Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్ర పోరాటంతో ఏమాత్రం సంబంధంలేని పార్టీకి అందుకు సంబంధించిన ఇతివత్తాలు ఎలా నచ్చుతాయి? కుల వ్యవస్థ, స్త్రీ పురుష అసమానతలు ఈ సమాజంలో ఇలానే కొనసాగాలని నిత్యం తపించే రాజకీయ పక్షానికి వాటికి వ్యతిరేకంగా పోరాడిన మహౌన్నత యోధుల త్యాగాలు, గాథలు ఎందుకు సహిస్తాయి? వివిధ రంగాల్లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం అదే వైఖరిని రిపబ్లిక్ డే ఉత్సవాలలోనూ ప్రదర్శించింది. గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో మన రాష్ట్రంతో పాటు, అనేక రాష్ట్రాల శకటాలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడం కాక మరేంటి? బీజేపీ పాలిత రాష్ట్రాల శకటాలకు మాత్రమే అనుమతులిచ్చి మిగిలి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడమంటే అది రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.
అమృతోత్సవాల సందర్భం కావడంతో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆ ఫలాలు ప్రజలకు అందిన తీరుకు పట్టం కట్టేలా శకటాలను రూపొందించాలన్నది ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ నిర్దేశం! దీంతో అన్ని రాష్ట్రాలు పట్టుదలతో స్వాతంత్య్ర పోరాటంలో తమ రాష్ట్రాల విశిష్టతలను చాటే శకటాలను రూపొందించాయి. ఇవన్నీ ప్రదర్శనకు నోచుకోవడమంటే దేశ ప్రజలను ఒక్క తాటిపై నడిపిన మహౌజ్వల పోరాట చరిత్రను మళ్లీ గుర్తు చేయడమే! దాని ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. అదే జరిగితే బీజేపీ, దాని పరివారం తామే నిజమైన దేశభక్తులమని ప్రచారం చేస్తున్న అసత్యాలు, ఆ మహత్తర పోరాటంలో తమ పాత్ర ఇసుమంతైనా లేదన్న పచ్చి నిజం దేశ ప్రజానీకం ముందు బద్దలవుతాయి. అందుకే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఏమాత్రం చోటు ఇవ్వరాదని కేంద్ర పాలకులు భావించి వీటిని తిరస్కరించారా? అన్నిటినీ కేంద్రీకతం చేస్తున్నవారు అసలు దేశభక్తుల చరిత్రను చెరిపేద్దామనుకోడంలో వింతేముంది.
రాష్ట్రాల అభీష్టాలను కాలరాస్తూ ఏడేండ్లుగా బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తిని క్రమేణా ధ్వంసం చేస్తున్న మోడీ ప్రభుత్వం తాజాగా ఈ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలే వేదికగా బరితెగించడం అత్యంత దురదష్టకరం! కీలక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు... సంస్కరణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో తమ ఘనతను చాటే ఇతివత్తాలను ప్రతిపాదించగా అవి తిరస్కరణకు గురయ్యాయి. కేరళ సమర్పించిన శకటం ప్రఖ్యాత సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు, 19-20 శతాబ్దాల్లో కింది కులాలవారి ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిన మహానుభావుడు నారాయణగురుకు సంబంధించినది. అలాగే తమిళనాడు శకటంలో స్వాతంత్య్ర ఉద్యమంలో తమిళులు వహించిన ఘనమైన పాత్రను తెలుపుతూ స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ నెలకొల్పిన వివొ చిదంబరనార్, ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడిన మహిళా యోధురాలు రాణి వేలు నాచియర్ విగ్రహాలున్నాయి. బెంగాల్ శకటం నేతాజీ125వ జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని చాటటంతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, అరబిందో వంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటాన్ని, తెలంగాణ ప్రభుత్వ శకటాన్ని కూడా తిరస్కరించింది. కేంద్రం తమ చరిత్రను, సంస్కృతిని, ఘనతను ఒక పద్ధతి ప్రకారం పదేపదే అవహేళన చేస్తున్నదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం తెలిపారు. తమ శకటాల ప్రతిపాదనలను తిరస్కరించినందుకు నిరసన తెలుపుతూ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ప్రధాని మోడీకి లేఖలు రాశారు. కేరళ తన విధానాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాల్సిన గణతంత్ర దినోత్సవాలను సైతం ఏకపక్షంగా మార్చడం, లౌకిక విలువలను పరిహసించేలా వ్యవహరించడం రాష్ట్రాల హక్కులపైనా, రాజ్యాంగంపైనా దాడి చేయడంగానే చూడాలి. ఒక పక్క స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రాష్ట్రాల శకటాలు వ్యక్తం చేయాలని అంటూనే మరోపక్క ఆ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించడం మోడీ ప్రభుత్వ నయవంచనను స్పష్టం చేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ నిరసనను ఏదో రూపంలో వ్యక్తం చేస్తున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం ఈ విషయం ఏమాత్రం పట్టకపోవడం విచారకరం! కనీసం మన శకటం తిరస్కరించబడిందనే సోయి టీఆర్ఎస్ సర్కారుకుందా? దాని కోసం కూడా ఢిల్లీ దర్బారు ముందు దేబిరించాలనుకుంటోందా? రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా అధినాయకుడికి గాని, శ్రేణులకు గాని చీమ కుట్టినట్టైనా లేదా? ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. లౌకిక, ప్రజాతంత్ర స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ వివక్షతను ఖండించాలి. దేశ వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాలరాయదలచడం దేశద్రోహమేగాని దేశభక్తి ఎంత మాత్రం కాదు.