Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. బలవంతుల దౌర్జన్యాలూ... ధనవంతుల పన్నాగాలూ... చిరకాలం జరిగిన మోసం... ఇదే కదా చరిత్రసారం...! ఈ చరిత్ర గతి మారేదెన్నడు? సమాజ నిర్మాణానికి నెత్తురు ధారపోసి, నాగరికతకు నడకలు నేర్పిన శ్రామికజనుల హాహాకారాలూ, ఆర్తనాదాలూ, శతాబ్దాల చరిత్రకు రాళ్లెత్తిన కూలీల ఆకలికేకలూ ఏ ప్రగతికి ప్రతీకలు? సమాజ గమనంలో శతాబ్దాలు గడిచినా పెరగడమే తప్ప తరగతని అంతరాలు ఎవరి ప్రగతికి సూచికలు? దావోస్లో జరిగిన 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం'' సమావేశాలూ, దానికి ముందు ఎప్పటిలాగే వెలువడిన ''ఆక్స్ఫామ్'' నివేదికల సారమేమిటి? మానవజాతి పురోగమనానికి దారులు వేసిన జీవితాల్లో ఇంకా ''ఆకలి గీతాలు'' వినిస్తున్నాయనే కదా..!
కాలగతిలో సమాజం సాధించిన పురోగమనాన్ని ఈ తీవ్రమవుతున్న అంతరాలు వెక్కిరిస్తున్నాయి. సంపద నానాటికీ కేంద్రీకృతమవుతుండగా అంతరాలు లేని సమాజం కలగానే మిగిలిపోతోంది. నేటి కరోనా కాలంలో వికృతరూపం దాల్చిన ఈ దోపిడీ మరింత పెట్రేగిపోతున్నది. సామాన్యులను చావనీయకుండా బతకనీయకుండా వేదిస్తున్నది. ఆక్స్ఫామ్ తాజా నివేదికలో వెల్లడైన గణాంకాలు ప్రపంచ వ్యాపితంగా ఈ దోపిడీ పర్వాన్ని ఎత్తిచూపుతున్నాయి. ప్రపంచం సంగతి అటుంచితే కేవలం మనదేశంలోనే గత ఏడాది కొత్తగా 16కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. దేశ జనాభాలో 84శాతం ప్రజల ఆదాయాలు క్షీణించాయి. కేవలం 10శాతం మంది ధనవంతులు మొత్తం దేశ సంపదలో 45శాతం కలిగి ఉండగా, అట్టడుగు పేదల్లో 50శాతం మంది ప్రజలు 6శాతం మాత్రమే కలిగివున్నారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?
''అన్నపురాశులు ఒక చోట - ఆకలి మంటలు ఒక చోట
హంస తూలికలొకచోట - అలసిన దేహాలొకచోట
సంపదలన్నీ యొకచోట - గంపెడు బలగంబొకచోట'' అంటూ కాళోజీ ఏనాడో ఎత్తి చూపిన ఈ అసమానతలు ఈనాటికీ కొనసాగడమే కాదు, మరింత తీవ్రమవడం అవాంఛనీయం, అమానవీయం. పిడికెడు మంది అపారమైన సంపదలననుభవిస్తుండగా, అసంఖ్యాకులైన ప్రజలు అంతులేని దారిద్య్రంలో అలమటించడాన్ని ఎలా భరించగలం?
నేడు అన్నీ ఉన్నవాడికి బతుకే కాదు, చావుకూడా ఓ పండగే. అందుకేనేమో ''స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళిలాంటిదే'' అన్నాడు శ్రీశ్రీ. కానీ ఏమీ లేనివాడి బతుకే దుర్భరం. చావుకుముందు బతకాలంటే కనీసం నాలుగు వేళ్లయినా నోట్లోకి పోవాలి కదా? జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా పూట గడవని ప్రజల జీవితాలు దేనికి సంకేతాలు? వికృతమైన, విస్తృంఖలమైన దోపిడీకి కాదా..? కరోనా పేరుతో నష్టాల సాకు చూపి కార్మికులకూ, వారి వేతనాలకూ కోత విధించిన యజమానులు కోటాను కోట్లు పోగేసుకోగా, కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం ఓ విషాదమైతే... ఈ కష్ట సమయంలో ప్రజలకు దన్నుగా నిలబడాల్సిన ప్రభుత్వాలు ఈ దోపిడీకి వంతపాడటం మహా విషాదం. ఫలితంగా రాళ్లెత్తిన కూలీల రక్తమాంసాలతో ఈ ప్రపంచం అభివృద్ధి చెందడం ఎంత నిజమో, ఆ అభివృద్ధికి కారణమైన శ్రామిక జనావళి ఆకలి కేకలు వేస్తున్నది కూడా అంతే నిజమని ఈ ఆక్స్ఫామ్ నివేదిక మరోసారి రుజువు చేస్తున్నది.
కనుక మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు... ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి, పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? అనే ప్రశ్న వేసుకోవాల్సిన తరుణమిది. సంపదలో వాటా ప్రజలందరి హక్కు అని పోరాడవలసిన సమయమిది. కానీ ఈ హక్కులూ, పోరాటాలు ''టైమ్వేస్ట్'' వ్యవహారాలంటున్నారు పాలకులు. ఈ 75ఏండ్లూ అందువల్లనే నష్టపోయామని వాపోతున్నారు!? అంటే ఈ దోపిడీ నిలువునా దహిస్తున్నా తలొంచుకుని బతుకమనేనా వారు చెప్పదలచుకున్నది? అయినా మనుషుల్ని మనుషులుగా గాక మతానికి పుట్టిన పుట్టగొడుగులుగానో, కులం గొడ్లు ఈనిన బలిపశువులుగానో చూసేవారు ఇంతకన్నా ఏం చెప్పగలరు? అయినా మన పిచ్చిగానీ... ఎక్కాల్సిన పీఠాల కోసం మనిషిని మతం పేర జాతిపేర ముక్కలు చేసేవారు సమాజాన్ని శాంతివైపు, సమతవైపు నడిపించగలరా..? వారికి తెలిసిందల్లా నడవాల్సిన దారుల నిండా అసమానతల అగ్గిరాజేసి బతుకుల్ని బుగ్గి చేయడమే. ప్రజలను మాయచేయడానికి నిత్యం అలజడి నదుల్ని పారించి, అభద్రతా తీరాలను పోటెత్తించి, అజ్ఞానపు సొరంగాలు తవ్వి కాలాన్ని అంధకారంలోకి మళ్లించాలనుకునే వారు సమానత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? అసమానతలను ఎందుకు తొలగిస్తారు? అందుకే ''ఈ దేశపు పవిత్ర మట్టిలో ఏ పోరాటాల్నీ విత్తకండి, ఏ హక్కుల్నీ నినదించకండి, ఏ అసమానతలనూ ప్రశ్నించకండి. సమస్తాన్నీ మాకప్పగించి నిశ్చింతగా నిద్రపొండి. కేవలం ఐదేండ్లకోసారి చూపుడు వేలుపై వాత మాత్రం పెట్టుకోండి'' అంటున్నారు! మరి ఏం చేద్దాం...?