వామి ప్రసాద్ మౌర్య, నిన్న దారాసింగ్ చౌహాన్, ఇప్పుడు ధరంసింగ్ సైనీ... ముగ్గురు కీలక నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేసి, పార్టీని వీడి సమాజ్‌వాదిపార్టీలో చేరడం వారికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వీరిని అనుసరిస్తూ పలువురు ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతుండటంతో ఈ సంఖ్య పదిహేనుకు చేరింది. ఇది ఇప్పటికే బీజేపీని షాక్‌కు గురిచేస్తుండగా, ఈ షాక్‌లు ఇంకా కొనసాగుతాయంటూ ధరంసింగ్ సైనీ హెచ్చరిస్తున్నారు. ఎన్సీపీ నేత శరద్‌పవార్ సైతం ''బీజేపీని వీడే నేతల వార్తలు లేకుండా ఇకపై రోజు గడవబోదు'' అని పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
చూస్తుంటే బీజేపీ మార్క్ ''సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా'' ఇప్పుడు రివర్స్ గేర్‌లో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. గత 2017 ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ పట్ల నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, అక్కడి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఉపయోగించుకుని రూపొందించిన ఈ ''సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా'' బీజేపీకి ఘన విజయాన్ని సమకూర్చింది. ఈ ఫార్ములాకు ఆకర్షితులైన ఓబీసీలంతా తమ వాటా తమకు దక్కుతుందని భావించి హిందూత్వ శక్తులకు మద్దతిచ్చారు. కానీ, బీజేపీతో ఇన్నేండ్ల ప్రయాణం తరువాత, ప్రస్తుత 2022 శాసనసభ ఎన్నికల నాటికి వారి భ్రమలన్నీ తొలగిపోవడంతో ఇప్పుడు అదే ''ఫార్ములా'' తిరుగబడుతోంది. ఆ ఫలితమే ఈ పరిణామాలంటూ వెలువడుతున్న విశ్లేషణలు యూపీలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ పార్టీని వీడుతున్న నేతలంతా వెనుకబడిన తరగతులకు చెందినవారే కావడంతో పాటు, ఓబీసీల్లో గణనీయమైన ప్రాబల్యమున్నవారు కావడం గమనార్హం.
నిజానికి కేవలం ఓబీసీలు మాత్రమే కాదు, అన్ని తరగతుల ప్రజలూ యోగీ పాలనాతీరుపై అంతే వ్యతిరేకతతో ఉన్నారు. ఈ అస్తవ్యస్థ అసమర్థ పాలనకు యోగి ఎంత కారణమో, బీజేపీ అధిష్టానమూ అంతే కారణమని గుర్తిస్తున్నారు. కరోనా నియంత్రణలో, రోగులకు వైద్యం అందించడంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘోర వైఫల్యాలను గంగానది సాక్షిగా గమనించారు. మత విద్వేషాలూ, మూకదాడులూ, బూటకపు ఎన్కౌంటర్లూ, హత్యలూ - అత్యాచారాలూ, దాడులూ - దౌర్జన్యాలతో శాంతిభద్రతలకు తావేలేని అరాచక పాలనను అనుభవించారు. వీటికి తోడు చారిత్రాత్మకమైన రైతుల న్యాయపోరాటంపై సాగిన దారుణకాండలూ, లఖీంపూర్‌ఖేరీ మారణకాండలూ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో బీజేపీకి వీస్తున్న ఎదురుగాలులు కూడా ఈ వలసలకు ప్రేరకాలనడంలో సందేహమేమీలేదు.
అయితే ప్రతికూలతలెన్నున్నా, ఈ ఊహించని ఎదురుదెబ్బలు కలవరపెడుతున్నా... రేపు ఢిల్లీలో తిరిగి నిలవాలంటే నేడు యూపీని గెలవడం బీజేపీకి అనివార్యంగా మారింది. ప్రధానమంత్రిగా మోడీ పునరాగమనమనేది ముఖ్యమంత్రిగా యోగీ విజయంపైనే ఆధారపడి ఉంటుందన్న అమిత్‌షా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అందుకే ఈ ప్రతికూలతలన్నిటినీ అధిగమించడానికి మత విద్వేషాలే ఏకైక పరిష్కారంగా అది ముందుకు సాగుతోంది. యోగి ఆధిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ''80:20'' పోరాటంగా అభివర్ణించడంలోనే వారి వ్యూహమేమిటో బోధపడుతోంది కదా! రాష్ట్రంలోని హిందూ ముస్లిం జనాభా నిష్పత్తిని దృష్టిలో ఉంచుకునే ఆయనీ వ్యాఖ్యలు చేశారనేది సుస్పష్టం. తమ పాలనా వైఫల్యాల పుణ్యమాని ప్రజాజీవితం ఇంతటి సంక్షోభంలో ఉంటే... వాటి పరిష్కారాల గురించి మాట్లాడకుండా, నిస్సిగ్గుగా ''మనం'', ''వారు'' అనే విభజన రాజకీయాలతో తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మొన్న మోడీ వారణాసిలో కాశీకారిడార్ ప్రారంభించినా, నిన్న హరిద్వార్‌లో మత విద్వేషం బుసలు కొట్టినా, రేపు యోగి ఆధిత్యనాధ్ అయోధ్య నుండి పోటీ చేసినా అవన్నీ ఈ వ్యూహంలో భాగాలే.
ఈ వ్యూహం కేవలం యూపీకే పరిమితమని కూడా అనుకోలేం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ట్రాలకు వ్యాపింపజేస్తారనడంలో సందేహమేలేదు. ఎందుకంటే యూపీకి ముందే గోవాలోనూ మంత్రి మైఖేల్ లోబో, ఎమ్మెల్యే ప్రవీణ్జాంతేలు ఆ పార్టీని వీడారు. వీడుతూ ''బీజేపీ సామాన్యుల పార్టీ కానేకాదని'' కుండబద్దలు కొట్టారు. ఇలా అంతటా ఎదురుగాలులే వీస్తున్న తరుణంలో ఇంతకుమించి వారు చేయగలిగిందేముంటుంది? విద్వేషమే ఓ విధానంగా అమలుచేసే వారి నుండి ఇంతకన్నా ఏం ఆశించగలం? కాకపోతే, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న అసలు సమస్యలను పక్కకు పెట్టి, కలిసివున్న ప్రజల్లో చీలికలు సృష్టించి, తమ అధికారయాగానికి వారిని సమిధలుగా వాడుకోజూడటం ఎంత దారుణం..?! ప్రజలన్నా, వారి జీవితాలన్నా వీరికి అంత చులకనా? అయినా ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా..? ఏం జరుగుతుందో వేచి చూడాలి. మార్చి 7న 'బొమ్మ' రిలీజవుతుంది కదా!