Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్ మీడియా ద్వారా తన తప్పుడు అభిప్రాయాల వ్యాప్తికీ, బిన్నాభిప్రాయాల నియంత్రణకూ బీజేపీ కుట్రలు చేస్తోంది. తన విద్వేష ప్రచారాలనూ కల్పిత కథనాలనూ ప్రజలపై రుద్దే ఆయుధాలుగా తన ఐటీ విభాగాలను ఉపయోగిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ''టెక్‌ఫాగ్'' వివాదం దీనిని మరింతగా రుజువు చేస్తున్నది. ఫోన్ మనదే. మన చేతుల్లోనే ఉంటుంది. కానీ నియంత్రణ మాత్రం మన చేతుల్లో ఉండదు. మనం ఏం చూడాలో, ఏం చేయాలో అదే చెపుతుంది. మనకు తెలియకుండానే మన అభిప్రాయలను అది రూపొందిస్తుంది. మనకు తెలియకుండానే సామాజిక మాధ్యమాలలో ఆ అభిప్రాయాలు అనేక ట్వీట్లు, రకరకాల పోస్టులు, ఇమేజ్‌లు. హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ అవుతుంటారు. వేలల్లో షేర్లు, లక్షల్లో లైక్‌లు కనిపిస్తుంటారు. ఇవన్నీ చూసి ఇన్ని వేలు లక్షల మంది ఈ అభిప్రాయాలు కలిగి ఉన్నారా అనే భావనతో మన ప్రమేయం లేకుండానే వాటి ప్రభావంలో పడిపోతాం. ఇలా తమకు అనుకూలమైన తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లో చొప్పించడానికి బీజేపీ గుట్టుగా ఈ టెక్‌ఫాగ్ యాప్‌ని రూపొందించుకుని వినియోగిస్తున్నది.
స్త్రీని ఆదిశక్తి అని, దేశాన్ని 'భరతమాత' అని గొప్పగా చెబుతారు. అలాంటి 'పవిత్ర' భారతదేశంలో తమను ప్రశ్నించారనే అక్కసుతో స్త్రీలను అవమాన పర్చడానికి 'టెక్ ఫాగ్' వంటి 'విద్వేష కర్మాగారాలు' నడుపుతోంది బీజేపీ. తమను ప్రశ్నిస్తోన్న మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి, వారిపై విద్వేషం పెంచే విధంగా ట్రోల్ చేస్తూ... దేశవ్యాప్తంగా అనేక ఐటీ కర్మాగారాలను నిర్వహిస్తోంది. సంస్కృతి, భారతీయత, నాగరికత వంటి ఉదాత్తమైన భావనల గురించి మాట్లాడే అర్హత ఇటువంటి నీచానికి ఒడిగట్టే వారికి ఉంటుందా? అందుకే 'ఇదొక అనాగరిక పార్టీ' అని బీజేపీ నుద్దేశించి జ్యోతిబసు ఎప్పుడో వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యానికి, విద్వేషానికి చుక్కెదురు. ప్రజాస్వామ్యమంటే... ప్రజలందరి ఉమ్మడి పాలన. అందులో నిర్ణయాలు మెజారిటీ అభిప్రాయాలను బట్టి జరుగుతాయి. కానీ మెజారిటీ కోసమే జరిగే నిర్ణయాలు కావవి. అందరికోసమూ జరిగే నిర్ణయాలవి. కాని దేశంలో మెజారిటీ మతస్తుల మాటే నెగ్గాలంటూ బీజేపీ ప్రజాస్వామ్యానికి వక్రభాష్యం చెబుతూ, నియంతృత్వానికి బాటలు వేస్తోంది. వ్యక్తిగతమైన మత విశ్వాసాలను, మతాతీతంగా సాగాల్సిన రాజ్యపాలనలోకి బలవంతంగా చొప్పించి వాతావరణాన్ని విద్వేషమయం చేస్తోంది. ఈ వాదనలను ప్రశ్నిస్తే... సహించలేని ఒక ఉక్రోషం, ఉన్మాదంతో దాడులకు పాల్పడుతున్నారు. 'జిన్నా సమర్థకులను వ్యతిరేకించటం హిందువుల విధి' అని బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా బాహాటంగానే అన్నాడు. జిన్నా ప్రతిపాదించిన 'ద్విజాతి' సిద్ధాంతాన్ని బలపరిచింది ఈ హిందూత్వ శక్తులే. 'ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు చావటానికైనా, చంపటానికైనా తాము సిద్ధం' అని యూపీ ముఖ్యమంత్రి యోగి స్థాపించిన 'హిందూ వాహిని' ప్రకటించింది. ఇలాంటి చట్ట విరుద్ధమైన విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా... 'వాషింగ్టన్ పోస్ట్' వంటి అంతర్జాతీయ పత్రికలు సైతం ఈ విద్వేషాన్ని ప్రశ్నిస్తున్నా... ప్రభుత్వం మౌనం పాటించడంలో అర్థమేంటి? 'అహింసాత్మకమయిన మార్గంలో జరిపే సత్యాన్వేషణే హిందూ మత సారాంశం' అని మహాత్మాగాంధీ 'హిందూ మతం అంటే ఏమిటి?' అనే పుస్తకంలో స్వయంగా చెప్పారు. గాంధీజీని హత్య చేయడమేగాక, ఆ హిందూ మత సారాన్ని కూడా నాశనం చేస్తున్నాయి విద్వేష మూకలు.
ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లో చూసినా బీజేపీకి మైనారిటీ ఓట్లే వచ్చాయి. మెజారిటీ ప్రజలు బీజేపీని అంగీకరించలేదు. కానీ తమకు తామే హిందూ మతానికి ప్రతినిధులుగా ప్రకటించేసుకుని, మైనారిటీలపై విద్వేషాన్ని కురిపిస్తూ... తమ రాజకీయ అధికారానికి బాటలు వేసుకున్న పార్టీ బీజేపీ. వీరి కార్ఖానాల్లో తయారయ్యే విద్వేషం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. 'గో పూజను ప్రవేశపెట్టిన మతం... నిర్దయతో అమానుషంగా మనుష్య జాతిని ఎలా బహిష్కరించగలదు?' అంటారు గాంధీ. మైనారిటీల పట్ల, ప్రశ్నించేవారి పట్ల విద్వేషం పెంచుకున్న తర్వాత ప్రజాస్వామిక పాలన ఎలా చేయగలుగుతారు? విద్వేషాలను రెచ్చగొడుతూ మత వైషమ్యాలకు కారణమైతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా అవుతుంది? విద్వేషాలను రెచ్చగొట్టడం జాతీయ సమైక్యత, సమగ్రతలకు పెను ప్రమాదం. అలాంటి మతోన్మాద శక్తులు, వాటిని ప్రోత్సహించేవారు దేశానికి ప్రమాదకరం.