Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాల హక్కులను హరించడమే లక్ష్యంగా చేసుకున్న కేంద్రంలోని మోడీ సర్కార్ తాజాగా మరో దాడికి తెగబడింది. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన ఐఎఎస్ అధికారినైనా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డిప్యుటేషన్‌పై తాను తీసుకుపోయేందుకు అనుగుణంగా నిబంధనలకు కేంద్రం మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రాల సమ్మతితో ఆ పని చేసిన కేంద్రం.. ఇకపై రాష్ట్రాల అవసరాలు, అనుమతులతో సంబంధం లేకుండా ఆ పనిని చేసే విధంగా మార్పులకు పూనుకొంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది.
సర్కారియా కమిషన్ సైతం కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకుని వ్యవహరించే ఒక ఏర్పాటు ఉండాలని సిఫార్సు చేసింది. వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ఇంటర్-స్టేట్ కౌన్సిల్ (అంతర్రాష్ట్ర సలహా మండలి) వేదికగా ఈ సంప్రదింపులు జరగాలని సూచించింది. ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో తీర్పు చెపుతూ... రాష్ట్రాలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలు కావని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం నిలబెట్టాలే తప్ప తోసిరాజనకూడదని కూడా సుప్రీం కోర్టు చెప్పింది. సహకార ఫెడరలిజం మన రాజ్యాంగ మౌలిక స్వభావం అని కూడా స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అధికారాలను తెలుపుతోంది. కాని ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కీలకమైన మార్పులను జారీ చేసేస్తోంది. ఈ ధోరణిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాలను ఎటువంటి చర్చలో భాగస్వాముల్ని చేయకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అంటూ ఇప్పటికే అనేకమార్లు అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. నిరసనలు తెలిపాయి. అయినా కేంద్రం తన మొండివైఖరిని వీడటంలేదు.
రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో తమకు ఇష్టం వచ్చిన వారిని ఒక్క కలం పోటుతో రాష్ట్రం నుంచి ఢిల్లీకి రప్పించుకొనే విధంగా 1954 నాటి క్యాడర్ రూల్స్‌ను మార్చాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కేంద్రం కోరిన అధికారిని రాష్ట్రం తన అవసరాలతో సంబంధం లేకుండా డిప్యుటేషన్ పై పంపించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ కేడర్ రూల్స్ మార్పులపై గత ఏడాది మూడు సార్లు కేంద్రం పంపిన ప్రతిపాదనలను బీజేపీయేతర తొమ్మిది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ న్యాయమంత్రి పి.రాజీవ్ కార్యనిర్వాహక అధికారం కేంద్రం దగ్గర కేంద్రీకతం కావడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. కొత్త నిబంధనలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. బీహార్‌లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ ప్రభుత్వం కూడా కేంద్రం ప్రతిపాదనలను అంగీకరించలేదు. తెలంగాణ, జార్ఖాండ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీసగఢ్ రాష్ట్రాలు సైతం కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు మాత్రం చప్పుడు చేయడంలేదు. స్పందించాల్సినప్పుడు స్పందించక పోవడమే రాష్ట్రాలు ఇప్పటిదాకా చేసిన పోరపాటు.. ఆ పొరపాట్లే జీఎస్టీ రూపంలో, డిమానిటైజేషన్ రూపంలో ఇప్పటికీ రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. అందుకే రాష్ట్రపరిధిలోని వ్యవసాయంపై కూడా కేంద్రం పెత్తనం చేయచూస్తే నాగలి కర్రులు తిరగబడ్డాయి. ఇంకా విద్యుత్ సవరణ బిల్లు, లేబర్ కోడ్స్ కత్తులు వాటి మెడ మీద వెలాడతూనే ఉన్నాయి. వీటన్నింటికి కారణం సరైన సమయంలో సరైన రీతిలో రాష్ట్రాలు స్పందించకపోవడమే. మరల ఇప్పుడు కూడా అదే తప్పు చేయడానికి ఆ రాష్ట్రాలు సిద్దపడుతున్నాయా అన్నది ఆలోచించుకోవాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అధికారిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సదరు అధికారి సమ్మతి కావాలి. ఆ అధికారి కనుక సిద్ధపడకపోతే తీసుకోవడమే కుదరదు. అలాంటిది ఇప్పుడు దాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ... ఎవరి సమ్మతితో పని లేకుండా కేంద్రం ఒంటెత్తు పోకడ పోవడం రాజ్యాంగ విరుద్ధం. అసలు రాష్ట్రాలలో ఉన్న సమర్థులైన అధికారులను కేంద్రం లాక్కుంటే రాష్ట్రాలల్లో పాలన కుంటుపడు తుంది కదా!. అలా కాకపోయినా రాజకీయంగా తమకు చేదోడు వాదోడుగా ఉండే అధికారులను కేంద్రం ఏదో వంకతో ఢిల్లీకి తీసుకెళితే కూడా రాష్ట్రాల పాలనపై రాష్ట్ర రాజకీయ నాయకత్వానికి పట్టు ఉండదు కదా..? కేంద్రం ప్రతిపాదనల వెనుక ఈ రాజకీయ కోణం ఉందనేది స్పష్టం. ఇప్పటికే కావాల్సినంత మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేరని తెలంగాణ లాంటి రాష్ట్రాలు అనేక సార్లు కేంద్రం దృష్ఠికి తెచ్చాయి. అయినా వాటిని పట్టించుకోని బీజేపీ సర్కార్.. ఇప్పుడు ఉన్న అధికారులను లాక్కుంటే పాలన ఎలా సాగిస్తాయి? ఈ విధంగా రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలను కేంద్రం ఏకపక్షంగా తన చేతుల్లోకి తీసుకోవడం చాలా తీవ్రమైన విషయం. ఈ విధంగా కొన్ని అంశా లను ఉమ్మడి జాబితాలో చేర్చడం వలన క్రమంగా అవి కేంద్రం తన చేతుల్లోకి లాక్కుంటుందనే భయాన్ని రాజ్యాంగ సభ సభ్యులు కొందరు ఆనాడే వ్యక్తం చేశారు. ఆ భయాలు వాస్తవమేనని ఇప్పటి పరిణామాలు రుజువు చేస్తున్నాయి.