Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్లు మోడీ అంటే పడిచావడానికి కారణం పెద్ద రహస్యమేమీకాదు. ఇప్పటిదాక ఏ పాలకులూ మాట్లాడనంత ఖుల్లాగా ఆయన మాట్లాడుతున్నారు. వారి పక్షాన ఆయన నిలుస్తున్నారు. దానికాయన ఏమాత్రం సిగ్గుపడరు. మొహమాటపడరు. అవి కార్మికకోడ్ల గురించైనా, వ్యవసాయ చట్టాలైనా, ఎన్ఎంపీ అయినా కార్పొరేట్లకు అంటకాగడమే ఆయన జీవిత పరమావధి. డౌట్ ఉండే వాళ్ళు నిన్నగాక మొన్న ఆజాదీకా అమృత మహౌత్సవ్లో ఆయన ప్రవచనాలు వినండి. లేదా చదవండి! ఈ 75ఏండ్లలో ''హక్కుల గురించి మాట్లాడటం, పోట్లాడటం వల్లనే మన దేశం వెనకపడిపోయింద''ట! మిగిలిన పాతికేండ్లూ కఠోర శ్రమ, త్యాగం, తపస్సు ద్వారా మనం అంకిత భావంతో పనిచేస్తే మన దేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందట! ఈ ప్రవచనాలు ఆయన 'బ్రహ్మకుమారీస్'లో ఇచ్చారు. ''మనిషి నిమిత్తమాత్రుడు. జరిగేదాన్ని మనం ఆపలేము. కాబట్టి దాన్ని ఆమోదించడం మంచిది'' ఇదీ బ్రహ్మకుమారీస్ సిద్ధాంతం. మన చుట్టూ జరుగుతున్న దోపిడీని వ్యతిరేకించలేము కాబట్టి తలొంచుకు బతకమనేది ఆ సిద్ధాంత సారాంశం. సరైన ప్లేసే ఎంచుకున్నారు మోడీ సాబ్!
మోడీగారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. 'ఆజాదీ' దేనినుండి? దేనికి 75ఏండ్లు అయ్యింది? బ్రిటిషు సామ్రాజ్యవాదం మనదేశాన్ని పీల్చి పిప్పిచేసిన విధానాన్ని మోడీ ''పూర్వీకులు'' తప్ప (అంటే ఆర్ఎస్ఎస్వారు తప్ప) మిగిలిన యావత్ భారతావని ప్రతిఘటించింది. 1857 వరకు సాగిన మొదటి దశ సుమారు వందేండ్లూ బిర్సా ముండా వంటి గిరిజన తెగల నాయకుల నుండి రాజులు, మహారాజులు, నవాబుల వరకు మనదేశాన్ని పాలించుకునే 'హక్కు' కొరకు ప్రాణాలకు తెగించిపోరాడారు. అప్పటినుంచి 1947 వరకు కొత్తగా ఆవిర్భవించిన పెట్టుబడిదారీ వర్గం దాని రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్, కార్మికవర్గం దాని పార్టీ అయిన కమ్యూనిస్టులే కాక, గదర్వీరుల మొదలు భగత్ సహచరుల వరకు, ఖిలాఫత్ ఉద్యమ కారుల వంటి ఎందరో భరతమాత దాస్య సృంఖలాలు తెంపే హక్కు కోసం బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడారు. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ఆ'హక్కు' కోసం సాగిన పోరే! మోడీకి, ఆయన అంతేవాసులకు ఈ విషయం అర్థం కాదు. జయచంద్రులకి వారసులుకదా? అందుకే నేడు అమెరికన్ సామ్రాజ్యానికి అంటకాగడానికి యథాశక్తి ప్రయత్నిస్తున్నారు.
మోడీతర్కంలో మరో ప్రమాదకర అంశమేమంటే నేడు 'హక్కు'ల కోసం అడిగేవారు వాటికి భంగమొచ్చినప్పుడే అడుగుతున్నారు. ఆక్స్ఫామ్ నివేదిక మనదేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయంటే మన రాజ్యంగంలో ఆర్టికల్ 14 ఏమైనట్లు? దానిని ప్రశ్నించద్దా? వాక్స్వాతంత్య్రం వంటివి గ్యారంటీ చేసిన ఆర్టికల్ 19ని మోడీ సర్కార్ దెబ్బతీస్తుంటే ప్రశ్నించవద్దా? రాజ్యాంగమిచ్చిన జీవించే హక్కునే ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంటే అడగొద్ద్దా? ప్రశ్నించకూడదని మోడీ వాదన. ఒక్కమాటలో చెప్పాలంటే మోడీ సర్కార్ దృష్టిలో ప్రస్తుత రాజ్యాంగమే అడ్డు. అందుకే రాజ్యాంగాన్నే ధ్వంసం చేస్తున్నది.
మోడీ మహాశయుడు ఆయన పరివారం అర్థం చేసుకోవాల్సిన కీలకాంశమేమంటే 'హక్కు'లకు భంగం వాటిల్లినప్పుడే కార్మికుడైనా, రైతైనా తన గొంతు విప్పుతాడు. ఒకరోజు సమ్మె చేస్తే కార్మికులకు జీతం కట్ అవుతుంది. తమ కుటుంబాలను ఇబ్బందుల పాల్జేసుకునేందుకు ఎవరూ 'హక్కు'లంటూ పోరాడరు. ఏడాదిపాటు తమ వ్యవసాయ 'హక్కు' కోసం రైతులు కుటుంబాలను వదులుకుని, ప్రభుత్వం దమనకాండను భరిస్తూ ఎందుకు పోరాడారు? వారి డిమాండ్ సహేతుకమనే కదా మోడీ సర్కార్ ఆ నల్లచట్టాలను వెనక్కి తీసుకుంది? కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికులు పనిచేయకుండా ప్రస్తుత 2.5లక్షల కోట్ల డాలర్ల జీడీపీ ఎలా సాధ్యమవుతుంది? కార్పొరేట్లే సంపద సృష్టికర్తలని మోడీ చెప్పుకున్నా వాళ్ళు లాభాలు వెనకేసుకోగలరు తప్ప సంపదలు సృష్టించలేరు.
మోడీ మాటల వెనుక నిరంకుశ ధోరణి ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఉంది. మార్చగలమనే నమ్మకముంది. ప్రజలకున్న అన్ని హక్కులనూ కాలరాసి వేయాలనే ధృక్పధముంది. 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులున్నారనీ, వారిలో పెద్ద సంఖ్యలో మహిళలున్నారనీ సీఎంఐఇ పేర్కొంది కదా! వీరు తమకు ఉద్యోగాలు కావాలని ఈ ప్రభుత్వాన్ని అడగొద్దా? దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉపాధి లేకపోతే దేశం ముందుకు పోగలదా? వీటన్నింటికీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకే మోడీ సర్కార్ను వీలైనంత త్వరగా సాగనంపకపోతే మనకి మిగిలేది మిగిలిన పాతికేళ్ళకూ ఆయన పెట్టిన లక్ష్యం ''కఠోర శ్రమ'', మన జీవితాల్నే 'త్యాగం' చేయడమే!