Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిత్తశుద్ధిలేని శివపూజలేలరా...' అన్నారు మన పెద్దలు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి వెలువరించిన కీలక ప్రకటనలు ఈ హితోక్తికి సరిగ్గా సరిపోతాయి. విద్యారంగాన్ని, అందులో భాగంగా పాఠశాలలను బలోపేతం చేస్తామంటూ ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఫీజుల నియంత్రణ కోసం చట్టం, సర్కారు బడులన్నింటిలోనూ ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టటానికి వీలుగా చట్టం అనే కీలకాంశాలను ఈ సందర్భంగా ముందుకు తెచ్చింది. ఈ క్రమంలో 'మన ఊరు-మన బడి...' అంటూ ఆర్భాటంగా ప్రకటించింది. ఇక్కడ గమ్మత్తేమిటంటే... ఈ మూడూ ఇప్పటికిప్పుడు కొత్త విషయాలేమీ కావు. గతంలో తెలంగాణ సర్కారు చెప్పినవే. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం నుంచే అమలు చేయాలంటున్న డిమాండ్లు, అందుకు సంబంధించిన నినాదాలే. వీటిపై టీఆర్ఎస్ ప్రభుత్వమే... గతంలో అనేక నిర్ణయాలు తీసుకున్నదనేది గమనార్హం. వాటిని అమలు చేయకుండా పక్కన తొక్కిపెట్టింది కూడా ఈ ప్రభుత్వమే. 2021-22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సందర్భంగా 'వినూత్న విద్యా పథకానికి' సీఎం కేసీఆర్ పురుడు పోశారు. ఇప్పుడు దానికే 'మన ఊరు-మన బడి...' అనే కొత్త పేరు పెట్టారు. కాకపోతే నిధుల కేటాయింపు, అమలుకు కాల వ్యవధిలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసి జనం మీదికి వదిలారు. తాజాగా ప్రకటించిన 'మన ఊరు-మన బడి...'లో బడుల్లో తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను కల్పిస్తామంటూ ప్రభుత్వం నొక్కి వక్కాణించింది. కాకపోతే ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంలోనే పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రపరిచే స్కావెంజర్లను తీసేయటం ద్వారా తన బాధ్యత నుంచి తప్పుకున్న సర్కారు... అక్కడ పారిశుధ్యాన్ని, మరుగుదొడ్ల పరిశుభ్రతను ఎలా కాపాడుతుందన్నది అంతుబట్టకుండా ఉంది.
ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, సర్కారు బడులన్నింటిలోనూ ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టటమనే అంశాలపై ఇప్పటికే వివిధ కమిటీల సిఫారసులు, అనుభవాలు మనకున్నాయి. వాటిని పరిశీలించి, అమలు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు మరోసారి పాతపాటనే ఎత్తుకోవటంలో ఆంతర్యం బోధపడటం లేదు. టీఆర్ఎస్ సర్కారే... 2016లో ఫీజుల నియంత్రణపై తిరుపతిరావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై అధ్యయనం చేసి ఒక సమగ్రమైన నివేదికను సర్కారుకు అందజేసింది. అందులోని ఏ ఒక్క సిఫారసునూ అమలు చేయని ప్రభుత్వం, ఇప్పుడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను ఫీజుల కోసం జలగల్లా పీల్చి పిప్పి చేసిన విద్యా మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిన పాలకులు... అందుకు భిన్నంగా ఇలా కమిటీల పేరుతో కాలయాపన చేయటం అత్యంత బాధ్యతారాహిత్యమనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తు తున్నాయి. ఇక ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టటం పైనా భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అనేది మాతృభాషలోనే సాగాలనేది విద్యారంగ నిపుణులు, మేధావులు చెబుతున్న మాట. ఇది శాస్త్రీయం కూడా. కానీ ఇక్కడే మనం పొరుగు రాష్ట్రాల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మన దగ్గర మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ఆంగ్ల మాద్యమాన్ని బోధించేందుకు అక్కడి సర్కారు నిర్ణయించింది. దీనిపై కొందరు కోర్టుకెళితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే సమయంలో కర్నాటక ప్రభుత్వం... అక్కడి బడుల్లో ప్రాథమిక స్థాయిలో బోధన ఆసాంతం మాతృభాష (కన్నడం)లోనే సాగించేందుకు చర్యలు చేపడితే... దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ చర్యలను తోసిపుచ్చింది. ఈ రెండు అనుభవాలరీత్యా తెలంగాణలో ఇంగ్లీషు మీడియాన్ని అన్ని బడుల్లోనూ అమలు చేయాలంటే... దానికి సమాంతరంగా తెలుగు మాద్యమాన్ని కూడా కొనసాగించాలి. అప్పుడు పిల్లలు తమకు నచ్చిన మాద్యమంలో చదువుకునే వీలుంటుంది. ఇలాంటి అంశాల న్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉపాధ్యాయులు, వారి సంఘాలు, ఆ రంగానికి చెందిన నిపుణులు, మేధావులతో చర్చించి, ఒక సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. తద్వారా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా అక్కడి అవసరాలకు తగ్గట్టుగా బడులను బలోపేతం చేయాలి. అందుకు భిన్నంగా రాష్ట్ర రాజధానిలో కూర్చుని, ఏకోన్ముఖంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎలాంటి ఫలితమూ ఉండబోదు. ఇక్కడే సర్కారు వారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేదంటే 'మన ఊరు- మన బడి...' అనే దాన్ని ఉపాధ్యాయుల విభజన, స్థానికత సమస్యలను పక్కదోవ పట్టించే పాచికగానో లేక వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల స్టంట్గానో భావించాల్సి వస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం... నూతన విద్యా విధానం పేరుతో తీసుకొస్తున్న ప్రమాదకర చర్యలను సైతం తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకూ పల్లెత్తు మాట అనకపోవటం కూడా ఇలాంటి అనేక సందేహాలకు తావిస్తున్నది.