Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించడంతో భారత టెస్టు క్రికెట్లో ఒక పర్వం ముగిసినట్లైంది. దక్షిణాఫ్రికా చేతిలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తరువాత రోజే విరాట్ కోహ్లి ఈ బాంబు పేల్చాడు. వచ్చే నెలలో శ్రీలంకతో బెంగళూరులో మొదటి టెస్టు కోహ్లికి వందో టెస్టు. ఈ మ్యాచ్‌లో ఆడిన తరువాత కావాలనుకుంటే అభిమానుల సమక్షంలో కెప్టెన్సీ నుంచి వీడ్కోలు తీసుకోవచ్చని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) చేసిన ప్రతిపాదనను అతడు తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. ఒక మ్యాచ్‌తో మారిపోయేదేమీ ఉండదని, ఏ పని చేసినా 120 శాతం ఫలితం సాధించాలి. లేనప్పుడు తప్పుకోవాలన్నదే తన ఫిలాసఫీ అని కోహ్లి విస్పష్టంగా చెప్పాడు. చాలా మంది కెప్టెన్లు తాము నిష్క్రమించడానికి ముందు మెరుపులు మెరిపించి అభిమానులతో భేష్ అనిపించుకోవాలని ఆరాటపడతారు. కోహ్లి అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉంటూ వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లి నిష్క్రమణలోనూ తన విలక్షణతను చాటుకున్నాడు. భారత క్రికెట్ జట్టును సమర్థవంతంగా నడిపించడంలో విజయవంతమైన సారథిగా అతనికి మంచి పేరే ఉంది. అతడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ రేటింగ్స్‌లో ఏడవ స్థానంలో ఉన్న భారత జట్టును మెరుగైన స్థితిలో నిలబెట్టడంలో తనదైన ముద్ర వేశాడు. కోహ్లి సారథ్యంలో భారత్ 68టెస్టులు ఆడగా 40మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం 17 మ్యాచ్‌లలోనే ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన 11టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకున్న కోహ్లి సేన, విదేశాల్లో 37 టెస్టులు ఆడి 16 విజయాలను నమోదు చేసుకుంది. 43.6శాతం సగటు విజయాల రేటుతో కెప్టెన్‌గా బాగానే రాణించాడు. అంతకు ముందు కెప్టెన్ ఎంఎస్ దోని ఇతర ఫార్మేట్లలో రాణించినా, టెస్టుల్లో అంతగా క్లిక్ కాలేకపోయాడు. మరో మాజీ కెప్టెన్ , ప్రస్తుత బిసిసిఐ చైర్మన్‌గా ఉన్న సౌరబ్ గంగూలీ 28 టెస్టులు ఆడి 39.3 సక్సెస్ రేటుతో కోహ్లి తరువాతి స్థానంలో నిలిచాడు. ఏ విధంగా చూసినా కోహ్లి సారథ్యంలో భారత టెస్టు క్రికెట్ పరిస్థితి మెరుగుపడిందనేది వాస్తవం.
అయితే, టి-20, వన్డే పార్మేట్లలో ప్రపంచ కప్‌లో కానీ, ఐసిసి అంతర్జాతీయ టోర్నీల్లో కానీ భారత్‌ను విజేతగా నిలపడంలో అతడు విఫలమయ్యాడు. టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటన్నది ఇదమిత్థంగా తెలియరాలేదు. కెప్టెన్‌గా పెరుగుతున్న ఒత్తిడి వల్ల బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నానని, అందుకే తప్పుకుంటున్నానని అతడు ఇచ్చిన వివరణ విశ్వసించేదిగా లేదు. టి-20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లిని తప్పించినప్పుడు అతనికి, బిసిసిఐకి మధ్య సంబంధాలు సవ్యంగా లేవన్న సంకేతాలు వచ్చాయి. కోహ్లికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని బిసిసిఐ చీఫ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలతో కోహ్లి బాహాటంగానే విభేదించాడు. ఆ తరువాత కూడా ఈ విభేదాలను పరిష్కరించేందుకు బిసిసిఐ నుంచి ఎలాంటి ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. ఆటగాళ్ల ఎంపికలో కెప్టెన్ అభిప్రాయాలకు బిసిసిఐ విలువ ఇవ్వలేదన్న విమర్శలూ వినిపించాయి. బిసిసిఐ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా పుత్ర రత్నం జైషా వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. గత ఏడాది టి-20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమిపాలైనప్పుడు పేసర్ మహ్మద్ షమీ పాకిస్థాన్‌కు అమ్ముడుపోయాడంటూ విద్వేషకులు కొందరు ఆయనపై విషం కక్కినప్పుడు కోహ్లి ఏమాత్రం తటపటాయించకుండా తన జట్టు సహచరుడికి బాసటగా నిలిచాడు. మ్యాచ్‌లో ఓటమికి అనేక కారణాలుంటాయి. షమీ సాధించిన విజయాలు మరిచిపోయారా? మరుగునపరిచారా? అటువంటి వారి గురించి ఒక్క నిమిషం ఆలోచించినా వృథానే అంటూ కోహ్లి విద్వేషకుల నోర్మూయించాడు. జట్టులో సమిష్టితత్వాన్ని, ఐక్యతను పెంపొందించడంలో కెప్టెన్‌గా కోహ్లి నూటికి నూరు మార్కులు సంపాదించాడు. జట్టు సభ్యుల బలాలు, బలహీనతలను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రోత్సహించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. కోహ్లి తన దూకుడైన ఆటతీరుతో టెస్టు క్రికెట్‌కే వన్నె తెచ్చాడు. అటువంటి మేటి ఆటగాడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం బాధాకరం. ఆ లోటును భర్తీ చేయగల ఆటగాడు దొరకడం కష్టమే. అయినా, కోహ్లి కేవలం కెప్టెన్సీ నుంచే తప్పుకున్నాడు. జట్టులో సీనియర్ ఆటగాడిగా కొనసాగుతాడు కాబట్టి కోహ్లి నుంచి కొత్త సారథి సహకారం పొందే సౌలభ్యం ఉంటుంది.